అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీ మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అంబాపురం అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో కీలక నిందితుడుగా గుర్తించిన ఏసీబీ అధికారులు రాజీవ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన జోగి రాజీవ్.. అగ్రి గోల్డ్ భూముల క్రయ విక్రయాల్లో ఎలాంటి గోల్ మాల్ జరగలేదని, ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. తన తండ్రిపై కక్షతోనే తనను అరెస్ట్ చేశారన్నారు. మరోవైపు జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
తన తండ్రిపై కక్షతోనే తనను అరెస్ట్ చేశారని జోగి రాజీవ్ ఆరోపించారు. అందరూ కొన్నట్టే తామూ భూముల కొనుగోలు చేశామని చెప్పారు. అగ్రి గోల్డ్ కేసును చట్టపరంగా ఎదుర్కొంటామని జోగి రాజీవ్ చెప్పారు. తమపై ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని జోగి రాజీవ్ విమర్శించారు. మరోవైపు అగ్రి గోల్డ్ భూములు ఆల్రెడీ అటాచ్‌లో ఉన్నాయనీ, అటాచ్‌మెంట్‌లో ఉన్న భూమిని ఎవరైనా కొంటారా అని జోగి రమేష్ ప్రశ్నించారు. కక్ష ఉంటే తనపై తీర్చుకోవాలనీ, నా కుటుంబాన్ని టార్గెట్ చేస్తారా అంటూ నిలదీశారు. తప్పు చేస్తే ఉరేసుకుంటానని జోగి రమేష్ ఛాలెంజ్ చేశారు.
వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్‌పై ఏకంగా అగ్రి గోల్డ్ యాజమాన్యమే ఫిర్యాదు చేసింది. అగ్రి గోల్డ్ డైరెక్టర్ల భూమిని జోగి రమేష్ కబ్జా చేశారని హైకోర్టును ఆశ్రయించింది. తమ భూమిని కబ్జా చేసేందుకు రికార్డులను తారుమారు చేశారని, సర్వే నెంబర్లు మార్చేసి కొనుగోలు చేసినట్టు దొంగ పత్రాలు సృష్టించారని పిటిషన్‌లో పేర్కొంది అగ్రి గోల్డ్ యాజమాన్యం.
ఈ నేపథ్యంలోనే విజయవాడ అంబాపురంలో అగ్రిగోల్డ్ డైరెక్టర్ల పేరిట ఉన్న భూమిని అటాచ్ చేసింది సీఐడీ. ఇదే భూమిని గతంలోనే కొనుగోలు చేసినట్టు దొంగ పత్రాలు సృష్టించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు జోగి రమేష్. ఈ వ్యవహారంలో ఫిర్యాదులు రావడంతో విచారణకు ఆదేశించింది ప్రభుత్వం. అటాచ్ చేసిన భూముల విషయంలో అక్రమాలు జరిగినట్టు గుర్తించిన సీఐడీ.. 9మందిపై ఏసీబీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది.
ఈ కేసులో ఏ1గా జోగి రమేష్ కుమారుడు రాజీవ్, ఏ2గా జోగి సోదరుడు వెంకటేశ్వరరావు ఉండగా.. మరో ఏడుగురు ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర ఉన్నట్లు సీఐడీ కేసు నమోదు చేసింది. ఇందులో అడుసుమిల్లి మోహన రాందాసు, వెంకట సీతామహాలక్ష్మి , సర్వేయర్ దేదీప్య, మండల సర్వేయర్ రమేష్, డిప్యూటీ తహశీల్దార్ విజయ్‌కుమార్, విజయవాడ రూరల్ తహశీల్దార్ జాహ్నవి, విజయవాడ రిజిస్ట్రార్ నాగేశ్వరరావు ఉన్నారు. వీళ్లందరినీ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేశారు.