కోల్‌కతా కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆర్‌జీ కర్ హాస్టిపల్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌తో పాటు నిందితుడు సంజయ్ రాయ్‌కి లై డిటెక్టర్ టెస్ట్ చేసేందుకు సీబీఐ కోర్టు అనుమతి తెచ్చుకుంది. అయితే..వీరిద్దరితో పాటు హాస్పిటల్‌లో నలుగురు వైద్యులకూ ఇదే టెస్ట్ చేయాలని భావిస్తున్నారు అధికారులు. ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. వాళ్లకి ఈ ఘటనతో ఏమైనా సంబంధం ఉందా అన్న కోణంలో విచారణ జరపనున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం సంజయ్ రాయ్ సెమినార్ హాల్‌లోకి ఉదయం 4.03 గంటలకు వెళ్లాడు. ఆ సమయంలో ట్రైనీ డాక్టర్ నిద్రపోతోంది. అప్పుడే ఆమెపై దాడి చేసి హత్యాచారం చేశాడు. 4.40 గంటలకు బయటకు వచ్చాడు. బాధితురాలు 4.15, 4.30 గంటల మధ్యలో చనిపోయినట్టు భావిస్తున్నారు. అయితే…సెమినార్ హాల్‌లో ఇద్దరు ఫస్టియర్ PGT డాక్టర్‌ల ఫింగర్‌ప్రింట్స్‌ని గుర్తించారు పోలీసులు. వీళ్లిద్దరితోనే కలిసి బాధితురాలు డిన్నర్ చేసింది. ఆ తరవాత అక్కడి నుంచి సెమినార్ రూమ్‌కి వెళ్లింది. వీళ్లిద్దరితో పాటు మరో డాక్టర్‌కీ లై డిటెక్టర్ టెస్ట్ చేయనున్నారు.
ఆ నలుగురు ఏం చెప్పారు..?
సీసీటీవీ ఫుటేజ్‌లో ఈ డాక్టర్ ఫస్ట్ ఫ్లోర్‌లోని ఎమర్జెన్సీ నుంచి థర్డ్ ఫ్లోర్‌కి వెళ్లినట్టు సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. మరో ఇంటర్న్ కూడా అక్కడే ఉన్నట్టు గుర్తించారు. చివరిసారిగా బాధితురాలి ఆ ఇంటర్న్‌తోనే మాట్లాడింది. DNA ఎవిడెన్స్ ప్రకారం చూస్తే వీళ్లెవరితోనూ క్రైమ్‌తో సంబంధం లేదని తేలినప్పటికీ..సాక్ష్యాధారాలను తప్పుదోవ పట్టించేందుకు ఏమైనా ప్రయత్నించారా అన్నది తేల్చేందుకు ఈ టెస్ట్ చేయనున్నారు. ఈ నలుగురూ చెబుతున్న వివరాల ప్రకారం చూస్తే…అర్ధరాత్రి 12 గంటలకు ఇద్దరు ట్రైనీ డాక్టర్‌లు బాధితురాలితో కలిసి డిన్నర్ చేశారు. ఆ తరవాత సెమినార్ రూమ్‌లో ఒలింపిక్స్ జావెలిన్ ఫైనల్ గేమ్ చూశారు. స్లీప్ రూమ్‌లో మరేదో టెస్ట్ జరుగుతుండడం వల్ల ఈ ముగ్గురూ సెమినార్ రూమ్‌లోనే విశ్రాంతి తీసుకోవాలనుకున్నారు.
స్లీప్ రూమ్ సంగతేంటి..?
అయితే…స్లీప్ రూమ్‌లో టెస్ట్ అయ్యాక బాధితురాలితో ఉన్న ఇద్దరు డాక్టర్లు అక్కడికి వెళ్లిపోయారు. బాధితురాలు మాత్రం సెమినార్ రూమ్‌లోనే ఉండిపోయింది. హౌజ్ స్టాఫ్ మెంబర్ ఫస్ట్ ఫ్లోర్‌లోని ఎమర్జెన్సీ వార్డ్‌లో డ్యూటీలో ఉన్నాడు. తెల్లవారుజామున 2.45 గంటలకు మూడో అంతస్తుకి వెళ్లాడు. 3.30-3.45 గంటల మధ్యలో మళ్లీ వచ్చేశాడు. సెమినార్ రూమ్‌లో నుంచి ఎలాంటి శబ్దమూ వినిపించలేదని వీళ్లంతా చెబుతున్నారు. తెల్లవారి ఫస్టియర్ డాక్టర్ సెమినార్ రూమ్‌లో డెడ్‌బాడీని గుర్తించి హాస్పిటల్ యాజమాన్యానికి సమాచారం అందించాడు. ఈ నలుగురూ ఇచ్చిన స్టేట్‌మెంట్స్‌ని సీబీఐ పరిశీలిస్తోంది. కొన్ని విషయాల్లో పొంతన కుదరకపోవడం వల్ల అనుమానం వ్యక్తం చేస్తోంది. అందుకే లై డిటెక్టర్ టెస్ట్ చేయాలని నిర్ణయించుకుంది. మొత్తంగా ఈ కేసులో ఎవరు నిజం చెబుతున్నారో..? ఎవరు నిజాన్ని దాచి పెడుతున్నారో త్వరలోనే క్లారిటీ రానుంది. ఇప్పటికైతే సీబీఐ అన్ని కోణాల్లోనూ విచారణ కొనసాగిస్తోంది.