జనం గుండెల్లో షైన్ అవుతోంది హోండా షైన్. జనాన్ని జాప్యం లేకుండా గమ్యస్థానానికి చేరవేసే, తక్కువ ధర – మైలేజ్ బైక్‌గా పాపులర్ అయింది.
ఎప్పుడో 19 ఏళ్ల క్రితం, 2006లో లాంచ్ అయిన ఈ బైక్ ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతోంది, ఇప్పటికీ ప్రజాదరణ పొందుతోంది. ఈ విషయాన్ని మేం చెప్పడం లేదు, ఈ బండి అమ్మకాల గణాంకాలే చెబుతున్నాయి. హోండా షైన్ బైక్‌ను గత నెలలో (ఏప్రిల్ 2025) 1.69 లక్షల మంది కొనుగోలు చేశారు. గత సంవత్సరం అదే నెలతో పోలిస్తే అమ్మకాల్లో ఇది 18 శాతం పెరుగుదల.
హోండా షైన్ 125 ఎక్స్-షోరూమ్ ధర (Honda Shine 125 ex-showroom price) రూ. 83,000 నుంచి రూ. 87,000 మధ్య ఉంటుంది. హోండా షైన్ 100 ఎక్స్-షోరూమ్ ధర (Honda Shine 100 ex-showroom price) దాదాపు 67,000 రూపాయలు. 2025 మోడల్ హోండా షైన్‌లో పూర్తిగా డిజిటల్ డాష్‌బోర్డ్ ఏర్పాటు చేశారు. పేద & దిగువ మధ్యతరగతి ప్రజలు కూడా భరించగలగే ధర, మెరుగైన మైలేజ్, తక్కువ నిర్వహణ ఖర్చుల కారణంగా ఈ బైక్ బడ్జెట్ రైడర్లకు బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తోంది.
హోండా షైన్ అప్‌డేటెడ్ ఫీచర్లు
హోండా షైన్ గత అప్‌డేట్‌లో రియల్ టైమ్ మైలేజ్ ఇండికేటర్ (Real-time Mileage Indicator) & డిస్టాన్స్ టు ఎమ్టీ (Distance to Empty) వంటి కొన్ని కొత్త ఫీచర్లను యాడ్ చేశారు. ఈ హోండా బైక్‌లో డాష్ బోర్డ్ దగ్గర USB-టైప్ C పోర్ట్ ఇన్‌స్టాల్ చేశారు, తద్వారా బైక్‌పై ప్రయాణించే సమయంలో కూడా మొబైల్ ఫోన్‌ను సులభంగా ఛార్జ్ చేయవచ్చు & దూర ప్రయాణాల్లోనూ మీ ఫోన్ ఛార్జింగ్ ఎప్పటికీ ఐపోకుండా చూసుకోవచ్చు.
హోండా షైన్ పవర్ & మైలేజ్
క్రితం అప్‌డేట్‌లో, హోండా షైన్ ఇంజిన్‌ను కూడా నవీకరించారు & తాజా OBD-2B నామ్స్‌ను యాడ్ చేశారు. ఇంజిన్ అప్‌డేషన్ తర్వాత కూడా ఇది మునుపటి పవర్ & పౌరుషంతో పని చేస్తుంది. ఈ బైక్‌లో 4-స్ట్రోక్, SI, BS-VI ఇంజిన్ అమర్చరారు, ఇది 7,500 rpm వద్ద 7.9 kW పవర్ పొందుతుంది & 6,000 rpm వద్ద 11 Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది.
ARAI (Automotive Research Association of India) సర్టిఫై చేసిన ప్రకారం, హోండా షైన్ 125 మైలేజ్ (Honda Shine 125 Mileage) లీటర్‌కు 55 కిలోమీటర్లు. ఈ టూవీలర్‌కు 10.5 లీటర్ల ఇంధన ట్యాంక్ ఉంది. అంటే.. ట్యాంక్‌ను ఫుల్ చేస్తే ఈ బైక్‌ను 575 కిలోమీటర్లు సులభంగా నడపవచ్చు. ARAI ప్రకారం, హోండా షైన్ 100 మైలేజ్ (Honda Shine 100 Mileage) లీటర్‌కు 70 కిలోమీటర్లు. ఈ బండికి 10 లీటర్ల ఇంధన ట్యాంక్ ఉంది, దీనిని పూర్తిగా నింపితే 700 కిలోమీటర్లు రైడ్ ఇస్తుంది. అయితే, రైడింగ్ స్టైల్, వాతావరణ పరిస్థితులు, ట్రాఫిక్ & బండి నిర్వహణపై ఈ మైలేజ్ ఆధారపడి ఉంటుంది.
































