భారతదేశంలో ఇటీవల కాలంలో ఈవీ స్కూటర్ల వినియోగం భారీగా పెరిగింది. ముఖ్యంగా ఓలా, టీవీఎస్ ఐక్యూబ్ స్కూటర్లు అమ్మకాల్లో రికార్డులు సృష్టిస్తున్నాయి.
ఈవీ స్కూటర్లు ప్రారంభంలో మంటలు అంటుకోవడంతో చాలా మంది వాటి కొనుగోలుకు ముందుకు రాలేదు. అయితే ఈవీ రంగంలో ఓలా, టీవీఎస్ ఎంట్రీ తర్వాత ఈ స్కూటర్లు మండవు అనే నమ్మకంతో ప్రజలు ఎక్కువగా వీటిని కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వ రాయితీలతో కలిపి ఈ స్కూటర్లు మధ్యతరగతి ప్రజలకు కూడా అందుబాటులో ఉండడంతో స్కూటర్ మార్కెట్ మొత్తం ఈవీ స్కూటర్ల వైపు మళ్లింది. అయితే గత కొన్ని రోజులుగా టీవీఎస్ ఐక్యూబ్ స్కూటర్‌లలో కూడా మంటలు వస్తున్నాయనే వార్త ఈవీ ప్రియులను ఆందోళనకు గురి చేస్తుంది. ఈ నేపథ్యంలో టీవీఎస్ ఐక్యూబ్ స్కూటర్‌లలో మంటల గురించి వివరాలను తెలుసుకుందాం.
టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు మంటలు అంటుకున్న రెండో సంఘటన పూణేలో సంభవించింది. ఈ నేపథ్యంలో ఈవీ వాహనాల భద్రతపై తీవ్ర ఆందోళనలు తలెతుతున్నాయి. ఈ సంఘటన సొసైటీకు సంబంధించిన పార్కింగ్ ప్లేస్‌లో జరిగింది. అయితే అదృష్టవశాత్తూ ఎటువంటి హాని జరగలేదు. అలాగే అగ్నిప్రమాదానికి కారణం ఇంకా తెలియరాలేదు. ఈ సంఘటనను అభినందన్ జైన్ అనే యూజర్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులతో పాటు మీడియా సంస్థలను ట్యాగ్ చేశాడు.
టీవీఎస్ ఐక్యూబ్‌కు సంబంధించిన ఇటీవలి సంఘటనలపై ప్రజల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కఠినమైన భద్రతా ప్రమాణాలు, నాణ్యత నియంత్రణ చర్యల పాటించే టాప్ కంపెనీల స్కూటర్లలో కూడా మంటలు రావడంపై మండిపడుతున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన టీవీఎస్ కంపెనీ ఇంకా బహిరంగ ప్రకటన విడుదల చేయలేదు. అయితే అగ్నిప్రమాదానికి కారణాలను కంపెనీ దర్యాప్తు చేసి, భద్రతా సమస్యలను పరిష్కరించడానికి తగిన చర్యలు తీసుకోవాలని టీవీఎస్ ఐక్యూబ్ యూజర్లు ఎక్స్ వేదికగా డిమాండ్ చేస్తున్నారు.