TRAI కొత్త ప్రతిపాదన.. రోజుకు 50కి మించి కాల్స్ చేస్తే చిక్కులు తప్పవు

www.mannamweb.com


ఒకప్పుడంటే ఫోన్ కాల్ మాట్లాడాలంటే.. ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి. ఒక్క నిమిషానికి రూపాయి చొప్పున వసూలు చేసేవి టెలికాం కంపెనీలు. ఇక విదేశాల్లో ఉన్న వారితో మాట్లాడాలంటే.. వందల రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చేది. అయితే రాను రాను టెలికాం కంపెనీలు కాల్ ఛార్జీలను తగ్గిస్తూ రాసాగాయి. ప్రస్తుతం అన్ని కంపెనీలు అన్ లిమిటెడ్ కాలింగ్ రీఛార్జ్ ప్లాన్స్ ను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. పైగా ఇప్పుడు మొబైల్ డేటా కూడా ఫ్రీగా లభిస్తుండటంతో.. వాయిస్ కాల్స్ మాత్రమే కాక.. వీడియో కాల్స్ చేసుకునే సదుపాయం కూడా లభిస్తోంది. అయితే ఈ అన్ లిమిటెడ్ కాలింగ్ ఆఫర్ వల్ల.. స్పామ్ కాల్స్ పెరుగుతున్నాయి. రియల్ ఎస్టేట్, క్రెడిట్, కార్డ్స్ వంటి వాటికి సంబంధించి స్పామ్ కాల్స్ పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ట్రాయ్ కొత్త ప్రతిపాదన తీసుకువచ్చింది. రోజుకు 50కి మించి కాల్స్, ఎస్ఎంఎస్ లు పంపే వారికి చిక్కులు తప్పవని చెబుతుంది. ఆ వివరాలు

ఇబ్బంది పెట్టే కాల్స్‌, మెసేజ్ లకు అడ్డుకట్టవేయడానికి ట్రాయ్ రంగంలోకి దిగింది. ఇందుకోసం సరికొత్త ప్రతిపాదనలు చేసింది. స్పామ్ కాల్స్, ఎస్‌ఎంఎస్‌లను అరికట్టడం కోసం గ్రేడ్స్‌ వారీ అధిక టారిఫ్‌ను ప్రవేశపెట్టాలని టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్‌ తాజాగా పరిశ్రమను కోరింది. రోజుకు 50కి పైగా కాల్స్, లేదా 50 ఎస్‌ఎంఎస్‌లు పంపిన టెలికం సబ్‌స్క్రైబర్లను ఇబ్బందికర కాలర్లుగా పరిశీలించాలని ట్రాయ్ టెలికం కంపెనీలకు సూచించింది. ఇది అమల్లోకి వస్తే.. ఇక రోజుకు 50 మించి కాల్స్ చేసే వారికి చిక్కులు తప్పవు అంటున్నారు.

దేశంలో 110 కోట్ల మందికిపైగా టెలికం సబ్‌స్క్రైబర్‌లు ఉండగా వీరిలో 0.03 శాతం మంది రోజుకు ఒక సిమ్ నుంచి 51 నుంచి 100 ఎస్సెమ్మెస్‌లు పంపుతున్నారని ట్రాయ్ చెప్పుకొచ్చింది. అలాగే 0.12 శాతం మంది ఒక సిమ్ నుంచి రోజుకు 51 నుండి 100 వాయిస్ కాల్స్‌ చేస్తున్నారని ట్రాయ్ తన కన్సల్టేషన్ పేపర్‌లో వివరించింది. ఈ నేపథ్యంలో ‘టెలికం కమర్షియల్‌ కమ్యూనికేషన్స్‌ కస్టమర్‌ ప్రిఫరెన్స్‌ రెగ్యులేషన్స్‌–2018’ నిబంధనల పరిధిలో నమోదైన ఒక సంస్థ కాకుండా ఇతర వ్యక్తులకు ఒక సిమ్‌కు రోజుకు ఒక నిర్దిష్ట పరిమితిని మించి ఎస్‌ఎంఎస్, వాయిస్‌ కాల్స్‌ కోసం గ్రేడ్స్‌ వారీ టారిఫ్‌ ఉండాలని స్పష్టం చేసింది.