మార్గశిర మాసంలో వచ్చే శుక్ల పక్ష షష్ఠి తిథిని సుబ్రహ్మణ్య షష్ఠిగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. దీన్ని స్కంద షష్ఠిగా పిలుస్తారు. ఈ నెల నవంబర్ 26వ తేదీన బుధవారం నాడు ఈ పండుగ జరుగనుంది.
షష్ఠి తిథి.. 25వ తేదీ మంగళవారం రాత్రి 10:56 నిమిషాలకు ప్రారంభమౌతుంది. 27వ తేదీ గురువారం రాత్రి 12:01 నిమిషాలకు ముగుస్తుంది.
సుబ్రహ్మణ్య షష్ఠి శుభ ముహూర్తాలు: బ్రహ్మ ముహూర్తం తెల్లవారు జామున 4:37 నుండి 5:30 గంటల వరకు ఉంటుంది. ప్రాతః సంధ్య తెల్లవారు జామున 5:03 నుండి 6:23 నిమిషాల వరకు. విజయ ముహూర్తం మధ్యాహ్నం 1:33 నుండి 2:16 నిమిషాలు, గోధూళి ముహూర్తం సాయంత్రం 5:05 నుండి 5:32 నిమిషాల వరకు ఉంటుంది. అమృత కాలం మధ్యాహ్నం 2:27 నుండి సాయంత్రం 4:10 నిమిషాల వరకు ఉంటుంది. రవి యోగం 27న తెల్లవారు జామున 6:23 నుండి మధ్యాహ్నం 1:33 నిమిషాల వరకు ఉంటుంది.
సూరపద్మ అనే రాక్షసుడిపై విజయం సాధించినందుకు సూరసంహారం జరుపుకుంటారు. దీని తర్వాత వచ్చే షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠిగా పరిగణిస్తారు. ఈ పండుగ దక్షిణాదిలో ప్రాచుర్యం పొందింది. ప్రత్యేకించి తమిళనాడు, కర్ణాటకల్లో. కార్తికేయుడిని కుమార, మురుగన్, సుబ్రహ్మణ్యం వంటి అనేక పేర్లతో ఇక్కడ పూజిస్తారు. ఉత్తరాదిలో సుబ్రహ్మణ్యుడిని గణపతికి అన్నగా భావిస్తారు. ఇక్కడ మాత్రం తమ్ముడిగా పూజిస్తారు. షష్ఠి తిథి కార్తికేయుడికి అంకితమైనందున దీన్న స్కంద షష్టి, కౌమారికీ అని కూడా పిలుస్తారు.
సుబ్రహ్మణ్య స్కంద షష్ఠి ప్రాముఖ్యత: దుర్మార్గాలను అంతం చేయడానికి కార్తికేయుడు జన్మించాడని నమ్మకం. స్కంద షష్టి వ్రతం ఆచరించడం ఆనవాయితీ. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఈ రోజు కార్తికేయుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే సర్వ కష్టాల నుండి విముక్తి, సంతాన సమస్యల పరిష్కారం, ధన సంపదలు లభిస్తాయి.
స్కంద షష్ఠి రోజున చేయవలసినవి: ఈ పవిత్ర దినాన దానధర్మాలు చేయడం శుభప్రదం. సుబ్రహ్మణ్యేశ్వరుడి విగ్రహాన్ని స్థాపించి, అఖండ దీపాన్ని వెలిగించాలి. పూజలో ఉల్లి, వెల్లుల్లి వంటివి వాడకూడదు. వ్రతం పాటించేవారు బ్రహ్మచర్యాన్ని ఆచరించాలి. వ్యాపార కష్టాలతో బాధపడేవారు పెరుగులో సింధూరం కలిపి కుమార కార్తికేయుడికి సమర్పించడం శ్రేయస్కరం. భక్తి శ్రద్ధలతో పూజిస్తే గ్రహ దోషాల నుండి విముక్తి కలుగుతుంది. ముఖ్యంగా సంతానం లేని దంపతులు ఈ వ్రతం చేయడం వల్ల పుత్రప్రాప్తి కలుగుతుందని నమ్మకం.
స్కంద షష్ఠి రోజున తెల్లవారు జామునే లేచి ఇంటిని శుభ్రం చేయాలి. స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. అనంతరం వ్రత సంకల్పాన్ని తీసుకోవాలి. పూజా స్థలంలో కార్తికేయుడితో పాటు శివపార్వతుల విగ్రహాలను ప్రతిష్టించాలి. దీపం వెలిగించి, ధూపం వేసి, తిలకం ధరించాలి. ఈ పూజలో కలువ పూలు, అక్షింతలు, పసుపు, చందనం, ఆవు నెయ్యి, పాలు, పండ్లు, మొదలైనవి సమర్పించడం శుభప్రదం. శివుడికి మాత్రం పసుపు సమర్పించకూడదు. సాయంత్రం మళ్ళీ పూజ చేసి ఫలాహారం తీసుకోవాలి. పూజా సమయంలో “ఓం స్కందాయ నమః, “ఓం కుమారాయ నమః” మంత్రాలను జపించాలి.































