రెండు రాష్ట్రాలు.. ఐదుగురు నేతలు..

www.mannamweb.com


పదేళ్ళపాటు కేసీఆర్‌, ఐదేళ్ళ పాటు జగన్‌ ఇద్దరూ ‘మా మాటే శాసనం’ అన్నట్లు ఎదురులేకుండా పాలించారు. కానీ ఇద్దరూ ఇంచుమించు ఒకే సమయంలో రాజకీయంగా దెబ్బ తిన్నారు.

మరోపక్క చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌, రేవంత్ రెడ్డి ముగ్గురూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓ రాజకీయ నాయకుడు ఏవిదంగా పోరాట స్పూర్తితో పార్టీని ముందుకు నడిపించాలో నిరూపించి చూపారు.

ఇప్పుడు పదవీ, అధికారం చేతిలో ఉన్నప్పుడు కూడా ఏవిదంగా వ్యవహరించాలో వారు ముగ్గురూ నిరూపించి చూపుతున్నారు.

ఈ ఒక్క విషయంలో తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి ఆలోచనలు, వ్యూహాలు సాధారణ ప్రజానీకానికి కొరుకుడుబడటం లేదు. అందువల్ల విమర్శల పాలవుతున్నారు. బహుశః మరో రెండు మూడేళ్ళలో మంచో చెడో స్పష్టత వస్తుంది.

ఈ ఐదుగురు నేతల తీరుని ఓసారి బేరీజు వేసుకొని చూసిననట్లయితే కేసీఆర్‌, జగన్‌ ఇద్దరూ మహా మేధావులే అయినప్పటికీ వారి అహంభావం, వారి ద్వేష భావమే వారినీ, వారి పార్టీలను దెబ్బతీసిందని అర్దమవుతుంది.

చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, పవన్ కళ్యాణ్‌ల తీరుని నిశితంగా పరిశీలిస్తే ముగ్గురిలో పాజిటివ్ థింకింగ్, ఎదురుదెబ్బల నుంచి గుణాపాఠాలు నేర్చుకునే మంచి లక్షణాలు వారిని నేడు ఈ స్థాయిలో నిలిపిన్నట్లు అర్దమవుతుంది.

కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడుపై ద్వేషంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, రాష్ట్రం పట్ల చులకనగా వ్యవహరించేవారు. మాట్లాడేవారు. చివరికి తాను ఏరికొరి ఏపీ ముఖ్యమంత్రిని చేసిన జగన్‌తో కూడా ఆయన సర్దుకుపోలేకపోయారు. కేసీఆర్‌ అహంభావం, అతిశయం, ద్వేషం కారణంగా రాజకీయాలలో ఒంటరిగా మిగిలిపోయారు.

మోడీ పట్ల ద్వేషంతో కేంద్రంతో కయ్యమాడుతూ కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్రానికి కూడా నష్టం కలిగించుకోగా, అప్పులు, అవినీతి, అక్రమాలు, ఆరాచకాలతో జగన్‌ ఏపీకి తీరని నష్టం కలిగించారు.

చంద్రబాబు నాయుడు పట్ల ద్వేషంతో రగిలిపోతూ చివరికి ఆ ద్వేషాగ్నిలో జగన్‌, వైసీపీ నేతలు కూడా బూడిదైపోయారు. చంద్రబాబు నాయుడుని రాజకీయంగా దెబ్బతీయాలనే దురాలోచన చేసినందునే కేసీఆర్‌ కూడా రిటర్న్ గిఫ్ట్ తీసుకోవలసి వచ్చిందని అందరికీ తెలుసు.

సిఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఏపీని గాడిలో పెట్టుకొని మళ్ళీ సానుకూల వాతావరణం సృష్టించారు. అభివృద్ధి పధంలో నడిపిస్తున్నారు.

కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌ కూడా పదవీ, అధికారం చేపట్టగానే అహంభావం ప్రదర్శించకుండా, పాలనలో, రాజకీయాలలో తన కంటే చాలా సీనియర్ అయిన చంద్రబాబు నాయుడుతో గౌరవంగా, సఖ్యతగా ఉంటూ కొత్త విషయాలు నేర్చుకుంటూనే తనదైన శైలిలో దూసుకుపోతున్నారు.

కూటమి ప్రభుత్వంలో బీజేపి కూడా చాలా ఒద్దికగా ఇమిడిపోయింది. కూటమి ప్రభుత్వం అటు కేంద్రంతో కూడా సఖ్యతగా ఉంటూ ఏపీకి అన్నీ సాధించుకుంటోంది.

కానీ ఇప్పుడు ఏపీకి అన్ని విధాలా సానుకూల వాతావరణ ఉన్నప్పటికీ, సిఎం చంద్రబాబు నాయుడు కేసీఆర్‌, జగన్‌లాగా ఏమాత్రం అహంభావం ప్రదర్శించకుండా అందరినీ కలుపుకుపోతూ ముందుకు సాగుతున్నారు.

తెలంగాణతో బంధం బలోపేతం చేసుకోవడానికి రాజకీయా అవరోధాలు ఉన్నప్పటికీ వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. తిరుమల శ్రీవారి దర్శనాలకు, ఆర్జిత సేవలకు తమ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇచ్చే సిఫార్సు లేఖలను గౌరవించాలని రేవంత్ రెడ్డి డిసెంబర్‌ 16న లేఖ వ్రాయగా, సిఎం చంద్రబాబు నాయుడు వెంటనే సానుకూలంగా స్పందిస్తూ 30న జవాబివ్వడమే ఇందుకు చక్కటి తాజా నిదర్శనం.

కనుక ఇప్పటికైనా కేసీఆర్‌, జగన్‌ ఇద్దరూ అహంభావం, ద్వేషాలు పక్కనపెట్టి చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, పవన్ కళ్యాణ్‌ల నుంచి ఏమైనా నేర్చుకుంటే వారికీ, వారి పార్టీలకు మంచిది కదా?