కమర్షియల్ హంగుల జోలికి పోకుండా విభిన్న కథలను ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు చాలామంది వర్ధమాన దర్శక, రచయితలు. సుప్రీత్ సి. కృష్ణ తెరకెక్కించిన ‘టుక్ టుక్’ (Tuk Tuk) సినిమా ఆ కోవకు చెందిందే. ఆటోని పోలి ఉండే మ్యాజికల్ పవర్స్ ఉన్న స్కూటర్ ఇతివృత్తంగా రూపొందిన ఆ మూవీ ఓటీటీ ‘ఈటీవీ విన్’ (ETV Win)లో స్ట్రీమింగ్ అవుతోంది. మరి, ఆ స్కూటర్ ప్రయాణం ఎలా సాగిందంటే?
చిత్తూరు జిల్లాలోని ఓ పల్లెటూరికి చెందిన ముగ్గురు టీనేజర్లు మంచి స్నేహితులు. షార్ట్‌ఫిల్మ్ తీయాలని ఓ రోజు నిర్ణయించుకుంటారు. అయితే, కెమెరా కొనేందుకు డబ్బు ఉండదు. ఓ పెద్దాయన సలహాతో గ్రామంలో వినాయకచవితి వేడుకలు నిర్వహించేందుకు సిద్ధపడతారు. గ్రామస్థులు ఇచ్చే చందాతో కెమెరా కొనాలనేది వారి ఆశ. అంతా బాగానే ఉన్నా విగ్రహ ఊరేగింపునకు ఏ వాహనం దొరకని పరిస్థితి. అప్పుడే ఆ స్నేహితుల్లోకి ఒకరికి ఓ పాత స్కూటర్ గుర్తొస్తుంది. దాన్ని రిపేర్ చేయించి, ఆటోలా మార్చి వినాయకుడి విగ్రహాన్ని గంగ వద్దకు సాగనంపుతారు. తర్వాత, ఆ స్కూటర్‌కు పవర్స్ ఉన్నాయని తెలిసి భయానికి లోనవుతారు. అసలు స్కూటర్ ఎవరిది? ఆ స్నేహితులు నమ్మినట్టు అందులో ఆత్మ ఉందా? గ్రామస్థులు అనుకున్నట్టు దేవుడు ఉన్నాడా? స్కూల్ టీచర్ శిల్పకు, ఆ మిత్రులకు సంబంధమేంటి? సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
వాహనం ప్రధానంగా సాగే కథతో ఇప్పటికే పలు సినిమాలొచ్చాయి. ‘టుక్ టుక్’ కూడా అలాంటిదే. ముగ్గురు స్నేహితులు, స్కూల్ టీచర్ జీవితాన్ని స్కూటర్ ఎలా ప్రభావితం చేసిందన్నది ఇందులో కీలకాంశం. ముగ్గురు టీనేజర్ల పరిచయం, వారు చేసే అల్లరి ప్రేక్షకుడిని తన గతంలోకి తీసుకెళ్లేలా చేస్తాయి. అయితే, అసలు కథలోకి వెళ్లేందుకు దర్శకుడు చాలా సమయం తీసుకున్నారు. స్కూటర్‌లో ఉన్నది దేవుడా? దెయ్యమా? అన్నది తెలుసుకునే క్రమంలో ఆ మిత్రులు చేసే హంగామా నవ్వులు పంచుతుంది. అదే ఎపిసోడ్‌తో.. దేవుడి పేరు చెప్పి ప్రజలను కొందరు ఎలా మోసం చేస్తున్నారన్నది చూపించే ప్రయత్నం చేశారు దర్శకుడు. స్కూటర్ మ్యాజికల్ పవర్స్ వెనుక ఉన్నదేంటో తెలిసినా.. అలా చేయడానికి కారణమేంటన్నది స్పష్టంగా చెప్పకపోవడం ప్రేక్షకుడికి కాస్త అసంతృప్తే.
ప్రథమార్ధాన్ని కామెడీ, కొన్ని హారర్ ఎలిమెంట్స్‌తో నడిపించిన దర్శకుడు ద్వితీయార్ధంలో శిల్ప- నవీన్‌ల ప్రేమకథకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. వీరి స్టోరీ గురించి తెలుసుకున్న ముగ్గురు స్నేహితుల్లో వచ్చిన మార్పును చక్కగా చూపించారు. ఏదైనా ఘటన జరిగితే ఎక్కువ మంది చెప్పిందే నిజమని నమ్మడం వల్ల కొందరి జీవితాలు ఎలా మలుపు తిరుగుతాయో శిల్ప పాత్ర ద్వారా తెలియజేసే ప్రయత్నం చేశారు. ఆమెకు ఎదురైన పరిణామాల నేపథ్యంతో.. సన్నివేశాలను ఇంకా ఉత్కంఠ భరితంగా చూపించి ఉంటే బాగుండేది. ఆమెతోపాటు నవీన్ పాత్రకూ సరైన ముగింపు ఇవ్వలేదు. క్లైమాక్స్ ఊహకు తగ్గట్టే ఉంటుంది.
స్నేహితులుగా హర్ష్‌రోషన్, కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు ఆకట్టుకుంటారు. శిల్ప పాత్రలో శాన్వీ మేఘన ఒదిగిపోయారు. ఆమెను ప్రేమించిన నవీన్ పాత్రలో నిహాల్ కోదాటి ఫర్వాలేదనిపిస్తారు. ఎలాంటి అసభ్యకర సన్నివేశాలు లేవు. కుటుంబంతో కలిసి చూడొచ్చు. పల్లెటూరి వాతావరణం ఉట్టిపడే ఈ సినిమా నిడివి 2:10 గంటలు.
బలాలు
+ కాన్సెప్టు
+ ముగ్గురు స్నేహితుల హంగామా
బలహీనతలు
– కొన్ని సన్నివేశాల్లో స్పష్టత లోపించడం
– అక్కడక్కడా సాగదీత
చివరిగా: ఈ మ్యాజికల్ స్కూటర్‌పై ఓసారి జర్నీ చేయొచ్చు!
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!