యూఏఈ అందించే ‘గోల్డెన్ వీసా (Golden Visa)’లకు ఎంతో ఆదరణ ఉంటుంది. ఈ క్రమంలోనే కొత్త రకం గోల్డెన్ వీసాలనూ అందించేందుకు సిద్ధమైంది.
స్థిరాస్థి కొనుగోలు, వ్యాపారంలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం వంటి ప్రస్తుత పద్ధతులకు భిన్నంగా.. నామినేషన్ ఆధారిత గోల్డెన్ వీసాలు జారీ చేయనుంది. ప్రయోగాత్మకంగా తొలుత భారత్, బంగ్లాదేశ్ వాసులకు వీటిని ఇచ్చే ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం భారత్‌లో రయాద్ గ్రూప్ అనే కన్సల్టెన్సీని ఎంపిక చేసింది.
ఇప్పటివరకు భారత్ నుంచి దుబాయ్ గోల్డెన్ వీసా పొందే మార్గాల్లో.. స్థిరాస్తిలో కనీసం 20 లక్షల ఏఈడీ (రూ.4.66 కోట్లు)లు లేదా వ్యాపారంలో పెద్దమొత్తంలో పెట్టుబడులు పెట్టడం ఒకటి. కొత్తగా ప్రవేశపెట్టిన నామినేషన్ ఆధారిత వీసా విధానం కింద.. లక్ష ఏఈడీ (దాదాపు రూ.23.30 లక్షలు)ల ఫీజు చెల్లించడం ద్వారా జీవితకాలం చెల్లుబాటయ్యే గోల్డెన్ వీసాను పొందొచ్చని సంబంధిత వర్గాలు ఓ వార్తాసంస్థకు తెలిపాయి. మూడు నెలల్లో 5వేల మందికిపైగా భారతీయులు ఈ రకం వీసా కోసం దరఖాస్తు చేసుకుంటారని అంచనా వేశాయి.
భారతీయులు యూఏఈ గోల్డెన్ వీసా పొందేందుకు ఇదొక సువర్ణావకాశమని రయాద్ గ్రూప్ ఎండీ రయాద్ కమల్ అయూబ్ తెలిపారు. ”ఈ వీసా కోసం దరఖాస్తు చేసుకున్నవారి నేపథ్యాన్ని మొదట తనిఖీ చేస్తాం. యాంటీ-మనీలాండరింగ్, క్రిమినల్ రికార్డులు, సోషల్ మీడియా తనిఖీలు వంటివి ఇందులో ఉంటాయి. ఆర్థికం, వాణిజ్యం, సైన్స్, స్టార్టప్, ఉద్యోగ సేవలు వంటి మార్గాల్లో యూఏఈ మార్కెట్‌కు వారు ఎలా ప్రయోజనం చేకూర్చగలరో కూడా పరిశీలిస్తాం. అనంతరం తుది నిర్ణయం కోసం సంబంధిత దరఖాస్తును ప్రభుత్వానికి పంపుతాం” అని వెల్లడించారు.
దరఖాస్తుదారులు దుబాయ్‌ను సందర్శించాల్సిన అవసరం లేకుండా.. వారి స్వదేశం నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ”సంస్థ రిజిస్టర్డ్ కార్యాలయాలు, ఆన్‌లైన్ పోర్టల్, వన్‌వాస్కో కేంద్రాలు (వీసా సేవల కంపెనీ), ప్రత్యేక కాల్ సెంటర్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ రకం గోల్డెన్ వీసా పొందిన వ్యక్తులు.. తమ కుటుంబ సభ్యులనూ దుబాయ్‌కు తీసుకురావొచ్చు. సహాయకులు, డ్రైవర్లనూ నియమించుకోవచ్చు. స్థానికంగా ఏదైనా వ్యాపారం, ఉద్యోగం చేసుకోవచ్చు. నామినేషన్ ఆధారిత వీసా జీవితకాలం చెల్లుబాటు అవుతుంది” అని వివరించారు. ఈ పైలట్ ప్రాజెక్టును త్వరలో చైనా, ఇతర దేశాలకు విస్తరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
































