అగ్రరాజ్యం అమెరికాలో ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం అక్కడ చదువుకునే విదేశీ విద్యార్థుల పట్ల కఠినంగా వ్యవహరిస్తోంది.
వీసాల గడువు ముగిసినప్పటికీ అమెరికాలో అక్రమంగా ఉంటున్న విద్యార్థులపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. తాజాగా అమెరికాలో వలస చట్టాల అమలుపై హౌస్ కమిటీ విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పలువురు చట్టసభ సభ్యులు తమ సూచనలు వెల్లడించారు.
7,000 మంది భారత విద్యార్థులు అమెరికాలోనే?
సెంటర్ ఫర్ ఇమిగ్రేషన్ స్టడీస్‌కు చెందిన జెస్సీకా ఎం. వాఘన్ కమిటీ వీసాల గడువు ముగిసిన స్టూడింట్స్ పై ప్రత్యేకంగా వివరాలు సేకరించింది. ఈ కమిటీ ప్రకారం, 2023లో వీసా గడువు ముగిసినా సుమారు 7,000 మంది భారత విద్యార్థులు ఇంకా అమెరికాలోనే ఉంటున్నట్లు వెల్లడైంది. ప్రపంచవ్యాప్తంగా 32 దేశాలకు చెందిన విద్యార్థులు అమెరికాలో చదువుకుంటున్నారు. వీరిలో 20% మందికి పైగా వీసా గడువు దాటినా అమెరికాలోనే ఉంటున్నారని ఈ కమిటీ నివేదిక వెల్లడించింది.
ఎఫ్-1, ఎం-1 వీసాల ఉల్లంఘనలు
యూనివర్సిటీలు, కళాశాలల్లో పూర్తి స్థాయి విద్యార్థిగా చదువుకునేవారి అమెరికా ప్రభుత్వం ఎఫ్-1 వీసా జారీ చేస్తుంది. ఇక ఎం-1 వీసా – వృత్తిపరమైన కోర్సులు, నాన్-అకడమిక్ అవసరాలకు జారీ చేస్తారు. ఈ వీసా కేటగిరీలలో ఉన్నవారే ఎక్కువగా వీసా గడువు దాటినా అమెరికాలో ఉంటున్నారని సమాచారం.
హెచ్-1బీ వీసాల పరిమితి
జెస్సీకా ఎం. వాఘన్ కమిటీ అభిప్రాయం ప్రకారం.. హెచ్-1బీ వీసాలకు రెండేళ్ల గడువు మాత్రమే ఉండాలి. అవసరమైతే నాలుగేళ్లకు పొడిగించుకునే అవకాశం కల్పించాలి. ఆటోమేటిక్ గ్రీన్‌కార్డ్ పొడిగింపులు రద్దు చేయాలి. వీసాల సంఖ్య 75,000 లోపే పరిమితం చేయాలి. అత్యధిక వేతనాలు చెల్లించే సంస్థలకు మాత్రమే వీటిని కేటాయించాలని ఈ కమిటీ సూచించింది.
పార్ట్-టైమ్ ఉద్యోగాలు చేస్తే వీసా రద్దు
ట్రంప్ ప్రభుత్వం విద్యార్థులు పార్ట్-టైమ్ ఉద్యోగాలు చేస్తూ పట్టుబడితే వీసా రద్దు చేస్తామని హెచ్చరించింది. దీంతో పార్ట్‌టైం జాబ్ చేయకుండా చదువుకు అయ్యే ఖర్చులను ఎలా సమకూర్చుకోవాలో విద్యార్థులకు తెలియక, మధ్యలో చదువు వదిలేసి స్వదేశానికి తిరిగి రాలేక తల పట్టుకుంటున్నారు.
అమెరికాలో ఉన్నత విద్య చదువుకోవడమనేది చాలామంది భారత విద్యార్థుల కల. తమ పిల్లలను అప్పు చేసైనా సరే అమెరికా పంపాలని ఎంతో మంది తల్లిదండ్రులు ఆరాట పడుతుంటారు. సంపన్న కుటుంబాలు దీన్ని ప్రతిష్టాత్మకంగా భావిస్తుంటాయి. కానీ అక్కడికి వెళ్లిన తర్వాత భారత విద్యార్థులు పడే అగచాట్లు సాధారణంగా బయటకు రావు. ఎవరికీ చెప్పుకోలేక మౌనంగా భరిస్తుంటారు. ట్రంప్ రాకతో ఈ వాస్తవాలు బయటకు వస్తున్నాయి.
