భారతీయ రైల్వే అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రైలు వందేభారత్. ఇవి ప్రవేశపెట్టిన తర్వాత ఇండియాన్ రైల్వే గేమ్ ఛేంజర్ గా వీటిని అభివర్ణించారు.
ఛార్జీలు చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రయాణికులు నెమ్మదిగా అలవాటుపడిపోతున్నారు. ఛార్జీలు తగ్గించే యోచన లేదని భారతీయ రైల్వే అధికారులు స్పష్టం చేశారు. అత్యంత వేగంగా ప్రయాణిస్తున్నప్పటికీ సాధారణంగా ప్రయాణించే రైళ్లతో పోలిస్తే అరగంట నుంచి గంట వరకే తేడా ఉంటోంది. దీనికోసం వందల రూపాయలు ఖర్చుపెట్టి టికెట్లు కొనుగోలు చేయాలా? అని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నాయి. అయితే కొన్ని మార్గాల్లో మాత్రం వందేభారత్ కు మంచి ఆదరణ దక్కుతోంది.
ఆక్యుపెన్సీ చాలా దారుణంగా ఉంటోంది
ప్రయాణికుల నుంచి డిమాండ్ ఎక్కువగా ఉన్న మార్గాల్లో 20 బోగీలు, 24 బోగీలతో కూడా నడుపుతున్నారు. ఏపీలో విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ కు రెండు, దుర్గ్ కు ఒకటి, భువనేశ్వర్ కు ఒకటి, విజయవాడ నుంచి ఒకటి, కాచిగూడ నుంచి ఒకటి, సికింద్రాబాద్ నుంచి నాగపూర్ కు ఒకటి మొత్తం ఏడు వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. వీటిల్లో విశాఖపట్నం నుంచి చత్తీస్ గడ్ రాష్ట్రంలోని దుర్గ్ పట్టణానికి నడుపుతున్న వందేభారత్ రైళ్లల్లో ప్రయాణికులే ఎక్కడంలేదు. దీంతో ప్రయాణికులు ఈరోజు నుంచి 8 బోగీలతో మాత్రమే నడుపుతున్నారు. ప్రారంభంలో 16 బోగీలతో నడిపారు. ఆక్యుపెన్సీ చాలా దారుణంగా ఉంటోంది. దుర్గ్ నుంచి తిరుగు ప్రయాణంలో రాయగడ వరకు 50 శాతం, విశాఖపట్నంకు 25 శాతమే ఆక్యుపెన్సీ ఉంటోంది.
సలహా ఇచ్చినవారికి భారతరత్న ఇవ్వాలి
నేటి నుంచి 8 బోగీలతో నడుపుతారు. వీటిల్లో ఏడు బోగీలు చైర్ కార్, ఒక బోగీ ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ ఉంటుంది. ఇందులో కేవలం 40 సీట్లే ఉంటాయి. చత్తీస్ గడ్ అంటే కాస్తంత వెనకబడి రాష్ట్రం కిందకు వస్తుంది. అక్కడి నుంచి పొట్ట కూటి కోసం దేశంలోని ప్రధాన నగరాలకు ఎంతోమంది వలస వస్తుంది. ఇటువంటి ప్రాంతానికి భారీ ఛార్జీలతో వందేభారత్ నడిపితే లాభసాటిగా ఉంటుందని అధికారులకు ఎవరైతే సలహా ఇచ్చారో వారికి భారతరత్న అవార్డు ఇవ్వాలని నెటిజన్లు కొందరు కామెంట్లు పెడుతున్నారు. డిమాండ్ అండ్ సప్లై సూత్రాన్ని ఆధారంగా చేసుకొని ప్రయాణికులకు అందుబాటులోకి తెస్తే పర్వాలేదుకానీ డిమాండ్ లేనిచోట నడపడంవల్ల ఉపయోగం ఉండదని, దానికి బదులుగా సాధారణ ఛార్జీలతో ఒక సూపర్ ఫాస్ట్ రైలు నడపాలని కోరుతున్నారు.