టోల్ ప్లాజాల వద్ద టూ వీలర్స్‌కు యూజర్ ఫీజు?… క్లారిటీ ఇచ్చిన కేంద్రం

దేశవ్యాప్తంగా ఉన్న టోల్ ప్లాజాల వద్ద టూ వీలర్స్‌పై కూడా యూజర్ ఫీజు వసూలు చేయనున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇకపై టూ వీలర్, త్రీ వీలర్ వాహనాలకు టోల్-ఫ్రీ ప్రయాణం ఉండదని ఆ పోస్టులలో పేర్కొంటున్నారు. అయితే ఈ ప్రచారంపై తాజాగా కేంద్రం స్పందించింది.


దేశవ్యాప్తంగా ఉన్న టోల్ ప్లాజాల వద్ద టూ వీలర్స్‌పై కూడా యూజర్ ఫీజు వసూలు చేయనున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇకపై టూ వీలర్, త్రీ వీలర్ వాహనాలకు టోల్-ఫ్రీ ప్రయాణం ఉండదని ఆ పోస్టులలో పేర్కొంటున్నారు. దీంతో పలువురు ఆందోళన చెందుతున్నారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అయితే తాజాగా ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.
టోల్ ప్లాజాల వద్ద టూ వీలర్స్‌కు టోల్ వసూలు చేయనున్నారని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని తెలిపింది. దేశవ్యాప్తంగా జాతీయ రహదారులు, జాతీయ ఎక్స్‌ప్రెస్‌వేలలోని టోల్ ప్లాజాల వద్ద టూ వీలర్స్ నుంచి ఎటువంటి వినియోగదారు రుసుము వసూలు చేయబడదని స్పష్టం చేసింది. జాతీయ రహదారులపై యూజర్ ఫీజు అనేది నేషన్ హైవే ఫీజు (రేట్లు. వసూలు నిర్ణయం) నియమాలు, 2008 ప్రకారం వసూలు చేయడం జరుగుతుందని తెలిపింది. అందులో టూ వీలర్స్ నుంచి టోల్ ఫీజు వసూలు చేసే ఎలాంటి ప్రతిపాదన లేదని పేర్కొంది.
నిబంధనల ప్రకారం… టోల్ ప్లాజాల వద్ద యూజర్ ఫీజు అనేది ఫోర్ వీలర్ లేదా అంతకంటే ఎక్కువ చక్రాల వాహనాల నుంచి మాత్రమే వసూలు చేయబడుతుందని తెలిపింది. టోల్ ఫీజు వసూలు చేసేవాటిలో కారు, జీప్, వ్యాన్ లేదా లైట్ మోటారు వెహికల్ / లైట్ కమర్షియల్ వెహికల్, లైట్ గూడ్స్ వాహనం లేదా మినీ బస్సు / బస్సు లేదా ట్రక్ / భారీ నిర్మాణ యంత్రాలు (HCM) లేదా ఎర్త్ మూవింగ్ ఎక్విప్‌మెంట్ (EME) లేదా మల్టీ యాక్సిల్ వెహికల్ (MAV) (మూడు నుంచి ఆరు యాక్సిల్స్) / ఓవర్‌సైజ్డ్ వెహికల్స్ (ఏడు లేదా అంతకంటే ఎక్కువ యాక్సిల్స్) వంటివి ఉన్నాయని పేర్కొంది.
గతంలో కూడా ఇలాంటి ప్రచారం జరగగా… కేంద్ర ప్రభుత్వం అందులో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేసింది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని ప్రజలను కోరారు. ‘‘ద్విచక్ర వాహనాలపై టోల్ ట్యాక్స్ విధించడం గురించి కొన్ని మీడియా సంస్థలు తప్పుదారి పట్టించే వార్తలను వ్యాప్తి చేస్తున్నాయి. అలాంటి నిర్ణయం ఏదీ ప్రతిపాదించబడలేదు. ద్విచక్ర వాహనాలకు టోల్ ట్యాక్స్ మినహాయింపు పూర్తిగా కొనసాగుతుంది. సంచలనం సృష్టించడానికి నిజాన్ని ధ్రువీకరించకుండా, తప్పుదారి పట్టించే వార్తలను వ్యాప్తి చేయడం హెల్తీ జర్నలిజం కాదు. నేను దీనిని ఖండిస్తున్నాను” అని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గతంలో సోషల్ మీడియాలో చేసిన పోస్టులో పేర్కొన్నారు.
👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.