తిరుమల శ్రీవారి సేవను మరింత బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టింది. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్‌లో శ్రీవారి సేవపై టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవో వీరబ్రహ్మంలతో కలసి సమీక్షా సమావేశం నిర్వహించారు.
శ్రీవారి సేవకులకు మెరుగైన శిక్షణ ఇవ్వడం ద్వారా తిరుమలకు వచ్చే వేలాది మంది భక్తులకు చక్కటి సేవలు అందించవచ్చని టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. అలాగే ఐఐఎం, రాష్ట్ర ప్రభుత్వ ప్లానింగ్ శాఖకు సంబంధించిన ముఖ్యమైన శిక్షకులతో వచ్చే నవంబర్ నెలలో శిక్షణకు సంబంధించి ఆడియో, వీడియో విజువల్స్, ట్రైనింగ్ మెటీరియల్ సిద్ధం చేయాలన్నారు. ఈ శిక్షణ కూడా పూర్తిగా ఉచితం.. ఇదివరకే ఆన్ లైన్ ద్వారా బుక్ చేసుకున్న గ్రూప్ సూపర్వైజర్లు, ట్రైనర్లకు డిసెంబర్, జనవరి మాసాల్లో ట్రైనింగ్ ఇవ్వాలన్నారు.
‘ఈ ట్రైనింగ్‌లో శ్రీ వేంకటేశ్వర వైభవం, తిరుమల సమాచారం, మన సనాతన ధర్మం, విలువలు, మేనేజ్మెంట్, లీడర్ షిప్, సేవ తత్పరత తదితర అంశాలపై శిక్షణ ఇవ్వాల్సిన అవసరముంది. తిరుపతి, తిరుమలలో ఉన్న టీటీడీ ఆస్పత్రుల్లో ముఖ్యంగా అశ్వినీ ఆసుపత్రి, ఆయుర్వేద, స్విమ్స్, బర్డ్, చిన్న పిల్లల ఆసుపత్రుల్లో రోగులకు సేవ చేసేందుకు శ్రీవారి వైద్య సేవను త్వరలోనే ప్రారంభించాలి’ అని టీటీడీలోని వివిధ ఆస్పత్రుల డైరెక్టర్లకు సూచించారు. ‘ఇందుకు సంబంధించి శ్రీవారి వైద్య సేవా సెల్ ను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలి. అదే విధంగా ఎస్వీ గోసంరక్షణశాలలో కూడా శ్రీవారి సేవకులు గోసేవను చేయడానికి వీలుగా తగు చర్యలు తీసుకోవాలి’ అన్నారు.
‘దేశంలోని టీటీడీ ఆలయాల్లో శ్రీవారి సేవా సేవకులతో భక్తులకు సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా చెన్నై, హైదరాబాద్, విశాఖపట్నం, కన్యా కుమారి, బెంగుళూరు లాంటి ప్రాంతాల్లో ఉన్న శ్రీవారి ఆలయాల్లో మొదటి విడతగా శ్రీవారి సేవ ప్రారంభించాలి. తదనంతరం మిగతా ఆలయాల్లో కూడా దశలవారీగా శ్రీవారి సేవను ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి’ అని ఆయన సీపీఆర్వో డాక్టర్ టి.రవి ఆదేశించారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో నడిచే ఆస్పత్రుల్లో సేవ చేయడానికి భక్తులకు ఒక గొప్ప అవకాశం కల్పించింది. ఈ సేవల్లో పాల్గొనాలనుకునే వారికి ‘శ్రీవారి సేవ ట్రైనర్’ పేరుతో ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఈ శిక్షణ పొందిన భక్తులు తిరుపతిలోని స్విమ్స్, బర్డ్ ఆసుపత్రుల్లో తమ సేవలను అందిస్తారు. ఈ సేవల్లో పాల్గొనడానికి కనీసం డిగ్రీ చదివి ఉండాలి.
తిరుమల అన్నప్రసాదం కాంప్లెక్స్‌లో ఆయుధ పూజ
‘తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్‌లో శుక్రవారం ఆయుధ పూజ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పాల్గొన్నారు. ముందుగా వేద మంత్రోచ్ఛారణ మధ్య శ్రీ పద్మావతి, శ్రీ వేంకటేశ్వరుని చిత్రపటాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నప్రసాదాల తయారీకి వినియోగించే యంత్రాలు, పాత్రలకు పూజలు చేశారు. అనంతరం అన్నదానం సిబ్బందిని ఈవో సన్మానించారు. తిరుమలలో 1985లో నిత్యాన్నదాన పథకం ప్రారంభించగా 1994లో శ్రీవేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుగా మార్చడం జరిగిందన్నారు. ప్రస్తుతం ఈ ట్రస్టులో రూ.2300 కోట్లు నిధులు ఉన్నాయని తెలిపారు. గత ఆరు నెలల్లో రూ.180 కోట్లు విరాళం అందించారని చెప్పారు. తిరుమలకు విచ్చేసే భక్తులందరికీ నాణ్యమైన అన్న ప్రసాదాలను అందిస్తున్నామన్నారు. ఇందుకు కృషి చేస్తున్న అధికారులు, సిబ్బందిని ఆయన అభినందించారు’ అని తెలిపారు.
‘ఇటీవల జరిగిన బోర్డు సమావేశంలో దేశవ్యాప్తంగా టీటీడీ పరిధిలోని అన్ని ఆలయాల్లో నిత్యాన్నదానం చేసేందుకు నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. తిరుమలలో అన్న ప్రసాద కేంద్రంలో మరింత మంది సిబ్బందిని నియమించేందుకు ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా దేవాలయాల నిర్మాణంపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ధర్మ ప్రచారంలో భాగంగా శ్రీవాణి ట్రస్టు ద్వారా 5000 వేల ఆలయాలు నిర్మించేందుకు గత బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దేవాలయాల నిర్మాణానికి అందుబాటులో ఉన్న స్థలం ఆధారంగా రూ.10 లక్షలు, రూ.15 లక్షలు, రూ.20 లక్షలుగా మూడు రకాలుగా కేటాయించాలని నిర్ణయించామని చెప్పారు. ఇందుకు సగుటున ఒక ఆలయానికి రూ.15 లక్షల అంచనా వ్యయంతో మొత్తం రూ.750 కోట్లు కేటాయించేందుకు బోర్డు ఆమోదం తెలిపిందని తెలిపారు. రాష్ట్ర దేవాదాయశాఖ ద్వారా ఆ స్థలాలను గుర్తించి ఆలయాలు నిర్మించేందుకు చర్యలు తీసుకోనున్నామని చెప్పారు. ఇందుకు మొదట విడతగా రూ.187 కోట్లు విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకున్నామని తెలియజేశారు’ అని టీటీడీ తెలిపింది.



































