ఉమ్మడి కర్నూలు జిల్లాలో భాగమైన శ్రీశైలం క్షేత్రాన్ని నూతనంగా జిల్లా కాబోతున్న మార్కాపురంలో కలపాలని ఆ ప్రాంతవాసులు తమ అభిప్రాయాన్ని తెరపైకి తీసుకొచ్చారు.
ఈ ప్రచారం సద్దుమణగక ముందే ఆ క్షేత్రాన్ని కర్నూలు జిల్లాలోకి తీసుకోవాలని ఈ ప్రాంతవాసులు మరో నినాదం ఎత్తుకున్నారు. కృష్ణా, తుంగభద్ర నదులు నంద్యాల జిల్లాలో భాగమైన శ్రీశైలం జలాశయంలో కలుస్తాయి. ఈ నేపథ్యంలో శ్రీశైలాన్ని కర్నూలులో కలిపితే నీటి ప్రాజెక్టులు ఒకే ఎస్ఈ కిందికి వస్తాయని, పరిపాలనా పరంగా ఎలాంటి సమస్యలు తలెత్తవని పలువురు మేధావులు చర్చించుకుంటున్నారు. మొత్తంగా నందికొట్కూరును కర్నూలు జిల్లాలో కలపడంతో పాటు శ్రీశైలాన్ని కలపాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. వీటిపై మంత్రివర్గ ఉపసంఘం, ముఖ్యమంత్రి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోననే ఉత్కంఠ నెలకొంది.
మూడుగా రూపాంతరం..
ఏపీలో జిల్లాల పునర్విభజన చేపడితే రెండుగా ఉన్న ఉమ్మడి కర్నూలు జిల్లా, మూడు జిల్లాలుగా రూపాంతరం చెందనుంది. పరిపాలనా సౌలభ్యం కోసం గత వైసీపీ ప్రభుత్వం 2022లో ఏడేసి నియోజకర్గాల చొప్పున కర్నూలు, కోడుమూరు, ఎమ్మిగనూరు, ఆదోని, ఆలూరు, పత్తికొండ, మంత్రాలయం నియోజకవర్గాలు కలిపి కర్నూలు జిల్లాగా.. నంద్యాల, శ్రీశైలం, నందికొట్కూరు, ఆళ్లగడ్డ, పాణ్యం, డోన్, బనగానపల్లె నియోజకవర్గాలతో కలిసి నంద్యాల జిల్లాను విభజించి పాలన సాగించింది. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఎన్నికల ముందు హామీలో భాగంగా రాష్ర్ట వ్యాప్తంగా మరో 6 జిల్లాలను పెంచేందుకు కసరత్తు చేస్తోంది.
అదోని జిల్లాగా ప్రతిపాదన
అందులో భాగంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎప్పటి నుంచో ప్రతిపాదనలో ఉన్న ఆదోనిని జిల్లా చేసే యోచనలో ఉంది. ఆదోని జిల్లాగా మారితే నంద్యాల, ఆదోని ఐదేసి నియోజకవర్గాలు, కర్నూలు నాలుగు నియోజకవర్గాలతో జిల్లాలుగా రూపాంతరం చెందనున్నాయి. ఆదోనిని జిల్లా చేస్తే.. వాటి పరిధిలో ఆదోని, ఆలూరు, పత్తికొండ, ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాలతో జిల్లాగా మారనుంది.
నంద్యాల పరిధిలోకి..
ఇక, నంద్యాల జిల్లా పరిధిలో నంద్యాల, ఆళ్లగడ్డ, శ్రీశైలం, పాణ్యం, బనగానపల్లె, కర్నూలు జిల్లా పరిధిలో కర్నూలు, కోడుమూరు, డోన్, నందికొట్కూరు నియోజకవర్గాలతో జిల్లాగా ఏర్పడనుంది. ఇది వరకు నంద్యాల జిల్లా పరిధిలో ఉండే నందికొట్కూరు, డోన్ నియోజకవర్గాలు కర్నూలు జిల్లా కేంద్రానికి అత్యంత సమీపంలో ఉండడంతో వీటిని కర్నూలు జిల్లాలో చేర్చనున్నారు.
శ్రీశైలానికి అందుకే ప్రాధాన్యం..
అదే క్రమంలో మొన్నటి వరకు శ్రీశైలాన్ని కొత్తగా జిల్లాగా మారనున్న మార్కాపురంలో కలపాలని ఆ ప్రాంత ప్రజలు తమ అభిప్రాయాన్ని తెరపైకి తెచ్చారు. 1808లో మద్రాస్ ప్రెసిడెన్సీ పరిధిలో ఉన్న రాయలసీమలోని కొంత ప్రాంతాన్ని కర్నూలు జిల్లాగా ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి నేటి వరకు కూడా శ్రీశైలం ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే ఉంది. ద్వాదశ జోతిర్లాంగంతో పాటు అష్టాదశ శక్తి పీఠం కొలువై విశిష్ట ప్రాధాన్యతను శ్రీశైలం కలిగి ఉంది. అలాంటి క్షేత్రాన్ని ఉమ్మడి కర్నూలులోనే ఉండేలా పోరాడుతామని, మార్కాపురంలో కలవకుండా కాపాడుకుంటామని రాష్ర్ట మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డిలు తేల్చి చెప్పారు.
