ఆన్‌లైన్ బెట్టింగ్‍లకు అలవాటు పడి.. జీవితాలు నాశనం చేసుకుని, చివరికి ప్రాణాలు తీసుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటం తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది.
ఆన్‌లైన్ యాప్‌లలో బెట్టింగ్‌లు పెట్టి.. దాచుకున్నదంతా పోగొట్టుకోవడమే కాకుండా.. ఆస్తులు అమ్మేసి, అప్పులు చేస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. చివరికి చేసిన అప్పులు తీర్చలేక, బయటికి చెప్పలేక.. ఆత్మహత్యలు చేసుకుంటున్న సంఘటనలు గత కొంత కాలంగా అనేకం చూస్తున్నాం. దీంతో ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లపై కేంద్ర ప్రభుత్వం కొరఢా ఝళిపిస్తున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఇలాంటి వెబ్‌సైట్లు, యాప్‌లు పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తునే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా కేంద్రం.. సరికొత్త బిల్లును తీసుకువచ్చింది. ఆన్‌లైన్ గేమింగ్ బిల్లును తీసుకు రాగా.. దాన్ని కేంద్ర కేబినెట్ ఆమోదించింది. దీన్ని రేపే లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు.
బెట్టింగ్ యాప్‌ల ద్వారా రోజురోజుకూ పెరిగిపోతున్న మోసాలను అరికట్టేందుకు కేంద్రం ఈ కొత్త బిల్లును తీసుకువచ్చింది. ఇక నుంచి ఆన్‌లైన్‌లో బెట్టింగ్ పెట్టేవారికి గరిష్ఠంగా 7 ఏళ్ల వరకు జైలు శిక్షను విధించనున్నారు. అదే సమయంలో ఈ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసే సెలబ్రిటీలకు కూడా భారీగా జరిమానాలు విధించనున్నట్లు తెలుస్తోంది. దేశంలో రోజురోజుకూ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ ఆన్‌లైన్ గేమింగ్‌ను కట్టడి చేసేందుకు.. అక్రమ బెట్టింగ్‌ను అరికట్టేందుకు ఈ ఆన్‌లైన్ గేమింగ్ బిల్లును తీసుకువచ్చినట్లు కేంద్రం తెలిపింది.
ఈ బిల్లును తీసుకురావడం వల్ల అన్ని ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లను చట్టపరిధిలోకి తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఈ ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు ప్రధానంగా 3 అంశాలపై దృష్టి సారిస్తుంది. ఆన్‌లైన్ గేమింగ్ వల్ల పెరిగిపోతున్న వ్యసనాలను నియంత్రించడం, బెట్టింగ్ యాప్‌ల ద్వారా జరుగుతున్న ఆర్థిక మోసాలను అరికట్టడం, జూదంపై ఇప్పటివరకు దేశంలోని ఒక్కో రాష్ట్రంలో ఉన్న ఒక్కో రకమైన చట్టాలను తొలగించి.. ఒకే రకమైన చట్టాన్ని తీసుకురావడమే దీని ప్రధాన ఉద్దేశం. ఆన్‌లైన్ గేమింగ్ రంగానికి నియంత్రణ సంస్థగా కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ వ్యవహరిస్తుంది. అక్రమ గేమింగ్ వెబ్‌సైట్‌లను బ్లాక్ చేసే అధికారం కూడా ఈ బిల్లు కల్పించనుంది.
బిల్లులో ప్రతిపాదించిన శిక్షలు
ఈ ఆన్‌లైన్ బెట్టింగ్ బిల్లు ప్రకారం.. ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా బెట్టింగ్ చేయడం నేరంగా పరిగణించనున్నారు.
అనుమతి లేని బెట్టింగ్ ప్లాట్‌ఫామ్‌లకు ప్రచారం చేసే సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు జరిమానాలు విధించడం.
భవిష్యత్‌లో అక్రమ బెట్టింగ్‌కు పాల్పడిన వారికి కనిష్ఠంగా ఒక ఏడాది.. గరిష్ఠంగా 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష, జరిమానాలు విధించడం.
గేమింగ్ ఇండస్ట్రీపై ప్రభావం
2029 నాటికి భారత ఆన్‌లైన్ గేమింగ్ పరిశ్రమ 9.1 బిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో దాదాపుగా రూ.80 వేల కోట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఇందులో రియల్ మనీ గేమ్స్ వాటా దాదాపు 86 శాతం ఉంది. అయితే ఈ కొత్తగా ప్రవేశపెట్టనున్న బిల్లు.. గేమింగ్ పరిశ్రమలోని అక్రమ కార్యకలాపాలను అరికట్టనుంది. కరోనా తర్వాత గత 3 ఏళ్లలో గేమింగ్ రంగాన్ని సరిచేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే అక్రమ బెట్టింగ్ సైట్‌లను బ్లాక్ చేయడం, ఆన్‌లైన్ గేమింగ్‌పై 30 శాతం పన్ను, 28 శాతం జీఎస్టీ విధించడం వంటి కఠిన నిర్ణయాలు తీసుకుంది.
































