దేశంలో ప్రతి చిన్న కొనుగోలుకు యూపీఐ ద్వారా చెల్లింపులు చేయడం సాధారణమైపోయింది. అయితే, ఏదైనా లావాదేవీ విజయవంతంగా పూర్తయ్యేందుకు కొంత సమయం పడుతుంది.
క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన తర్వాత సక్సెస్ అనే నోటిఫికేషన్ వచ్చాకే లావాదేవీ పూర్తయినట్టు భావిస్తారు. కొన్నిసార్లు దుకాణాల వద్ద ఇలాంటి చెల్లింపులు చేసే క్రమంలో ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వస్తుంది. దీని నివారణకు పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌పీసీఐ) జూన్ 16 నుంచి కొత్త మార్గదర్శకాలను అమల్లోకి తీసుకురానుంది. దీని ద్వారా యూపీఐ లావాదేవీలు మరింత వేగంగా జరగనున్నాయి. ముఖ్యంగా బ్యాలెన్స్ చెకింగ్ మొదలుకొని ఆటో పేమెంట్, రిక్వెస్ట్ పే-రెస్పాన్స్ పే వరకు అనేక రకాల యూపీఐ లావాదేవీలకు ఇప్పుడు పట్టే సమయంలో దాదాపు 50 శాతం తొందరగా జరుగుతుంది. ఎన్‌పీసీఐ తాజా ఆదేశాల ప్రకారం, డెబిట్ లేదా క్రెడిట్ కార్డు లావాదేవీల సమయం జూన్ 16(సోమవారం) నుంచి కేవలం 15 సెకన్లలో పూర్తవుతుంది. ప్రస్తుతం ఈ ప్రక్రియకు 30 సెకన్ల సమయం పడుతోంది. అదేవిధంగా ట్రాన్సాక్షన్ స్టేటస్, అడ్రస్ వ్యాలిడేషన్, ట్రాన్సాక్షన్ సమయం కూడా 30 సెకన్ల నుంచి 10 సెకన్లకు తగ్గుతుంది. యూపీఐ చెల్లింపులను, లావాదేవీలను వాడే కస్టమర్లకు మరింత మెరుగైన సేవలందించేందుకు ఈ మార్పులు చేశామని ఎన్‌పీసీఐ వెల్లడించింది. దీనికి సంబంధించి లావాదేవీల సమయాన్ని తగ్గించాలని బ్యాంకులతో పాటు గూగుల్‌పే, ఫోన్‌పే, పేటీఎం లాంటి పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లకు కూడా ఎన్‌పీసీఐ ఆదేశాలు జారీ చేసింది.
త్వరలో రానున్న ఇతర మార్పులు
యూపీఐ సిస్టమ్‌లో ఆగస్టు నుంచి కూడా ఇతర ముఖ్యమైన మార్పులను ఎన్‌పీసీఐ అమలు చేయడానికి సిద్ధమవుతోంది. అందులో ప్రధానంగా, బ్యాలెన్స్ ఎంక్వైరీకి సంబంధించి కస్టమర్లు ఒక రోజులో 50 కంటే ఎక్కువసార్లు చేసే వీలుంటుంది. అదేవిధంగా పెట్టుబడులు, ఓటీటీలకు చేసే ఆటోమెటిక్ చెల్లింపులను పీ-అవర్స్(రద్దీ సమయం) కాని వేళలోనే ప్రాసెస్ చేయాలి. పీక్-అవర్స్ అనేది నిర్దేశించిన సమయంలో ఎక్కువ యూపీఐ లావాదేవీలు జరుగుతాయి. ఆటోపేమెంట్ కోసం రిక్వెస్ట్ చేయవచ్చు కానీ, పీక్-అవర్స్ కానీ సమయంలోనే సదరు చెల్లింపులు జరుగుతాయి. ఈ మార్పులు ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తాయి.
