భారతీయ విద్యార్థుల సంఖ్య పెరుగుదల
ఓపెన్ డోర్స్ నివేదిక ప్రకారం, అమెరికాలో ప్రస్తుతం దాదాపు 3 లక్షల మంది భారతీయ విద్యార్థులు ఉండగా, వీరి సంఖ్య ఏటా 35 శాతం పెరుగుతోంది. చైనా విద్యార్థులను కూడా ఈ విషయంలో భారత విద్యార్థులు వెనక్కు నెట్టేశారు. అయితే అమెరికా వెళ్లే విద్యార్థుల్లో అధిక శాతం అప్పులు చేసి విమానం ఎక్కుతున్నారు. ఆ అప్పులను తీర్చడం కోసం అమెరికాలో గ్యాస్ స్టేషన్లు, సూపర్ మార్కెట్లు, రెస్టారెంట్లు తదితర చోట్ల పార్ట్‌టైం జాబ్స్ చేస్తుంటారు.
వీరికి సగటున గంటకు 10 డాలర్ల వరకూ చెల్లిస్తారు. మాస్టర్ ఆఫ్ సైన్స్ (ఎంఎస్) చేస్తున్న విద్యార్థి వారానికి 20 గంటలు పాటు పని చేసేందుకు అవకాశం ఉంటుంది. ఈ లెక్కన నెలకు ఒక్కో విద్యార్థి దాదాపు రూ.70 వేల వరకూ సంపాదిస్తాడు. ఈ సంపాదనతోనే ఇంటి అద్దె, కళాశాల ఫీజు, భోజనం, రవాణా ఖర్చులకు సరిపెట్టుకోవాలి.
అమెరికాలో భారీగా ఖర్చులు
అమెరికాలో ప్రస్తుతం ఒక సింగిల్ బెడ్‌రూమ్ అద్దెకు తీసుకోవాలంటే 1,700 డాలర్లు అంటే దాదాపు రూ.1.46 లక్షలు చెల్లించాలి. మెయింటెనెన్స్ ఖర్చులు అదనం. ఒక విద్యార్థి నెలంతా పార్ట్‌టైం జాబ్ చేసినా ఇంటి అద్దె, ఇతర ఖర్చులు నెగ్గుకు రావడం కష్టం. అలాంటిది ఇప్పుడు అది కూడా సంపాదించడం కుదరదని అమెరికా ప్రభుత్వం ఖరాకండిగా చెబుతుండటంతో విద్యార్థులు, వారి కుటుంబాలు తీవ్ర నిరాశలో కూరుకుపోతున్నారు.
గ్రీన్‌కార్డు కోసం ప్రయాస
పోనీ ఎలాగోలా ఇంటి దగ్గర్నుంచి అప్పులు చేసి డబ్బు తెప్పించి చదువుకుని ఉద్యోగం తెచ్చుకున్నా, వచ్చే జీతంలో ప్రతి రూ.100కి ప్రభుత్వానికి రూ.30 పన్ను కింద చెల్లించాలి. ఆ మిగిలిన దానిలోనే అన్ని ఖర్చులూ భరించాలి. అలా అయినా ఎలాగోలా గడుపుదామంటే, గ్రీన్‌కార్డ్ రావడం పెద్ద ప్రహసనం. భారతీయులకు ఏటా 7 వేల గ్రీన్‌కార్డులు (అమెరికా పౌరసత్వం) మాత్రమే ఇస్తుండగా, పోటీపడుతున్న వారు లక్షల్లో ఉన్నారు.
2012లో గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసిన వారికి ఇప్పుడు ఇస్తున్నారంటే, ఇక ఇప్పుడు దరఖాస్తు చేసుకునే వారికి రావాలంటే కనీసం 40 ఏళ్లు పడుతుంది. అప్పటి వరకూ అదనపు ట్యాక్స్‌లు కడుతూ, హెచ్-1 వీసాపై బిక్కుబిక్కుమంటూ జీవించాలి.
ట్రంప్ ప్రభుత్వం యొక్క కఠిన విధానాలు
ఇంత కష్టం ఉన్నప్పటికీ, అమెరికాలో చదువుకోవాలనే ఆశతో వెళుతున్న వారికి ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఐసీఈ) షాక్ ఇస్తోంది. ట్రంప్ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే దాదాపు 18 వేల మందికి పైగా పార్ట్‌టైం జాబ్ చేస్తున్న వారిని గుర్తించి ‘ఐస్’ టీమ్ అదుపులోకి తీసుకుంది. దీంతో భారతీయ విద్యార్థులు అమెరికాలో పార్ట్‌టైం జాబ్స్‌ను వదులుకుంటున్నారు.