TTD: తిరుమల దర్శనానికి వచ్చే భక్తులకు టిటిడి గుడ్ న్యూస్..!!

వేసవి సెలవులకు తిరుమలకు వచ్చే భక్తులకు టిటిడి గుడ్ న్యూస్ చెప్పింది. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలకు వచ్చే యాత్రికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని మూడు నెలల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసినట్లు ఈవో ధర్మారెడ్డి ప్రకటించారు. సాధారణ భక్తులకు ఎక్కువ దర్శన వేళలు కల్పించడానికి సిఫార్సు లేఖలపై విఐపి దర్శనాన్ని రద్దు చేసినట్లు వివరించారు. క్యూలైన్లు కంపార్ట్మెంట్లో వేచి ఉండే భక్తులకు అన్న ప్రసాదం, మజ్జిగ, వైద్య సదుపాయాలు నిరంతరం అందిస్తామని ప్రకటించారు. ఇప్పటికే ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో విఐపి లు నేరుగా వచ్చే వారికి మాత్రమే టిటిడి బ్రేక్ దర్శనం కల్పిస్తుంది. సిఫార్సు లేఖలను పూర్తిగా నిలిపివేశారు. దీంతో సాధారణ భక్తులకు వేగంగా దర్శన అందుబాటులోకి వచ్చింది. ఇదే సమయంలో వేసవి రద్దీ వేల ఎక్కువ సంఖ్యలో వచ్చే భక్తులకు సేవలు అందించేందుకు 2500 మంది శ్రీవారి సేవకులను నియమించారు. మాడవీధులు, నారాయణగిరి గార్డెన్స్ వెంబడి కూల్ పెయింటింగ్స్, డ్రింకింగ్ వాటర్ పాయింట్లు నెలకొల్పారు.


వేసవి వేడి రోజులలో శేషాచల అటవీ ప్రాంతాల్లో ఫ్లాష్ అగ్ని ప్రమాదాలను నివారించడానికి టీటీడీ అటవీశాఖ, ప్రభుత్వ అగ్నిమాపక శాఖ ద్వారా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ధర్మారెడ్డి వెల్లడించారు. ఈనెల 9న ఉగాదినాడు తిరుమలలో ఆస్థానం నిర్వహించనున్నారు. ఇప్పటికే అవసరమైన ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి. సెలవులు ప్రారంభం కానుండటంతో ఈ నెలాఖరు నుంచి రెండు నెలలపాటు తిరుమలకు వచ్చే భక్తుల రద్దీ సంఖ్య ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీనికి అనుగుణంగా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు ఈవో ధర్మారెడ్డి వివరించారు.