శ్రీశైలం గురించి చాలామందికి తెలియని రహస్యాలు..అడుగుపెట్టే ముందు ఇది తెలుసుకోండి

నదేశంలోని ఆలయాలకు కొదవే లేదు. ఏ ఆలయం ప్రత్యేకత దానిదే. అయితే కొన్ని ఆలయాలు చాలా శక్తివంతమైనవిగా నిరూపించబడ్డాయి. ముఖ్యంగా ద్వాదశ జ్యోతిర్లింగాలు అంటే చాలా పవర్ ఫుల్ టెంపుల్స్ అని భక్తుల ప్రగాఢ నమ్మకం.


ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి ఆంధ్రప్రదేశ్ లోని శ్రీశైలంలో ఉంది. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన మల్లికార్జున లింగం, అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన భ్రమరాంబికా దేవి పీఠం ఒకే ప్రాంగణంలో కొలువైన ఏకైక దివ్య క్షేత్రం శ్రీశైలం మాత్రమే.

ఇది కేవలం ఆలయం కాదు, శివశక్తుల ఐక్య స్వరూపానికి సజీవ సాక్ష్యం. ఈ అద్భుత కలయిక వెనుక స్కంద పురాణం, గరుడ పురాణాలలో దాగివున్న ఎన్నో అద్భుతమైన గాథలు ఉన్నాయి. భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇవాళ(అక్టోబర్ 16,2025) శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంభ మల్లికార్జున స్వామి దేవస్థానాన్ని సందర్శిస్తున్నారు.

శివుడు మల్లికార్జునుడిగా ఎలా వెలిశాడు?

ఒకనాడు వినాయకుడు,కుమారస్వామి ఇద్దరిలో ఎవరికి ముందుగా వివాహం జరిపించాలనే చర్చ వచ్చినప్పుడు శివపార్వతులు ఒక పోటీ పెట్టారు. ఎవరైతే ముల్లోకాలను చుట్టి ముందుగా వస్తారో, వారికే ఫస్ట్ పెళ్లి చేస్తామని ప్రకటించారు. కుమారస్వామి తన నెమలి వాహనంపై వెంటనే బయలుదేరగా.. వినాయకుడు తన బుద్ధి చాతుర్యంతో తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేసి తల్లిదండ్రులను మించిన లోకాలు లేవు అని చెప్పి పోటీలో గెలిచాడు. తిరిగి వచ్చిన కుమారస్వామికి ఈ విషయం తెలిసి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. తల్లిదండ్రులపై అలిగి కైలాసాన్ని విడిచి క్రౌంచ పర్వతంపైకి వెళ్లిపోయాడు. పుత్రుని వియోగం తట్టుకోలేని శివపార్వతులు.. కుమారుడిని వెతుక్కుంటూ క్రౌంచ పర్వతానికి వచ్చారు. తమ రాక కుమారుడికి ఇష్టం లేదని గ్రహించి వారు ఆ పర్వతంపైనే జ్యోతిర్లింగ రూపంలో వెలిశారు. పార్వతీదేవి (మల్లిక) సమేతంగా శివుడు (అర్జునుడు) వెలిసినందున ఈ స్వామికి మల్లికార్జునుడు అని పేరు వచ్చింది.

శక్తి పీఠం ఆవిర్భావం..స్థల పురాణం

పూర్వం దక్ష ప్రజాపతి.. తన అల్లుడైన శివుడిని అవమానించేందుకు బృహస్పతియాగం చేస్తాడు. ఆ యజ్ఞానికి దేవతలందరినీ ఆహ్వానించి కూతురైన సతీదేవిని, అల్లుడైన శివుడిని పిలవడు. అయినప్పటికీ పుట్టింటిపై మమకారంతో సతీదేవి శివుడు వారించినా కూడా వినకుండా తండ్రి చేపట్టిన యజ్ఞానికి వెళ్తుంది. అక్కడ దక్షుడు శివుడిని నిందించడం భరించలేక సతీదేవి యోగాగ్నిలో ఆత్మాహుతి చేసుకుంటుంది. ఈ విషయం తెలిసిన శివుడు ప్రళయ రుద్రుడై తన గణాలతో యజ్ఞాన్ని ధ్వంసం చేస్తాడు. సతీదేవి నిర్జీవ శరీరాన్ని భుజంపై వేసుకుని లోకాలన్నీ తిరుగుతూ ప్రళయ తాండవం చేస్తాడు. శివుని శోకాన్ని నివారించి సృష్టిని కాపాడటానికి శ్రీమహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండిస్తాడు. ఆ శరీర భాగాలు పడిన 51 ప్రదేశాలు శక్తి పీఠాలుగా వెలిశాయి. వాటిలో 18 అత్యంత మహిమాన్వితమైనవిగా మహా శక్తి పీఠాలుగా కీర్తించబడ్డాయి. ఆదిశంకరాచార్యుల ప్రకారం.. శ్రీశైలంలో సతీదేవి మెడ భాగం (గ్రీవం) పడిందని ప్రతీతి. అందుకే ఇది మహాశక్తి పీఠంగా విరాజిల్లుతోంది.

