పామాయిల్ ను సబ్బు, క్రీమ్ తయారీలోనే కాదు ఆహార పదార్థాలలో కూడా ఉపయోగిస్తారు. ఐస్ క్రీం, టోఫీ, చిప్స్ వంటి ప్యాకేజ్డ్ ఫుడ్స్ లో పామాయిల్ ఉంటుంది. ఈ నూనె తినడం వల్ల శరీరానికి ఎన్నో నష్టాలు కలుగుతాయి.
సూపర్ మార్కెట్లలో ప్యాకేజ్డ్ ఫుడ్ అధికంగా ఉంటుంది. ఆ ఫుడ్ ప్యాకెట్ పై ఇన్‌గ్రేడియంట్స్ అనే భాగం ఉంటుంది. అంటే ఆ ఫుడ్ తయారీలో ఏమి ఉపయోగించారు అనేది అక్కడ ఇస్తారు. వాటిలో కచ్చితంగా పామాయిల్ పేరు రాసి ఉంటుంది. అంతే కాదు ఐస్ క్రీం, టోఫీ తయారీలో కూడా పామాయిల్‌ను వాడుతారు. హోటళ్లు, రెస్టారెంట్లలో పామాయిల్‌తో వంట చేస్తుంటారు. నిజానికి ఈ పామాయిల్ మన ఆరోగ్యానికి ఎన్నో నష్టాలు జరుగుతాయి. ఈ విషయం తెలియక ఎంతో మంది ఈ నూనెను వాడేస్తూ ఉంటారు.
అధిక ఉష్ణోగ్రత వద్ద ఈ నూనె వాడడం వల్ల అందులో సంతృప్త కొవ్వు పరిమాణం పెరిగిపోతుంది. ఈ నూనె ధర తక్కువగా ఉంటుంది. కాబట్టి దీన్ని వాడే వారి సంఖ్య ఎక్కువ. ముఖ్యంగా పేదవారు పామాయిల్ ను అధికంగా వినియోగిస్తారు. కొన్ని ప్రోటీన్ బార్ల తయారీలో కూడా తక్కువ మొత్తంలో పామాయిల్‌ను ఉపయోగిస్తారు. ఇవి ఆరోగ్యానికి మేలు కంటే చేసే హానే ఎక్కువ. ప్యాకేజ్డ్ ఫుడ్స్ తింటే మీరు పామాయిల్ తిన్నట్టే లెక్క.
పామాయిల్ అంటే ఏమిటి?
తాటి పండ్ల నుండి తీసిన నూనెను పామాయిల్ అంటారు. ఈ నూనెలో పోషకాల పరిమాణం చాలా తక్కువ, సంతృప్త కొవ్వు చాలా ఎక్కువ. ఈ కారణంగానే ఆరోగ్య నిపుణులందరూ ఈ నూనెను వాడవద్దని సిఫారసు చేస్తున్నారు. నివేదికల ప్రకారం, భారతదేశం అత్యధికంగా పామాయిల్ దిగుమతి చేసుకుంటోంది. మనదేశంలోనే ఎక్కువగా దీన్ని వినియోగిస్తున్నారు. ఆహార పదార్థాలతో పాటు సబ్బు, నూనె, క్రీమ్ వంటి సౌందర్య ఉత్పత్తుల తయారీలో కూడా పామాయిల్ వినియోగిస్తున్నారు.
పామాయిల్‌లో సంతృప్త కొవ్వు అధికంగా ఉంటుంది. బిస్కెట్లు, స్నాక్స్, ఆరోగ్యకరమైన ప్రోటీన్ బార్లను తినేటప్పుడు అందులో పామాయిల్ ఉంటుందనే విషయాన్ని గుర్తు తెచ్చుకోండి. సంతృప్త కొవ్వు శరీరంలో అధికంగా పేరుకుపోవడం ప్రారంభిస్తే, అది హానికరమైన ప్రభావాలను కలిగిస్తుంది.
కొలెస్ట్రాల్ పెంచేస్తుంది
చెడు ఆహారపు అలవాట్ల కారణంగా శరీరంలో సంతృప్త కొవ్వు పరిమాణం వేగంగా పేరుకుపోతుంది. పామాయిల్ తో చేసిన ఆహారాలు తిన్నా కూడా శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగుతుంది. ఇది గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది.
కొన్ని అధ్యయనాల ప్రకారం, పామాయిల్ తినడం వల్ల శరీరంలో ఇన్ ఫ్లమ్మేషన్ వస్తుంది. అలాగే, క్యాన్సర్ ప్రమాదం కూడా పెరుగుతుంది. పామాయిల్ పై చేసిన అధ్యయనాల ప్రకారం పామాయిల్ నేరుగా ఎలాంటి హాని చేయదు కానీ, అందులో ఉండే సంతృప్త కొవ్వు మాత్రం ఎంతో హానికరం. ఈ హానికరమైన కొవ్వు వల్ల హృదయ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది.
తరచూ అధిక మొత్తంలో పామాయిల్ తీసుకోవడం కూడా జీవక్రియను దెబ్బతీస్తుంది. దీనివల్ల జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి.
పామాయిల్ ఎక్కువగా తీసుకుంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ సమస్య వస్తుంది. కాబట్టి డయాబెటిక్ సమస్య ఉన్న వారు పామాయిల్ ను వాడకూడదు.
ఊబకాయం
పామాయిల్ లో 100 శాతం కొవ్వు ఉంటుంది. ఇది లిపిడ్ ప్రొఫైల్ ను మార్చేస్తుంది. దీనివల్ల శరీరంలో ట్రైగ్లిజరైడ్ పెరుగుతాయి. చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. వీటి వల్ల ఊబకాయం, గుండెపోటు, మధుమేహం, కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం వంటి సమస్యలకు కారణమవుతుంది. కాబట్టి పామాయిల్ వాడకం ఎంత తగ్గిస్తే అంత మంచిది.