ఏడుకొండలపై కొలువైన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడిని దర్శించుకునేందుకు నిత్యం వేలసంఖ్యలో భక్తులు కొండపైకి పోటెత్తుతుంటారు. కొందరు మెట్ల మార్గంద్వారా నడుచుకుంటూ వస్తారు.
మరికొందరు వాహనాల్లో వస్తారు. వీరంతా స్వామివారి హుండీలో తమకు తోచినంత, తమకు చేతనైనంత కానుకలు సమర్పించి శ్రీవారికి మొక్కులు చెల్లించుకుంటారు. ఇలా భక్తులు సమర్పించిన వస్తువుల్లో ఫోన్లు, వాచీలు కొత్తవాటితోపాటు వాడినవాటిని కూడా కలిపి తిరుమల తిరుపతి దేవస్థానం వేలం వేయబోతోంది. ఆసక్తి ఉన్నవారు వేలంలో పాల్గొని కానులను సొంతం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
ఫోన్లు, వాచీల ఈవేలం
తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు అనుబంధంగా ఉన్న ఆలయాల్లోను భక్తులు కానుకలను సమర్పించుకుంటుంటారు. అందులోని మొబైల్ ఫోన్లతోపాటు వాచీలను కూడా వీటిల్లో కలిపి వేలం వేస్తున్నారు. ఈనెల 24వ తేదీన పోర్టల్ ద్వారా ఈవేలం ప్రక్రియ జరగబోతోంది. ఆసక్తి ఉన్నవారు ఇందులో పాల్గొని వీటిని సొంతం చేసుకోవచ్చు. టైటాన్, క్యాషియే, ఆల్విన్, టైమెక్స్, సోనాటా, ఫాస్ట్ ట్రాక్ కంపెనీలకు చెందిన వాచీలతో పాటు, నోకియా, శామ్ సంగ్, వివో, మోటరోలా వంటి బ్రాండ్లకు చెందిన సెల్ ఫోన్లు కూడా ఉన్నాయి.