పార్వతి భ్రమరాంబగా ఎందుకు అవతరించింది?

పూర్వం అరుణాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మ కోసం ఘోర తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమనగా..అరుణాసురుడు తనకు రెండు కాళ్లు, నాలుగు కాళ్లు ఉన్న జీవుల వల్ల మరణం లేకుండా వరం అడగ్గా బ్రహ్మ దాన్ని అనుగ్రహించాడు. ఆ వర గర్వంతో దేవతలను, ఋషులను అరుణాసురుడు హింసించసాగాడు. అతని దురాగతాలను ఆపడానికి దేవతలందరూ ఆదిపరాశక్తిని ప్రార్థించారు. అప్పుడు పార్వతీదేవి ఒక అద్భుతమైన రూపాన్ని ధరించింది. ఆమె ఆరు కాళ్లు ఉన్న అసంఖ్యాకమైన భ్రమరాలను (తుమ్మెదలు) తన శరీరం నుండి సృష్టించింది. ఆ భ్రమరాలు అరుణాసురుడిని, అతని సైన్యాన్ని పూర్తిగా చుట్టుముట్టి, కుట్టి సంహరించాయి. బ్రహ్మ వరం ప్రకారం రెండు లేదా నాలుగు కాళ్ల జీవుల వల్ల అతనికి మరణం లేదు, కానీ ఆరు కాళ్ల భ్రమరాల చేతిలో హతమయ్యాడు. అలా లోకాలను రక్షించిన తల్లి, భ్రమరాలకు తల్లిగా భ్రమరాంబికా దేవిగా ప్రసిద్ధి చెందింది. శ్రీశైలంలోని ఆలయ గర్భగుడి వెనుక గోడపై ఒక చిన్న రంధ్రం ఉంటుంది. భక్తులు చెవి ఆనించి వింటే, ఇప్పటికీ తుమ్మెదల ఝుంకారం (శబ్దం) వినిపిస్తుందని విశ్వసిస్తారు. ఇది అమ్మవారి సాక్షాత్కారానికి నిదర్శనంగా భావిస్తారు.

కుమార భైరవ స్వామి, ఇతర రహస్యాలు

తల్లిదండ్రులపై అలిగి వెళ్లిన కుమారస్వామి వారికి దగ్గరలోనే కొండపై వెలిశాడు. ఆయన ఈ క్షేత్రానికి పాలకుడిగా కుమార భైరవ స్వామిగా పూజలందుకుంటున్నాడు. మల్లికార్జునుడి దర్శనానికి ముందు కుమారస్వామిని దర్శించుకోవడం ఇక్కడి సంప్రదాయం. శ్రీశైల క్షేత్రం కేవలం రాతి కట్టడం కాదు. ఇది వాత్సల్యం, వీరం, భక్తి, శక్తి సంగమించిన ఒక పవిత్ర భూమి. ఇక్కడ మల్లికార్జునుడిని స్పర్శించి పూజించే భాగ్యం భక్తులకు లభిస్తుంది. భ్రమరాంబికా దేవిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని నమ్మకం. ఈ శివశక్తి స్వరూపాన్ని దర్శించుకోవడం అంటే సృష్టి యొక్క మూలాన్ని దర్శించుకోవడమే.

రాముడు ప్రతిష్ఠించిన లింగం

శ్రీశైల క్షేత్రంలో సీతారాములిద్దరూ లింగాలు ప్రతిష్టించారు. ఆ దివ్య లింగాలు ఇప్పటికి ఉన్నాయి. శ్రీరాముడు ప్రతిష్ఠించిన దివ్యలింగం..సహస్ర లింగం చాలా పెద్దగా ఉంటుంది. ఈ సహస్ర లింగం మల్లికార్జున స్వామి ఆలయం పక్కనే ఉంటుంది. వృథ మల్లికార్జున లింగానికి వెనుక ఉంటుంది, అలాగే సీతాదేవి కూడ భ్రమరాంబ అమ్మవారి ఆలయం ముందున ప్రతిష్ఠించిన లింగం ఉంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.