ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం ఆయన నివాసంలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో మూడు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. దేశ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ, పునరుత్పాదక ఇంధన (Renewable Energy) రంగాన్ని బలోపేతం చేసే దిశగా కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది.
ఈ భేటీలో పీఎం ధన్ ధాన్య కృషి యోజన పథకాన్ని కేబినెట్ ఆమోదించింది. ఈ పథకం ద్వారా దేశ వ్యాప్తంగా ఉన్న 1.70 కోట్ల మంది అన్నదాతలకు ప్రత్యక్షంగా లబ్ధి చేకూరనుంది. కేంద్ర కేబినెట్ నిర్ణయాల గురించి కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు.
ప్రధానమంత్రి ధన్-ధాన్య కృషి యోజన
కేంద్ర మంత్రివర్గం “ప్రధానమంత్రి ధన్-ధాన్య కృషి యోజన” ను 2025-26 నుండి ఆరు సంవత్సరాల కాలానికి ఆమోదించింది. ఈ పథకం ద్వారా 100 వ్యవసాయ జిల్లాలను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ పథకం నీతి ఆయోగ్ ‘ఆకాంక్ష జిల్లాల’ కార్యక్రమం నుంచి ప్రేరణ పొందింది, అయితే ఇది ప్రత్యేకంగా వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపై దృష్టి సారిస్తుంది.
పథకం లక్ష్యాలు:
*వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం.
*పంట వైవిధ్యాన్ని ప్రోత్సహించడం.
*సుస్థిర వ్యవసాయ పద్ధతులను అనుసరించడం.
*పంచాయతీ, బ్లాక్ స్థాయిలో నిల్వ సౌకర్యాలను పెంచడం.
*నీటిపారుదల వ్యవస్థను మెరుగుపరచడం.
ఈ పథకం 11 మంత్రిత్వ శాఖల పరిధిలోని 36 పథకాల సమన్వయం ద్వారా అమలు చేయబడుతుంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు, ప్రైవేట్ రంగ భాగస్వామ్యం కూడా ఉంటాయి. తక్కువ ఉత్పాదకత, తక్కువ పంట సైకిల్, తక్కువ రుణ పంపిణీ వంటి మూడు ప్రధాన ప్రమాణాల ఆధారంగా 100 జిల్లాలను ఎంపిక చేస్తారు. ప్రతి రాష్ట్రం నుంచి కనీసం ఒక జిల్లాను చేర్చుకుంటారు. కేంద్ర కేబినెట్ 6 సంవత్సరాల కాలానికి రూ.24,000 కోట్ల వార్షిక వ్యయంతో కూడిన ప్రధానమంత్రి ధన్-ధాన్య కృషి యోజనను ఆమోదించింది. ఈ పథకం 36 ఇప్పటికే ఉన్న పథకాలను ఏకీకృతం చేస్తుంది.
పునరుత్పాదక ఇంధన రంగంలో భారీ పెట్టుబడులు
ఎన్టీపీసీ లిమిటెడ్‌కు పునరుత్పాదక ఇంధన రంగంలో పెట్టుబడుల కోసం ప్రస్తుత పరిమితికి మించి రూ. 20,000 కోట్ల వరకు పెట్టుబడి పెట్టడానికి అనుమతి ఇచ్చింది. ఈ పెట్టుబడి ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (NGEL), దాని అనుబంధ సంస్థలు, జాయింట్ వెంచర్ల ద్వారా చేయబడుతుంది. దీని లక్ష్యం 2032 నాటికి 60 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించడం.
అదేవిధంగా, ఎన్ఎల్సీ ఇండియా లిమిటెడ్‌కు (NLCIL) కూడా రూ. 7,000 కోట్ల పెట్టుబడికి ప్రత్యేక మినహాయింపు లభించింది. ఈ మొత్తాన్ని అది తన పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థ ఎన్ఎల్సి ఇండియా రెన్యెవబుల్స్ లిమిటెడ్ (NIRL) ద్వారా పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులలో పెట్టుబడి పెడుతుంది. ఇది కంపెనీకి నిర్వహణ, ఆర్థిక సౌలభ్యాన్ని అందిస్తుంది. కేంద్ర కేబినెట్లో తీసుకున్న నిర్ణయాల గురించి కేంద్ర సమాచారం, ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మాట్లాడుతూ.. ప్రధానమంత్రి ధన్-ధాన్య కృషి యోజన పంట కోత తర్వాత నిల్వ సామర్థ్యాన్ని పెంచుతుందని, నీటిపారుదల సౌకర్యాలను మెరుగుపరుస్తుందని, వ్యవసాయ ఉత్పాదకతను పెంచుతుందని చెప్పారు.
































