హార్ట్ బీట్‌తో ఐ ఫోన్ అన్‌లాక్.. మెంటలెక్కే ఫీచర్ తర్వలోనే అందుబాటులోకి.

www.mannamweb.com


సాధారణంగా మనం వాడే స్మార్ట్ ఫోన్‌కు పాస్ వర్డ్ లేదా పిన్ ద్వారా లాక్ వేస్తాం. అయితే క్రమేపి ఫింగర్ ప్రింట్ అన్‌లాక్, ఫేస్ ఐడీ ద్వారా అన్‌లాక్ చేసే సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఇప్పటి వరకూ ఈ విధానాలనే మన డేటా రక్షణకు సురక్షిత భద్రతా సాధానాలుగా భావిస్తున్నారు. అయితే తాజాగా ప్రముఖ కంపెనీ యాపిల్ హృదయ స్పందన ఆధారంగా స్మార్ట్ ఫోన్ అన్‌లాక్ చేసే ఫీచర్‌పై పరిశోధనలు చేస్తుందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ మేరకు ఇప్పటికే పేటెంట్ కోసం దరఖాస్తు చేసిందని సమాచారం. సాధారణంగా హృదయ స్పందన రేటును పర్యవేక్షించడానికి యాపిల్ వాచ్‌లో ఎలక్ట్రో కార్డియోగ్రామ్ ఫీచర్‌ను ఉపయోగిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఆ సాంకేతికతను వాడే కొత్త హార్ట్ లాక్ వినియోగదారుల యాపిల్ పరికరాలను అన్‌లాక్ చేయడానికి అనుమతిస్తుందని నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో యాపిల్ పరికరాల్లో త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్న హార్ట్ లాక్ ఫీచర్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

యాపిల్ వినియోగదారుల కార్డియాక్ యాక్టివిటీ, కార్డియాక్ ఎలక్ట్రికల్ సిగ్నల్‌లను గుర్తించడం కోసం సమీకృత సెన్సార్‌ను ఉపయోగించి ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా ప్రతి వ్యక్తి గుండె ఒక ప్రత్యేకమైన లయను కలిగి ఉంటుంది. దీనిని బయోమెట్రిక్ ఐడెంటిఫైయర్‌గా ఉపయోగించవచ్చు. యాపిల్ వాచ్‌లో ఇప్పటికే ఈ ప్రత్యేకమైన నమూనాలను సంగ్రహించడంలో సహాయపడే ఈసీజీ సెన్సార్‌లు ఉన్నాయి. అయితే ఈ ఫీచర్ అనేది యాపిల్ వాచ్‌ను ధరించే వారికే అందుబాటులో ఉండనుందని పలువురు పేర్కొంటున్నారు. హార్ట్ లాక్ ఫీచర్ వినియోగదారులకు భద్రత, సౌలభ్యం రెండింటినీ మెరుగుపరుస్తుందని యాపిల్ ప్రతినిధులు చెబుతున్నారు. ముఖ్యంగా యాపిల్ వాచ్‌ని ఉపయోగించి వినియోగదారులు తమ మ్యాక్‌లను అన్‌లాక్ చేసినట్లే హార్ట్ రిథమ్ డేటాను ఉపయోగించి వారు తమ ఐఫోన్‌ను త్వరలో అన్‌లాక్ చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.

యాపిల్ కంపెనీ పేటెంట్ హార్ట్ రిథమ్ అన్‌లాక్ సిస్టమ్ గురించి చర్చించడమే కాకుండా వినియోగదారుడికి సంబంధించిన మానసిక స్థితిని గుర్తించడానికి ఈసీజీ హార్ట్ రిథమ్ డేటాను ఉపయోగించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా వర్కవుట్ సమయంలో యాపిల్ వాచ్ లేదా ఐఫోన్ గుండె రిథమ్ డేటాను విశ్లేషించి, వినియోగదారు మానసిక స్థితికి అనుగుణంగా సంగీతాన్ని స్వయంచాలకంగా సర్దుబాటు చేసే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు.