మీ రైలు టికెట్‌పై మరొకరు ప్రయాణించవచ్చా? రైల్వే నిబంధనలు ఏంటి

www.mannamweb.com


రైలు రైలు ప్రయాణం చేసే ముందు కొన్ని కారణాల వల్ల మీ ప్రయాణం రద్దు చేసుకోవాల్సి వస్తే టికెట్‌ క్యాన్సిల్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

టికెట్ రద్దు విషయంలో కొంత మొత్తాన్ని రద్దు రుసుముగా కట్‌ చేసుకుని మిగతావి డబ్బులు మీకు అందుతాయి. ఈ సందర్భంలో చాలా మందికి ఒక ప్రశ్న తలెత్తుతుంటుంది. మీ టికెట్‌పై మరొకరు ప్రయాణించవచ్చా?

భారతీయ రైల్వేలో చాలా మందికి తెలియని నియమాలు ఉన్నాయి. మీరు రైలు టిక్కెట్‌ను బుక్ చేసి ఉంటే, చివరి నిమిషంలో ఏదైనా కారణం వల్ల ప్రయాణ ప్రణాళిక రద్దు అయితే మీరు నేరుగా టిక్కెట్‌ను రద్దు చేయడానికి బదులుగా టిక్కెట్‌ను బదిలీ చేయవచ్చు. దీని కోసం అదనపు ఖర్చు అవసరం లేదు.

టికెట్ రద్దుపై కనీస రద్దు ఛార్జీ చెల్లించాలి. టికెట్ బదిలీకి ఆ ఛార్జీ ఉండదు. కానీ కన్ఫర్మ్‌ అయిన టిక్కెట్లను మాత్రమే బదిలీ చేయవచ్చని గుర్తుంచుకోండి. వెయిటింగ్ లేదా RAC టిక్కెట్లు బదిలీ చేసేందుకు అవకాశం ఉండదు.

టిక్కెట్లను ఎలా బదిలీ చేయాలి?: టికెట్ బదిలీ కోసం మీరు టికెట్ ప్రింటౌట్, మీరు టిక్కెట్‌ను బదిలీ చేస్తున్న వ్యక్తి గుర్తింపు కార్డును రైల్వే కౌంటర్‌లో సమర్పించాలి. అప్పుడే టిక్కెట్టు బదిలీ అవుతుంది. ఒక వేళ ఆన్‌లైన్‌లో టికెట్‌ కొనుగోలు చేసినా రైల్వే కౌంటర్‌లో టికెట్‌ బదిలీ చేయాల్సి ఉంటుంది.

అయితే ఈ టికెట్ బదిలీ కుటుంబ సభ్యుల మధ్య మాత్రమే జరుగుతుంది. అంటే, మీరు మీ భార్య, తల్లిదండ్రులు, సోదరుడు-సోదరి లేదా కొడుకు-కుమార్తె ఇలా మీ బంధువుల పేరు మీద బదిలీ చేయవచ్చు.