TRAI: ఫోన్ నెంబర్లకు ఛార్జీలు వసూలు చేయడంలో నిజమెంత.? క్లారిటీ ఇచ్చిన ట్రాయ్..
ప్రస్తుతం ఉన్న మొబైల్ నెంబర్లతో పాటు కొత్తగా తీసుకునే నెంబర్లు, ల్యాండ్ లైన్ నంబర్లపై టెలికాం నియంత్రణాధికార సంస్థ ట్రాయ్ ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అలాగే నిరుపయోగంగా సిమ్‌లపై జరిమానా విధించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే దీనిపై తాజాగా ట్రాయ్ స్పందించింది.
ఛార్జీలు వసూలు చేయనున్నట్లు వస్తున్న వార్తలను ట్రాయ్ ఫండించింది. ఫోన్ నెంబర్లకు వినియోగదారుల నుంచి ఫీజులు వసూలు చేసే ప్రణాళికకు సంబంధించి ఎలాంటి ఆలోచనలేదని స్పష్టం చేసింది. ఫోన్ నెంబర్ వనరుల నియంత్రణ నిమిత్తం ట్రాయ్ ఇటీవల ‘రివిజన్ ఆఫ్ నేషనల్ నంబరింగ్ ప్లాన్’ పేరుతో ఓ చర్చా పత్రాన్ని విడుదల చేసింది. ఈ కారణంగానే నెంబర్లపై ఛార్జీలు వసూలు చేయనున్నారనే చర్చ జరిగింది. మీడియాలో సైతం దీనిపై పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. దీంతో ఈ వార్తలకు చెక్ పెట్టే పనిలో పడింది ట్రాయ్. దీనికి సంబంధించి శుక్రవారం దీనిపై ప్రకటన విడుదల చేసింది ట్రాయ్.
ఈ విషయమై స్పందించిన అధికారులు.. కొన్ని మీడియా వర్గాల్లో వచ్చినట్లు, నంబరింగ్ వనరులను సమర్థంగా వినియోగించుకునేందుకు మొబైల్, ల్యాండ్‌లైన్ నంబర్లకు ఫీజులు వసూలుచేయాలని ట్రాయ్ ప్రతిపాదన చేసింది అన్న దాంట్లో ఎలాంటి నిజం లేదని, ఇది పూర్తిగా అవాస్తవం అని తేల్చి చెప్పారు. ఈ వార్తలు ప్రజలను తప్పుదోవ పట్టించేవే అంటూ స్పష్టత ఇచ్చారు. టెలీకమ్యూనికేషన్ ఐడెంటిఫైర్స్ వనరులపై పూర్తి నియంత్రణ కలిగిన టెలికాం శాఖ ఇటీవల ట్రాయ్‌ని సంప్రదించి నేషనల్ నంబరింగ్ ప్లాన్‌పై ప్రతిపాదనలు కోరింది. నంబరింగ్ వనరుల సమర్థ వినియోగం కోసం సూచనలు ఇవ్వాలని అడిగింది. దీంతో మేం చర్చాపత్రం విడుదల చేశాం. నంబర్ల కేటాయింపు విధానాల్లో కొన్ని సవరణలను మాత్రమే ప్రతిపాదించాం అని తేల్చి చెప్పారు.