ఎమ్మెల్సీ రేసులో విజయశాంతి.. ఢిల్లీలో హఠాత్తుగా ప్రత్యక్షమైన రాములమ్మ..

గత కొద్ది రోజులుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి.. మళ్లీ యాక్టివ్ అయినట్లు తెలుస్తోంది. పార్లమెంట్ ఎన్నికల తరువాత అజ్ఞాతంలో ఉన్న విజయశాంతి.. ఒక్క సారిగా ఢిల్లీలో ప్రత్యక్షమయ్యారు. కాంగ్రెస్ పెద్దలను ఆమె కలుస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేను కలిసినట్లు సమాచారం. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ సీటు కోసం ఆమె ప్రయత్నం చేస్తున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. గత కొన్నాళ్లుగా రాములమ్మ సైలెంట్‌గా ఉండడంతో ఆమె పార్టీ మారుతున్నారని ప్రచారం కూడా జరిగింది. మళ్లీ బీజేపీలో చేరే అవకాశం ఉందన రూమర్లు పుట్టించారు. అయితే సడెన్‌గా ఎమ్మెల్సీ ఎన్నికల వేళ విజయశాంతి ఢిల్లీలో ప్రత్యక్షం కావడం.. కాంగ్రెస్ పెద్దలను కలవడం హాట్ టాపిక్‌గా మారింది. సీఎం రేవంత్‌రెడ్డిని కలవకుండానే నేరుగా కాంగ్రెస్‌ హై కమాండ్‌ నేతలతోనే రాములమ్మ భేటీ కావడంపై రాజకీయంగా చర్చ జరుగుతోంది.


లోక్‌సభ ఎన్నికల తరువాత విజయశాంతి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉన్నా.. ఆమె మాత్రం సైలెంట్‌గా ఉంటున్నారు. అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయం చెబుతున్నారే తప్పా.. ఎక్కడా కనిపించలేదు. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా లేరు. ఎన్నికల సమయంలో విజయశాంతి సేవలను వినియోగించుకున్న నేతలు.. ఆ తరువాత పట్టించుకోవడం మానేశారని ప్రచారం కూడా ఉంది. ఈ నేపథ్యంలో విజయశాంతి మళ్లీ బీజేపీ వైపు చూస్తున్నారని రూమర్లు వచ్చాయి. ఆమె పార్టీ మార్పు ప్రచారం జరుగుతున్నా.. కాంగ్రెస్ నేతలు మాత్రం ఒక్కరు కూడా స్పందించలేదు. రాములమ్మ వద్దకు వెళ్లి.. పార్టీలోనే కొనసాగాలని కోరలేదు. దీంతో విజయశాంతి మరింత ఆగ్రహానికి గురైనట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంఛార్జీగా మీనాక్షి నటరాజన్‌ రాకతో పరిస్థితిలో మార్పులు వచ్చినట్లు తెలుస్తోంది. గాంధీభవన్‌లో విజయశాంతి గురించి ఆమె ఆరా తీసినట్లు సమాచారం. ఎన్నికల సమయంలో యాక్టివ్‌గా ఉన్న విజయశాంతి ఇప్పుడు ఎందుకు సైలెంట్‌గా ఉన్నారు..? ఇప్పుడు ఏం చేస్తున్నారు..? వంటి వివరాలు తెలుసుకున్నట్లు చెబుతున్నారు. సీనియర్ నేతల సేవలను పార్టీ సరిగా వినియోగించుకోవడం లేదని ఫీడ్‌బ్యాక్ రావడంతో మీనాక్షి నటరాజన్ కఠిన నిర్ణయాలకు సిద్ధమయ్యారు.

పార్టీ లైన్‌ దాటిన నేతలకు వార్నింగ్ ఇస్తూ తీన్మార్ మల్లన్నపై వేటు వేయగా.. ఇప్పుడు సీనియర్ నేతలకు కీలక బాధ్యతలు అప్పగించి వారి సేవలు పార్టీకి ఉపయోగించుకోవాలని మీనాక్షి నటరాజన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇన్నాళ్లు మౌనంగా ఉన్న రాములమ్మ.. ఢిల్లీలో హైకమాండ్ పెద్దలతో భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. మీనాక్షి నటరాజన్ సపోర్ట్‌తోనే ఆమె ఢిల్లీలో పెద్దలను కలిశారా..? హైకమాండ్ రాములమ్మను ఎమ్మెల్సీ చేయనుందా..? అనే విషయాలు త్వరలో తేలిపోనున్నాయి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.