మద్యం మత్తులో కారులో నిద్ర.. ఊపిరాడక ఇద్దరు యువకుల మృతి

పెట్రోలు అయిపోయి ఏసీ ఆగినా గుర్తించకపోవడంతో దుర్మరణం


మద్యం మత్తులో కారులో ఏసీ వేసుకుని నిద్రపోయిన ఇద్దరు యువకులు ఊపిరాడక మృతిచెందిన ఘటన తిరుపతి జిల్లాలో సోమవారం జరిగింది.

బుచ్చినాయుడు కండ్రిగ మండలంలోని గోవిందప్ప కండ్రిగ గ్రామానికి చెందిన దిలీప్‌(25), వినయ్‌(20) వరసకు అన్నదమ్ములు. దిలీప్‌ గ్యాస్‌ డెలివరీ బాయ్‌గా పనిచేస్తూ తిరుచానూరులో నివాసం ఉంటున్నాడు. వినయ్‌ తితిదేలో కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తూ స్థానిక గోపాలరాజు కాలనీలోని తన సోదరుడి నివాసంలో ఉంటున్నాడు. ఇద్దరూ కలిసి ఆదివారం రాత్రి తిరుచానూరు పరిధిలోని కాలువగడ్డ వీధిలో కారులోనే మద్యం తాగి.. ఏసీ వేసుకుని నిద్రలోకి జారుకున్నారు. కొంతసేపటి తరువాత పెట్రోలు అయిపోవడంతో ఏసీ ఆగిపోయింది. దీంతో ఇద్దరూ ఊపిరాడక మృతిచెందారు. మద్యం తాగే ముందు కారుపై కవరు కప్పి లోపలకు వెళ్లడంతో ఎవరూ గుర్తించలేకపోయారు. సోమవారం ఉదయం ఆలస్యంగా గుర్తించిన దిలీప్‌ తండ్రి రవి తిరుచానూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ సునీల్‌కుమార్, ఎస్సై సాయినాథ్‌ చౌదరి మృతదేహాలను పరిశీలించి వివరాలు ఆరా తీశారు. వాటిని రుయాకు తరలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. దిలీప్, వినయ్‌లు మృతి చెందిన కారు దిల్లీ రిజిస్ట్రేషన్‌ (డీఎల్‌9సీటీ1765)తో ఉండగా ఆ వాహనం ఎవరిదనే వివరాలు కుటుంబ సభ్యులకు తెలియకపోవడం గమనార్హం. వాహనం విషయమై పోలీసులు అడిగిన ప్రశ్నలకు వారు మొక్కుబడిగా సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు కారెవరిది? ఇక్కడికి ఎలా వచ్చిందనే కోణంలోనూ విచారణ చేస్తున్నారు

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.