యూరిక్ యాసిడ్.. గుండెపోటు, మెటబాలిక్ సిండ్రోమ్‌కు రహస్య శత్రువు.. ఎలా తగ్గించుకోవాలంటే..?

గౌట్ వచ్చినప్పుడు యూరిక్ యాసిడ్ గురించి ఎక్కువగా వింటాం. కానీ ఇది శరీరంలోని చిన్న చిన్న రక్తనాళాలకు లోపల నష్టం కలిగిస్తూ ఉండొచ్చు. యూరిక్ యాసిడ్ ఎక్కువైతే రక్తనాళాల లోపలి పొర బలహీనపడుతుంది.


ఇది గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. శరీరంలో వాపు పెంచి గుండెపోటు వంటి వాటికి దారి తీస్తుంది.

గుండెపోటుకు సంబంధం ఏంటి..?

గుండెపోటు అంటే కొలెస్ట్రాల్ పెరగడం వల్లే వస్తుందని సాధారణంగా అనుకుంటాం. కానీ కొత్త వివరాల ప్రకారం.. కొలెస్ట్రాల్ సరిగ్గా ఉన్నా.. యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్నవారికి అకస్మాత్తుగా గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ. ఇది చిన్న రక్తనాళాల్లో అడ్డంకులు సృష్టించి, ఆక్సిజన్ సరఫరా తగ్గించి, గుండెను బలహీనపరుస్తుంది.

మెటబాలిక్ సిండ్రోమ్‌ లో యూరిక్ యాసిడ్ పాత్ర

మెటబాలిక్ సిండ్రోమ్ అంటే అధిక రక్తపోటు, పొట్ట చుట్టూ కొవ్వు, ఇన్సులిన్ రెసిస్టెన్స్, కొలెస్ట్రాల్ హెచ్చుతగ్గులు వంటి సమస్యలన్నీ కలిసి ఉండటం. గతంలో యూరిక్ యాసిడ్ ఈ సమస్యల వల్ల వస్తుందని అనుకునేవారు. కానీ ఇప్పుడు యూరిక్ యాసిడే ఈ సమస్యలకు కారణం కావచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. శరీర జీవక్రియలో యూరిక్ యాసిడ్ పెరిగితే ఇన్సులిన్ పనితీరు తగ్గుతుంది. ఇది మెటబాలిక్ సమస్యలకు దారి తీస్తుంది.

యూరిక్ యాసిడ్ ఎప్పుడు పెరుగుతుంది..?

  • డీహైడ్రేషన్.. శరీరానికి సరిపడా నీరు అందకపోతే యూరిక్ యాసిడ్ పెరుగుతుంది.
  • ఆకస్మిక ఉపవాసం లేక డైట్ మార్పులు.. శరీరం తక్షణ శక్తి కోసం సొంత కణాలను విచ్ఛిన్నం చేస్తుంది. ఇది యూరిక్ యాసిడ్‌ ను పెంచుతుంది.
  • నిద్ర సరిగా లేకపోతే.. నిద్రలేమి వంటివి శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెంచుతాయి.
  • చక్కెర పదార్థాలు.. ప్యాకేజ్డ్ ఫుడ్స్‌ లో ఉండే హై ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ యూరిక్ యాసిడ్ స్థాయిలను పెంచుతుంది.

యూరిక్ యాసిడ్ తగ్గించుకునే సహజ మార్గాలు

  • నీరు ఎక్కువ తాగండి.. ఉదయాన్నే ఖాళీ కడుపుతో నీరు తాగితే, మూత్రం ద్వారా యూరిక్ యాసిడ్ బయటకు పోతుంది.
  • వాకింగ్.. భోజనం తర్వాత కాసేపు నడిస్తే శరీరంలోని గ్లూకోజ్, యూరిక్ యాసిడ్ అదుపులో ఉంటాయి.
  • మెగ్నీషియం ఉన్న ఆహారం.. పాలకూర, బాదం, పొద్దుతిరుగుడు గింజలు వంటివి యూరిక్ యాసిడ్ తగ్గించడంలో సహాయపడతాయి.
  • ఉప్పు తగ్గించి పొటాషియం తీసుకోండి.. అరటిపండు, కొబ్బరి నీళ్లు వంటివి పొటాషియం ఎక్కువగా ఉండి యూరిక్ యాసిడ్ బయటకు వెళ్లడానికి సహాయపడతాయి.
  • నిద్రకు ముందు మనసును రిలాక్స్ చేసుకోండి.. రోజూ 10 నిమిషాలు ప్రాణాయామం లేక ధ్యానం చేస్తే ఒత్తిడి తగ్గి యూరిక్ యాసిడ్ స్థాయిలు అదుపులో ఉంటాయి.

సాధారణ యూరిక్ యాసిడ్ స్థాయిలు

ల్యాబ్ రిపోర్టుల్లో యూరిక్ యాసిడ్ 7.0 mg/dL వరకు సాధారణం అని చూపిస్తారు. కానీ కొంతమంది గుండె డాక్టర్లు ఏమంటున్నారంటే.. గుండె ఆరోగ్యానికి అది 5.5 mg/dL కన్నా తక్కువగా ఉండటం మంచిది అని. అంటే మీ రిపోర్ట్‌ లో నార్మల్ అని ఉన్నా.. మీకు గుండె జబ్బులు లేదా మెటబాలిక్ సమస్యలు వచ్చే అవకాశం ఉంటే.. ఆ యూరిక్ యాసిడ్ స్థాయి మీకు ఎక్కువగానే ఉండొచ్చు.

యూరిక్ యాసిడ్‌ ను కేవలం ఒక అంకెగా చూడకుండా.. శరీరంలోని జీవక్రియల ఒత్తిడికి ఒక సంకేతంగా అర్థం చేసుకోవడం తెలివైన పని. ప్రతి చిన్న అంకె చూసి భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఆ అంకె వెనుక ఉన్న ప్రభావాలను అర్థం చేసుకోవడమే ముఖ్యం. లక్షణాలను అస్సలు వదిలేయకండి. పరిస్థితి మరీ తీవ్రమయ్యే వరకు ఆగకండి.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.