వంగవీటి రాధాకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు..

www.mannamweb.com


మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత వంగవీటి రాధా అస్వస్థతకు లోనయ్యారు. గురువారం తెల్లవారుజామున గుండెల్లో స్వల్ప నొప్పితో పాటు పట్టేసినట్లు అనిపించడంతో..

వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను ఓ ప్రవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ టెస్టులు చేసిన డాక్టర్లు.. స్వల్ప గుండెపోటు అని నిర్ధారణకు వచ్చారు.. యాంజియో చేసి స్టెంట్ వేశారు. ప్రస్తుతం ఆయన పరిస్ధితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు. 48 గంటలు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని సూచించారు. రాధా అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. గుండెల్లో నొప్పి స్వల్పంగా రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. రాధా అనారోగ్యంపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆరా తీసినట్లు తెలిసింది.

ఎన్డీఏ ప్రభుత్వంలో రాధాకు కీలక పదవి..?

వంగవీటి రాధాకు ఎన్డీఏ ప్రభుత్వంలో కీలక పదవి దక్కే అవకాశం ఉంది. ఎన్ని రాజకీయ ఒత్తిడిలు ఉన్నా సరే టీడీపీలోనే నిలబడి.. ఎన్నికల్లో చురుకుగా ప్రచారం చేసిన వంగవీటి రాధాకు కీలక పదవి..అంటూ ఇప్పుడూ ప్రచారం జోరు అందుకుంది. దీనికి తోడు ఎన్నికల ప్రచారంలో స్వయంగా చంద్రబాబు సభాముఖంగా ప్రకటించారని కూడా ఆయన అభిమానులు గుర్తు చేస్తున్నారు.

రంగా తనయుడిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రాధాకృష్ణ రాజకీయాల్లో పెద్దగా సక్సెస్‌ సాధించలేకపోయారు. 2004లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన రాధా దానితోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత 2014లో వైసీపీలో చేరినా అక్కడ కూడా పెద్దగా ఫలితం దక్కలేదు. తను కోరిన సీటు ఇవ్వకపోవడంతో.. వైసీపీతో విభేదించి అనూహ్యంగా 2019 ఎన్నికల ముందే టీడీపీలో చేరారు. కానీ ఆ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కలేదు. 2024 ఎన్నికల్లో కూడా అక్కడ సీటు.. ఇక్కడ సీటు అంటూ ప్రచారం జరిగినప్పటికీ పోటీ చేసే అవకాశం మాత్రం దక్కలేదు. అయినా కూటమి తరుఫున ప్రచారంలో చురుగ్గా పాల్గొన్నారు. ఒకానొక దశలో రాధాను పార్టీలోకి లాక్కోవటానికి వైసీపీ తీవ్ర ప్రయత్నాలు చేసినప్పటికీ రాధాకృష్ణ మాత్రం పక్క చూపులు చూడలేదు. టీడీపీ సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నారు. కోస్తాలో కూటమి ఘన విజయంలో వంగవీటి రాధా పాత్ర చాలా ఉన్నది. అందుకే ఆయనకు ఈ ప్రభుత్వంలో కీలక పదవి దక్కే అవకాశముందని చర్చలు జోరందుకున్నాయి. ఆయన వర్గం కూడా ఏదో ఒక పదవి దక్కకపోతుందా అని గంపెడాశలు పెట్టుకుంది.