ప్రక్షాళన దిశగా గ్రామ, వార్డు సచివాలయ శాఖ – ఇతర శాఖల్లోకి మార్పు..!!

www.mannamweb.com


కీలకశాఖల్లోకి ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లు, ఎమినిటీస్‌ సెక్రటరీలు – కసరత్తు చేస్తున్న ప్రభుత్వం

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :గ్రామ వార్డు సచివాలయాల శాఖను ప్రక్షాళన చేసే ఆలోచనలో ప్రభుత్వం కసరత్తును ప్రారంభించింది.

ఇందులో భాగంగా సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లు, పట్టణ ప్రాంతాల్లో పనిచేసే వార్డు ఎమినిటీస్‌ సెక్రటరీలను ( మౌళిక వసతుల కల్పన కార్యదర్శి) ఇతర శాఖల్లోకి మార్చాలని యోచిస్తోంది. ఈ రెండు విభాగాల్లో సుమారు 14,500 మంది ఉన్నారు. వీరిని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గృహ నిర్మాణ, ఆర్‌అండ్‌బి, ఆర్‌డబ్లుఎస్‌ శాఖలకు బదిలీ చేసి, ఆయా శాఖల్లో సిబ్బంది కొరతను అధిగమించాలని కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది.
అభివృద్ధి కార్యాక్రమాలకు సంబంధించిన ప్రతిపాదనలు, వాటి అమలులో అమినిటీస్‌ సెక్రటరీలు, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్ల పాత్ర చాలా ప్రధానమైనది. ప్రత్యేకించి నిర్మాణ రంగానికి సంబంధించి గృహాల నిర్మాణ ప్రణాళికకు ఆమోదం మొదలుకొని నిర్మాణాల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా చూడాల్సిన బాధ్యత కూడా వీరిదే. అలాగే మంచినీటి పైపులైన్లు, రహదారులు, కాల్వల పనుల పర్యవేక్షణ, అనుమతుల మంజూరు వంటి పనులు కూడా వీరి చేయాల్సివుంది. ప్రస్తుతం గృహ నిర్మాణ శాఖలో తగిన సంఖ్యలో ఖాళీలు భర్తీ చేయకపోవడంతో పనులు నత్తనడకనసాగుతున్నాయనే విమర్శ ఉంది. గృహ నిర్మాణ శాఖ ప్రధాన కార్యాలయంలో కీలకమైన మూడు డిజిఎం , రెండు జనరల్‌ మేనేజర్లు, ఒక ఇడి పోస్టు ఖాళీగా ఉంది. జిల్లాల విషయంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గృహ నిర్మాణం, ఆర్‌అండ్‌బి, ఆర్‌డబ్ల్యుఎస్‌ శాఖల్లో ఉన్న ఖాళీలకు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులతో భర్తీ చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు సమాచారం.