తెలుగు రాష్ట్రాలు సంక్రాంతి పండుగకు సిద్ధమయ్యాయి. రద్దీ ప్రపంచాన్ని దాటుకుని ప్రశాంతమైన పల్లెకు ప్రజానీకం పయనమైంది. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాల సంఖ్య లక్షల్లో ఉంటుంది.
ఈ క్రమంలో ప్రజలంతా క్షేమంగా స్వగ్రామాలకు చేరుకుని మూడు రోజుల పండగను ఆనందంగా జరుపుకోవాలని పోలీసులు కోరుతున్నారు. అందుకే ప్రయాణికులకు సూచనలు చేస్తున్నారు.
ఉమ్మడి నల్గొండ జిల్లా మీదుగా హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లే వారికి పోలీసులు సూచనలు చేస్తున్నారు. టోల్ గేట్లు, జాతీయ రహదారిపై వంతెనల నిర్మాణం తదితరాలతో ట్రాఫిక్ అంతరాయాలు ఏర్పడే అవకాశాలు ఉన్నందున ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలను రూపొందించారు. అందులో భాగంగానే ట్రాఫిక్ డైవర్షన్లు కూడా ఏర్పాటు చేశారు.
గుంటూరు వెళ్లే వారు…
హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్లే వాహనాలను నార్కట్‌పల్లి వద్ద నల్గొండ, మిర్యాలగూడ, పిగుడురాళ్ల మీదుగా దారి మళ్లిస్తారు. అయితే నల్గొండ వద్ద రోడ్డు పనులు జరుగుతున్నాయి. ఇక్కడ వాహనదారులు జాగ్రత్త వహించాలి. స్పీడ్ లిమిట్ లో సేఫ్ డ్రైవింగ్ చేయాలని పోలీసులు కోరుతున్నారు.
విజయవాడ వెళ్లే వారు..
ఇప్పటి వరకు టేకుమట్ల డైవర్షన్‌ను ఎత్తివేయనున్నారు. ప్రస్తుతం టేకుమట్ల నుంచి ఖమ్మం హైవైపై వెళ్లి యూ టర్న్ తీసుకొని.. తిరిగి సూర్యాపేట రూట్ వైపు రావాల్సి ఉంటుంది. రద్దీ నేపథ్యంలో హైవే పై నేరుగా వెహికిల్స్ వచ్చే విధంగా తాత్కాలిక రహదారిని నిర్మించారు.
ఖమ్మం హైదరాబాద్
రాయినిగూడెం సైడ్ వచ్చి యూటర్న్ తీసుకోవాలి. ప్రస్తుతం ఇందులో స్వల్ప మార్పులు చేశారు. చివ్వెంల, ఐలాపురం వద్ద రూట్ డైవర్ట్ చేసి సూర్యాపేట మీదుగా సరాసరి హైదరాబాద్ వెళ్లే విధంగా ప్రణాళికలను రూపొందించారు.
రాజమండ్రి -విశాఖపట్నం:
విజయవాడ హైవే పై నకిరేకల్ మీదుగా అర్వపల్లి చేరుకుంటారు. అక్కడి నుంచి, మరిపెడ బంగ్లా, ఖమ్మం మీదుగా మళ్లిస్తారు. అక్కడ ట్రాఫిక్ జామ్ అయితే.. టేకుమట్ల నుంచి ఖమ్మం జాతీయ రహదారికి రూట్ డైవర్ట్ చేసుకుని రాజమండ్రి చేరుకోవచ్చు.
బ్లాక్ స్పాట్ల వద్ద జాగ్రత్త
పైన పేర్కొన్న మార్గాల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాతో తెలంగాణ పరిధి ముగుస్తుంది. బోర్డర్ దాటే లోపు మొత్త 24 బ్లాక్ స్పాట్లున్నాయి. డీప్ క్రాసింగ్స్ కూడా ప్రమాదాలకు కారణంగా మారాయి. రద్దీ నేపథ్యంలో మొత్తం ట్రాఫిక్ ను సీసీ టీవీ కెమెరాలతో పర్యవేక్షిస్తారు పోలీసులు. సైన్ బోర్డులతో పాటు, విద్యుత్తు దీపాలను ఏర్పాటు చేశారు. స్పీడ్ కంట్రోల్స్ ను ఏర్పాటు చేసి, బారికేడ్స్ ను ఏర్పాటు చేశారు. గుంతలు పడిన చోట మరమ్మతులు చేపట్టారు. అలాగే లాంగ్ డ్రైవ్ చేసే వారు ముఖ్యంగా నార్కెట్పల్లి వద్ద బ్రేక్ తీసుకుంటారు. అక్కడ టీ, టిఫిన్ కోసం ఆడగం ద్వారా కూడా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ కూడా పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేస్తున్నారు.
సూర్యాపేట జిల్లా పోలీసులు డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. జిల్లా పరిధిలో ఎక్కడైనా ట్రాఫిక్ జామ్ వెంటనే తగిన చర్యలు చేపడతారు. హైవే పెట్రోలింగ్ వాహనాలు గస్తీ కొనసాగిస్చూ.. సూర్యాపేట టౌన్, సూర్యాపేట రూరల్, మునగాల, కోదాడ, కోదాడ రూరల్ సీఐల ఆధ్వర్యంలో రానున్న 10 రోజుల పాటు నిఘా ఏర్పాటు చేశారు. క్రేన్లు, అంబులెన్సులు, టోయింగ్ వాహనాలను సిద్ధం చేశారు.



































