భారత్ కు రానున్న ట్రంప్- మూలకారణం

మెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. భారత్ లో పర్యటించనున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్-మే నెలల్లో ఆయన పర్యటించే అవకాశం ఉంది. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం.


ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించారు. వచ్చే ఏడాది భారత పర్యటనకు వెళ్తానని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై మరోసారి ప్రశంసలు కురిపించారు. ఆయనను ఓ గొప్ప వ్యక్తిగా, బెస్ట్ ఫ్రెండ్ గా అభివర్ణించారు.

వైట్ హౌస్‌లో డొనాల్డ్ ట్రంప్ విలేకరులతో మాట్లాడారు. బరువు తగ్గించడానికి ఉపయోగించే మందుల ధరలను తగ్గించడానికి ఉద్దేశించిన కొత్త ప్రణాళికను ఈ సందర్భంగా ట్రంప్ ఆవిష్కరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ప్రధాని మోదీతో వివిధ అంశాలపై తరచూ సంప్రదింపులు కొనసాగుతూనే ఉన్నాయని, అవన్నీ సానుకూల ఫలితాలను ఇస్తోన్నాయని పేర్కొన్నారు. తాను చెప్పినందు వల్లే భారత్.. రష్యా నుండి ఆయిల్ కొనుగోళ్లను చాలా వరకు నిలిపివేసిందని గుర్తు చేశారు.

రష్యా నుండి చమురు కొనుగోలును భారత్ దాదాపు నిలిపివేసిందని, మున్ముందు ఇది పూర్తిగా నిలిచిపోతుందని ట్రంప్ చెప్పారు. రష్యా ఇంధనాన్ని కొనుగోలు చేసే దేశాలపై తమ ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన చర్యలకు అనుగుణంగా ఉందని వ్యాఖ్యానించారు. ఏ దేశమైనా రష్యా నుండి క్రూడాయిల్ ను కొనుగోలు చేస్తే.. వారిపై ఆంక్షలు తప్పవని ఆయన పునరుద్ఘాటించారు. భారత్ పై విధించిన 25 శాతం అదనపు పన్ను గురించి పరోక్షంగా ప్రస్తావించారు.

భారత్ పర్యటనకు సంబంధించిన ప్రణాళికలేవీ ఇంకా కార్యరూపం దాల్చలేదని ట్రంప్ చెప్పారు. తమ రెండు దేశాలు వాణిజ్యం, ఇంధనం, ఇతర వ్యూహాత్మక రంగాల్లో సహకారాన్ని పెంచుకోవడానికి ఆసక్తిగా ఉన్నాయని అన్నారు. భారత పర్యటన ఎప్పుడు ఉండొచ్చని విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. వచ్చే ఏడాది అని బదులిచ్చారు ట్రంప్. టారిఫ్ పెంపు వల్ల బలహీనపడ్డ ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడంలో భాగంగా ఈ పర్యటన ఉండబోతోంది.

ఇదే విషయాన్ని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రెటరీ కరోలిన్ లెవిట్ ధృవీకరించారు. భారత్ తో ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరచడంలో ట్రంప్ నిబద్ధతతో ఉన్నారని చెప్పారు. అమెరికాకు భారత ఓ కీలక, వ్యూహాత్మక భాగస్వామిగా పేర్కొన్నారు. టారిఫ్ పెంపు వల్ల భారత్ తో సంబంధాలు కొంతవరకు బెడిసికొట్టిన విషయాన్ని ఆమె పరోక్షంగా అంగీకరించారు. భారత్- అమెరికా సంబంధాలను మరింతగా పెంచడానికి ట్రంప్ కట్టుబడి ఉన్నారని పునరుద్ఘాటించారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.