గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు మార్కెట్ లో తక్కువ ధరకే లభించే ఎన్నో రకాల చేపలు ఉన్నాయి. వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండటం వల్ల గుండెకు ఎంతో మేలు జరుగుతుంది.
కొన్ని రకాల చేపలను తినడం ద్వారా గుండెపోటు, ఇతర గుండె సంబంధిత సమస్యలను నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు. వైద్యుల సలహా ప్రకారం.. వారానికి రెండు సార్లు చేపలు తినడం మంచిది. ముఖ్యంగా తక్కువ కొవ్వు ఉన్న చేపలు గుండె ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయి.
ఆంకోవీస్ (Anchovies).. ఈ చేప రుచి అందరికీ నచ్చకపోయినా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. కేవలం 100 గ్రాముల ఆంకోవీస్ లో దాదాపు 2000 mg ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లభిస్తాయి. ఇవి గుండె పనితీరును మెరుగుపరచి రక్త నాళాలను ఆరోగ్యంగా ఉంచుతాయి.
మాకేరెల్ (Mackerel).. శరీరానికి బలాన్నిచ్చే చేపగా దీనికి పేరుంది. 100 గ్రాముల మాకేరెల్ లో సుమారు 4500 mg ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి గుండె సంబంధిత వ్యాధులు, స్ట్రోక్ వంటి వాటిని నివారించడంలో తోడ్పడతాయి.
సాల్మన్ (Salmon).. ప్రపంచవ్యాప్తంగా బాగా ప్రాచుర్యం పొందిన సాల్మన్ లో ఒమేగా 3 అత్యంత సమృద్ధిగా ఉంటుంది. దాదాపు 110 గ్రాముల సాల్మన్ చేపలో 4000 mg ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇది గుండెతో పాటు చర్మం, మెదడు ఆరోగ్యానికి కూడా సహాయపడుతుంది.
సార్డిన్ (Sardines).. కేరళ ప్రజలు ఎక్కువగా ఇష్టపడే ఈ చేపలో కూడా ఒమేగా 3 కొవ్వులు అధికంగా ఉంటాయి. 100 గ్రాముల సార్డిన్ తింటే దాదాపు 2200 mg ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ శరీరానికి అందుతాయి. ఇవి గుండెను బలోపేతం చేయడంలో సహాయపడతాయి. ఈ చేపలను మీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. అయితే వీటిని తీసుకునే పరిమాణం, వండే పద్ధతి కూడా ముఖ్యం.
































