విజయవాడ దుర్గమ్మకు కళ్లు చెదిరే ఆదాయం.. 18 రోజులకు ఎన్ని కోట్లు వచ్చాయంటే!

www.mannamweb.com


విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గామల్లేశ్వర స్వామివారికి మరోసారి కాసుల వర్షం కురిసింది. దుర్గమ్మ ఆలయంలో హుండీలలో భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా.. భారీగా ఆదాయం సమకూరింది. 18 రోజులకు సంబంధించిన కానుకల్ని లెక్కించగా.. నగదు రూపంలో రూ.2,76,66,261 ఆదాయం వచ్చింది. అంటే సగటున రోజుకు ఆదాయం చూస్తే.. రూ.15,37,014గా ఉంది. అమ్మవారికి కానుకల రూపంలో హుండీలలో 523 గ్రాముల బంగారం, 7 కిలోల 30 గ్రాముల వెండి కూడా ఉంది.

యూఎస్‌ఏ డాలర్లు 327, ఖతార్ రియాల్స్‌ 98, ఆస్ట్రేలియా డాలర్లు 35, యూరోలు 25, సింగపూర్‌ డాలర్లు 10, ఇంగ్లాండ్‌ పౌండ్లు 10, కెనడా డాలర్లు 5, సౌదీ రియాల్స్‌ 5, కువైట్‌ దినార్లు 2, మలేషియా రింగ్గిట్స్‌ 1 ఉన్నాయి. ఈ హుండీ ద్వారా భక్తులు సమర్పించిన కానుకలు రూ.61,260లుగా ఉంది. దుర్గామల్లేశ్వర దేవస్థానంలో ప్రతిరోజూ సాయంత్రం నిర్వహించే పంచహారతుల అనంతరం వేదస్వస్తి.. పురాణ పఠనం కొనసాగనుంది. గురువారం తెలుగుభాషా దినోత్సవం సందర్భంగా గురువారం తొలిసారిగా పురాణపఠనంలో తెలుగుపద్యాలను వినిపించారు.

దుర్గమ్మ ఆలయంలో ఇకపై ప్రతిరోజూ పురాణపఠనం అనంతరం తెలుగు నన్నయ్య భారతం, పోతన భాగవతం నుంచి భక్తిరస పూరిత తెలుగుపద్యాలను వినిపించాలని నిర్ణయం తీసుకున్నారు. సాహిత్య విలువలు ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో, ముఖ్యంగా కృష్ణా, గోదావరి ప్రాంతాల్లో మంచి సాహిత్యం వెల్లివిరిసిందని భక్తులు అంటున్నారు తెలుగు సాహిత్య గొప్పతనాన్ని భక్తిరసాన్ని అమ్మవారికి వినిపిస్తే తెలుగుభాషా పరిపృష్టమవుతుందంటున్నారు. ఈ క్రమంలో పంచహారతుల సేవలో తెలుగు పద్యాల పఠన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో కేఎస్‌ రామారావు చెప్పారు.

మరోవైపు ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జసిస్టస్‌ శ్రీసుధ దంపతులు దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు వారికి ఆలయ మర్యాదలు కల్పించారు. దర్శనం అనంతరం అమ్మవారి దర్శనానంతరం ప్రసాదం, శేషవస్త్రం, ఆశీస్సులు, అమ్మవారి చిత్రపటం అందజేశారు. ఇటు విజయవాడ విద్యాధరపురానికి చెందిన ఏ శ్రీనివాసరావు అనే భక్తుడు ఏ దినేష్‌ పేరిట అన్న వితరణకు రూ.1,00,000లు చెక్కు రూపంలో విరాళంగా అందజేశారు.