ఏపీలో వర్క్ ఫ్రమ్ హోం విధానంలో ఉద్యోగాల కల్పన కోసం ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రభుత్వం ఆన్ లైన్, ఆఫ్ లైన్ విధానాల్లో అర్హుల నుంచి దరఖాస్తుల్ని స్వీకరించింది.
దీంతో ప్రస్తుతం నిరుద్యోగులుగా ఉన్న వారితో పాటు ఇప్పటికే ఏదో ఒక ఉద్యోగం చేస్తున్న వారు కూడా భారీ ఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో వీరిలో నుంచి అర్హుల్ని గుర్తించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది.
కౌశలం సర్వే పేరుతో రాష్ట్రంలో నిర్వహించిన వర్క్ ఫ్రమ్ హోం దరఖాస్తుల స్వీకరణకు రాష్ట్రంలో భారీ స్పందన వచ్చింది. ఇప్పటికే లక్షల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. వర్క్ ఫ్రమ్ హోం ఆప్షన్ ఇస్తున్న నేపథ్యంలో ఇప్పటికే పలు చోట్ల పని చేస్తున్న వారు కూడా దీనికి దరఖాస్తు చేసుకున్నారు. 10వ తరగతి, ఆ పైన అర్హతలు ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చని మాత్రమే పేర్కొనడం, ఇప్పటికే ఉద్యోగాల్లో ఉన్న వారు అర్హులు కాదని చెప్పకపోవడంతో భారీగా అప్లికేషన్స్ వచ్చాయి.
ఇప్పుడు వీటిని క్షేత్రస్ధాయిలో పరిశీలన చేసి దరఖాస్తు దారుల్లో ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్న వారు ఎందరు, ఎలాంటి ఉద్యోగం, ఉపాధి లేని వారు ఎందరు అన్నది తేల్చాల్సి ఉంది. ఇందుకోసం ప్రభుత్వం సచివాలయాల యాప్ లో క్షేత్రస్దాయి పరిశీలన చేసి వివరాలు ఇచ్చేందుకు ఆప్షన్స్ ఇచ్చింది. ఇందులో అందుబాటులో ఉన్న వారు, చనిపోయిన వారు, ఆసక్తి లేని వారు, ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్న వారు, ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్న వారిగా వర్గీకరించారు.
ఈ కేటగిరీల్లో దరఖాస్తుదారులు ఏ కేటగిరీకి చెందిన వారో సచివాలయ ఉద్యోగులు క్షేత్రస్దాయిలో సర్వే చేసి వివరాలు యాప్ లో అప్ లోడ్ చేయాలి. ఇలా అందిన వివరాల మేరకు ప్రభుత్వం మరో జాబితా తయారు చేయనుంది. ఇందులో ఏ ఉపాధీ, ఉద్యోగం లేని వారికి ముందుగా వర్క్ ఫ్రమ్ హోం ఆప్షన్ తో ఉద్యోగాల కల్పన కోసం ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత మిగిలిన వారిని పరిగణనలోకి తీసుకుంటారని తెలుస్తోంది. రాష్ట్రంలో ఈ ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం వర్క్ ఫ్రమ్ హోంను కూడా కీలకంగా పరిగణిస్తోంది.
































