ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో భారతీయులు స్థిరపడిన సంగతి తెలిసిందే. అయితే ఎన్ని అవకాశాలు ఉన్నప్పటికీ మన తెలుగు వారికి మాత్రం అమెరికా అంటేనే మక్కువ.
అందుకే బీటెక్ పూర్తి కాగానే విదేశాలకు వెళ్లేందుకు అక్కడ ఉన్నత చదువుల కోసం, ఉద్యోగ అవకాశాల కోసం లక్షల మంది రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఏటా వలసవెళుతుంటారు. ప్రధానంగా ఎక్కువ మంది టెక్ రంగంలో ఉద్యోగాల కోసం వేటాడుతున్నారు.
ఈక్రమంలోనే ఒక షాకింగ్ వార్త ఇప్పుడు అందరినీ ఆందోళనకు గురిచేస్తోందని తెలుస్తోంది. అమెరికాకు చెందిన ఐఫోన్ తయారీదారు ఆపిల్ బే ఏరియా కార్యాలయంలో పనిచేస్తున్న అనేక మంది తెలుగు ఉద్యోగులను కంపెనీ ఉద్యోగం నుంచి తొలగించినట్లు ప్రస్తుతం వార్తలు వినిపిస్తున్నాయి. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం దాదాపు 185 మంది తెలుగు ఉద్యోగులను కంపెనీ పని నుంచి తొలగించిందని గ్రేట్ ఆంధ్రా సంస్థ ప్రచురించిన ఒక వార్తలో వెల్లడించింది. అయితే ఇప్పుడు ఈ విషయంపై పెద్ద చర్చ కొనసాగుతోంది. గ్లోబల్ టెక్ జెయింట్ కేవలం తెలుగు రాష్ట్రాలకు చెందిన ఉద్యోగులను మాత్రమే ఎందుకు టార్గెట్ చేసి తొలగించింది అన్నదే. ప్రస్తుతం ఈ విషయం కంపెనీ ఖర్చులను తగ్గించుకోవటానికి చేపట్టే లేఆఫ్స్ కింద చేసింది కాదని తెలుస్తోంది.
ప్రాథమికంగా తెలిసిన సమాచారం ప్రకారం కంపెనీలో పనిచేస్తున్న కొందరు తెలుగు అసోసియేట్లు ఆపిల్ అందించే మ్యాచింగ్ గ్రాంట్స్ ప్రోగ్రామును దుర్వినియోగం చేసినట్లు వెల్లడైంది. ఈ సంస్థలు ఆపిల్ లో పనిచేస్తున్న ఉద్యోగులను తమకు డొనేషన్స్ అందించాలని కోరినట్లు తెలుస్తోంది. కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా అదే నాన్‌ప్రిఫిట్ సంస్థలకు ఉద్యోగులు చేసిన విరాళాలను ఆపిల్ సరిపోల్చింది. ఇక్కడే దర్యాప్తులో ఆసక్తికరమైన విషయం బయటపడింది. తెలుగు ఉద్యోగులు డబ్బు డొనేట్ చేసినట్లే చేసి వాటిని తిరిగి వెనక్కి పొందారని, కంపెనీని మోసం చేశారని ఆపిల్ గుర్తించింది. ఆపిల్ ఫైనాన్స్ విభాగం గుర్తించిన అవకతవకలపై దర్యాప్తులో మెుత్తం విషయం వెలుగులోకి వచ్చింది.
దీంతో సదరు అక్రమ కార్యకలాపాల్లో పాల్గొన్న ఉద్యోగులను రాజీనామా చేయాలని లేదంటే కంపెనీ టెర్మినేట్ చేస్తుందని స్పష్టం చేసింది. దీని కారణంగా 185 మంది తెలుగు ఉద్యోగులు ఉన్నత స్థాయిలో పనిచేస్తున్నప్పిటికీ ఉద్యోగాలను కోల్పోవాల్సి వచ్చిందని తేలింది. తాజా ఘటన అమెరికాలో పనిచేస్తున్న కొన్ని తెలుగు సంఘాల చిత్తశుద్ధిపై తీవ్ర ఆందోళనలకు దారితీసింది. ఇలా వంకరబుద్ది చూపిస్తే కార్పొరేట్ కంపెనీలు క్షమించబోవని తాజాగా ఆపిల్ తీసుకున్న నిర్ణయం చెప్పకనే చెబుతోందని నిపుణులు సైతం చెబుతున్నారు. ఇలాంటి అక్రమాలకు ప్రజలు దూరంగా ఉండాలని వారు ఇమ్మిగ్రెంట్ భారతీయ ఉద్యోగులకు సూచిస్తున్నారు.