కర్నూలు జిల్లాలో ఎందుకు కలపాలంటే..
ప్రస్తుతం ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి జిల్లాగా ఏర్పాటైన నంద్యాల జిల్లాలో శ్రీశైలం, సప్తనదుల సంగమేశ్వరం, ఏపీలోనే ఏకైక సరస్వతీ క్షేత్రమైన కొలనుభారతీ, అహోబిలం, మహానంది, యాగంటి, రుద్రకోడూరు, ఓంకారం, నాగలూటి వీరభద్ర స్వామి, చిన్న గుమ్మితం, పెద్ద గుమ్మితం, నల్లమల తిరుమల వంటి పుణ్య క్షేత్రాలున్నాయి. అలాగే కృష్ణానది, తుంగభద్ర, కేసీ కెనాల్, హంద్రీ-నీవా, పోతిరెడ్డిపాడు, బానకచర్ల వంటి ప్రాజెక్టులున్నాయి. అలాగే ప్రపంచంలోనే రెండో కేబుల్ బ్రిడ్జి, దేశంలోనే మొదటి తీగల వంతెనను నిర్మించే సిద్దేశ్వరం ప్రాంతం ఈ జిల్లాలోనే ఉంది. ఆదోని జిల్లా అయితే.. వాటి పరిధిలో మంత్రాలయం, ఉరుకుందు ఈరన్న క్షేత్రాలు మాత్రమే ఉన్నాయి. వీటి పరిధిలో తుంగభద్ర నది ప్రవహిస్తోంది. ఇక కర్నూలు జిల్లా విషయానికొస్తే.. జిల్లాలో జగన్నాథ గట్టు తప్ప ఎలాంటి ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం లేదు. ఇక కృష్ణా, తుంగభద్ర, కేసీ కెనాల్ నదులు మాత్రమే జిల్లాలో ప్రవహిస్తున్నాయి. అందువల్ల శ్రీశైలంను కర్నూలు జిల్లాలో కలిపితే శ్రీశైలం క్షేత్రంతో పాటు సప్తనదుల సంగమేశ్వరం, కొలనుభారతీ సరస్వతీ క్షేత్రం, రుద్రకోడూరు వంటి క్షేత్రాలు కర్నూలు జిల్లా పరిధిలోకి వస్తాయి. అలాగే కృష్ణానది సీ.బెళగల్ మండలంలోని గుండ్రేవుల గ్రామం మీదుగా శ్రీశైలం జలాశయంలో కలిపోతుంది. అందుకని శ్రీశైలం కర్నూలు జిల్లాలో ఉంటే పరిపాలనా పరంగా నీటి పారుదల శాఖకు సంబంధించిన ఎస్ఈ ఒకరే ఉంటారని, అలా కాకుండా నంద్యాల జిల్లాలో ఉంటే ఇద్దరు ఎస్ఈల పరిధిలో ఈ ప్రాజెక్టులుంటాయని, వీటి పరంగా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని జిల్లా మేధావులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మారనున్న మండలాల స్వరూపాలు
కొత్త జిల్లాల ఏర్పాటు కసరత్తులో భాగంగా మండలాలు, గ్రామాల స్వరూపాల మార్పు కోసం ముఖ్యమంత్రి మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. అందులో భాగంగానే ఆగస్టు 29న అభిప్రాయాల సేకరణ కోసం మంత్రులు రావాల్సి ఉండగా ఆ కార్యక్రమం రద్దయింది. అయితే కర్నూలు, కోడుమూరు, ఎమ్మిగనూరు, ఆదోని, ఆలూరు, పత్తికొండ, మంత్రాలయం నియోజకవర్గాలు కలిపి కర్నూలు జిల్లాగా.. నంద్యాల, శ్రీశైలం, నందికొట్కూరు, ఆళ్లగడ్డ, పాణ్యం, డోన్, బనగానపల్లె నియోజకవర్గాలతో కలిసి నంద్యాల జిల్లాగా, ఆదోని, ఆలూరు, పత్తికొండ, ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాలతో జిల్లాగా మారనుంది. అదే క్రమంలో శ్రీశైలం, సుండిపెంట, ఆత్మకూరు, కొత్తపల్లి మండలాలతో కలిపి శ్రీశైలం నియోజకవర్గం, డోన్, ప్యాపిలీ, క్రిష్ణగిరితో డోన్ నియోజకవర్గం, కల్లూరు, ఓర్వకల్, వెల్దుర్తి కర్నూలు కలిపి కర్నూలు అర్బన్ నియోజకవర్గం చేస్తే బావుంటుందని ఆయా ప్రాంతాల ప్రజలు అభిప్రాయపడుతున్నారు. మరీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.































