కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద ఇటీవల బస్సు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. 19 మంది ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు. అంతకుముందు బైకర్ శివశంకర్ మరణించాడు.
ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే తాజాగా కర్నూలు బస్సు ప్రమాద దర్యాప్తులో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు మూడో వ్యక్తి కోసం వెతుకుతున్నారు. అదే రోడ్డు మీదుగా వెళ్ళిన మరో ఓమ్ని బస్సు డ్రైవర్ గురించి సెర్చింగ్ నడుస్తోంది.
ఈ బస్సు బైక్‌ను రోడ్డు మధ్యలోకి లాక్కెళ్లిందని, ఆ తర్వాతే హైదరాబాద్ – బెంగళూరు వెళ్తున్న వి కావేరీ ట్రావెల్స్ బస్సు దానిని ఢీకొట్టి మరో 300 మీటర్లు ఈడ్చుకెళ్లిందని పోలీసుల దర్యాప్తులో తెలిసింది. దీంతో మంటలు చెలరేగి 19 మంది ప్రయాణికులు మృతి చెందారు. బైక్ నడిపిన శివ శంకర్ మద్యం తాగి ఉన్నాడని, బెంగళూరు వెళ్తున్న బస్సు బైక్‌ను ఢీకొట్టడం కంటే ముందే ప్రమాదానికి గురయ్యామని ఎర్రిస్వామి చెప్పాడు.
శివశంకర్ ప్రమాదానికి గురైనప్పుడు, బైక్ డివైడర్ దగ్గర పడిపోయిందని కర్నూలు డీఐజీ ప్రవీణ్ చెప్పారు. డివైడర్‌కు ఢీకొని అక్కడికక్కడే మరణించాడని తెలిపారు. వెనుక కూర్చున్న ఎర్రి స్వామి కూడా కింద పడిపోయాడని వెల్లడించారు. సమీపంలోని పెట్రోల్ బంక్‌లోని సీసీటీవీ ఫుటేజీ పరిశీలిస్తే 14 వాహనాలు ప్రమాద స్థలం గుండా వెళ్లిన్నట్లు కనిపించింది.
‘డివైడర్‌కు దగ్గరగా ఉన్న బైక్‌ను ఒక బస్సు రోడ్డు మధ్యలోకి లాగి అక్కడే వదిలేసింది. కావేరీ ట్రావెల్స్ బస్సు బైక్‌ను ఢీకొట్టి 300 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లింది, తర్వాత బైక్ ఇంధన ట్యాంక్ పేలిపోయింది. ప్రమాదం జరిగింది.’ అని డీఐజీ ప్రవీణ్ అన్నారు.
ఇప్పటివరకు పోలీసులు ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. బస్సు డ్రైవర్ ఎం.లక్ష్మయ్య, యజమాని వేమూరి వినోద్ కుమార్. మంటల్లో చిక్కుకున్న ప్రయాణికులను రక్షించడంలో సహాయం చేసిన రెండో డ్రైవర్ శివ నారాయణపై కేసు నమోదు చేయలేదు. లక్ష్మయ్యను బుధవారం జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ఆ ప్రదేశాన్ని దాటిన మరో బస్సు నుండి డ్యాష్‌బోర్డ్ ఫుటేజీని పొందిన తర్వాత మరో డ్రైవర్ ప్రమేయాన్ని పోలీసులు కనుగొన్నారని డీఐజీ తెలిపారు.
శివ శంకర్ బైక్ రోడ్డు మధ్యలో కాకుండా డివైడర్ దగ్గర పడిపోయిందని డ్యాష్‌బోర్డ్ ఫుటేజ్‌లో కనిపిస్తున్నందున, బైక్‌ను మరొక బస్సు రోడ్డు మధ్యలోకి లాగిందని గుర్తించామని డీఐజీ ప్రవీణ్ వివరించారు. బైక్‌ను రోడ్డు మధ్యలోకి ఈడ్చికెళ్లిన మరో బస్సు డ్రైవర్ రోడ్డు పక్కకు ఆపి ఉంటే ఈ ఘోర ప్రమాదం జరిగేది కాదన్నారు. ఈ డ్రైవర్ ఎవరో ఇంకా గుర్తించలేదని, డాష్‌బోర్డ్ విజువల్స్‌లో మరో బస్సు బైక్ నుండి తృటిలో తప్పించుకుందని డీఐజీ తెలిపారు.
































