వినాయక చవితి పూజకు కావాల్సిన సామాన్ల జాబితా ఇదిగో, ముందుగానే ఇవన్నీ కొనుక్కోండి

www.mannamweb.com


వినాయక చవితి వచ్చిందంటే పూజకు ఎన్నో వస్తువులు అవసరం పడతాయి. అవన్నీ ముందు రోజే కొనుక్కొని పెట్టుకోవాలి. వినాయక చవితి పూజకు కావాల్సిన సామాగ్రి జాబితా ఇక్కడ ఇచ్చాము.

హిందువుల్లో ఘనంగా, వేడుకగా నిర్వహించుకునే పండుగల్లో వినాయక చవితి ఒకటి. ఇది వస్తుందంటే వీధి వీధి వినాయక మండపాలతో నిండిపోతుంది. గ్రామాలు, పట్టణాలు గణపతి బప్పా మోరియా అని మారుమోగిపోతాయి. వినాయక చవితికి పూజకు ముందుగానే చాలా సామాన్లు కొనాల్సి ఉంటుంది. ఒక్కోసారి కొన్ని మర్చిపోతూ ఉంటాము. అలాంటి సమస్య లేకుండా ఇక్కడ అన్ని కావాల్సిన పూజకు కావలసిన అన్ని సామాగ్రి జాబితా ఇచ్చాము.

వినాయక చవితి పూజా సామాగ్రి

పసుపు, కుంకుమ, పూలు, పూలదండలు, తమలపాకులు, వక్కలు, కర్పూరం, అగరబత్తులు, గంధం, అక్షింతలు, అరటిపండ్లు, కొబ్బరికాయ, బెల్లం, తోరము, దీపారాధన కుందులు, నెయ్యి, వత్తులు, వినాయకుడి ప్రతిమ, పంచామృతం, పత్రి, ఉండ్రాళ్ళు, మూడు లేదా ఐదు రకాల నైవేద్యాలు.
ఏ పత్రి?

వీటితోపాటు పత్రిగా పిలుచుకునే 21 రకాల ఆకులు కూడా ఉండాలి. చాలా చోట్ల ఇప్పుడు ఈ 21 రకాల ఆకులు దొరకడం లేదు కొన్నింటిని మాత్రమే పెట్టి పూజిస్తున్నారు. వీలైతే మీరు ఈ 21 రకాల ఆకులను సేకరించండి. అవేంటంటే మాచీ పత్రం, బృహతీ పత్రం (ములక), బిల్వపత్రం అంటే మారేడు ఆకు, దూర్వా పత్రం అంటే గరిక, దుత్తూర పత్రం అంటే ఉమ్మెత్త ఆకు, బదరీ పత్రం అంటే రేగు ఆకులు, అపామార్గ పత్రం అంటే ఉత్తరేణి ఆకులు, తులసి పత్రం, మామిడి ఆకులు, గన్నేరు ఆకులు, విష్ణుక్రాంత ఆకులు, దానిమ్మ ఆకులు, దేవదారు ఆకులు, మరువం, సింధువార పత్రం అంటే వావిలి పత్రం, సన్నజాజి ఆకులు, లతా దుర్వా అని పిలిచే గండలీ పత్రం, శమీపత్రం, రావి ఆకులు, మద్ది చెట్టు ఆకులు, జిల్లేడు ఆకులు.

పూజను వినాయక ప్రార్థనతోనే మొదలుపెట్టాలి

శుక్లాంబరధరం విష్ణుం

శశివర్ణం చతుర్భుజం

ప్రసన్న వదనం ధ్యాయే

సర్వ విఘ్నోప శాంతయే
వినాయక చవితి రోజు ఇలా చేయండి

వినాయక చవితి ఉదయం లేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. మామిడి ఆకులతో తోరణాలు కట్టుకోవాలి. వాకిళ్ళ ముందు ముగ్గులు వేయాలి. ఆ రోజు అందరూ తలంటు స్నానాలు చేయాలి. దేవుని గదిలో లేదా ఒక పరిశుభ్రమైన ప్రదేశంలో ఒక పీట వేసి దానిపైన వినాయక విగ్రహాన్ని ఉంచాలి.

వినాయకుడికి ఎంతో ఇష్టమైనవి ఉండ్రాళ్లు. ఏ నైవేద్యం పెట్టినా పెట్టకపోయినా కచ్చితంగా ఉండ్రాళ్లను పెట్టాలి. బొబ్బట్లు కూడా పెడితే మంచిది, మూడు లేదా ఐదు రకాల నైవేద్యాలను తయారుచేసి స్వామివారికి నివేదించాలి.

వేదాల ప్రకారం భాద్రపద మాసంలోని శుక్లపక్షం చతుర్ధి తిథినాడు మధ్యాహ్నం 3.01 నిమిషాలకు చవితి ప్రారంభమవుతుంది. మరుసటి రోజు సాయంత్రం 5:37 వరకు కొనసాగుతుంది. కాబట్టి ఉదయం పూట ఈ తిధి సెప్టెంబర్ 7న వస్తుంది, కాబట్టి ఆ రోజే వినాయక చవితిని నిర్వహించుకోవాలి.