వైరల్‌ ఫీవర్‌ కారణాలు, లక్షణాలు, చికిత్స, నివారణ.. పూర్తి వివరాలు

www.mannamweb.com


వర్షాకాలం వచ్చిందంటే రోగాలు విజృంభిస్తాయి. మరీ ముఖ్యంగా వైరల్‌ ఫీవర్లు పెరుగుతాయి. ప్రస్తుతం నగరంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎక్కువగా ఇవే కేసులు కనిపిస్తున్నాయి. ఇక తాజాగా వైరల్ ఫీవర్లతో రాష్ట్రంలో వేర్వేరు చోట్ల ఒకే రోజు ఆరుగురు మృతి చెందడం సంచలనంగా మారింది. వైరల్‌ ఫీవర్‌ బారిన పడితే.. సరైన సమయంలో స్పందించి వెంటనే చికిత్స తీసుకోకపోతే.. ప్రాణాలు పోతాయి అనే దానికి నిదర్శనం పై కేసులు. మరి రాష్ట్రంలో వైరల్‌ ఫీవర్లు పెరుగుతున్న తరుణంలో.. అసలు ఇది ఎందుకు వస్తుంది.. ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి.. ఎన్ని రోజులు ఉంటుంది.. చికిత్స విధానం ఏంటి.. మందులు ఏం వాడాలి.. నివారణ చర్యలు వంటి పూర్తి సమాచారం మీ కోసం.

వైరల్‌ ఫీవర్‌ అంటే ఏంటి..

వివిధ రకాల వైరల్ ఇన్ఫెక్షన్ల వలన కలిగే జ్వరానికి ఉపయోగించే పదమే వైరల్‌ ఫీవర్‌. సాధారరణంగా మానవ శరీర ఉష్ణోగ్రత సుమారు 98.4°ఎఫ్‌, లేదా 37.1°సీగా ఉంటుంది. ఈ సగటు విలువకు మించిన ఉష్ణోగ్రత ఉంటే దాన్ని జ్వరంగా పరిగణిస్తారు. అయితే వైరల్ ఫీవర్ కొన్ని ఇన్ఫెక్షన్లలో తక్కువ ఉష్ణోగ్రత అంటే 100 డిగ్రీల లోపే ఉండవచ్చు. డెంగ్యూ వంటి కేసుల్లో ఎక్కువగా ఉంటుంది.
వైరల్ ఫీవర్ రకాలు:

వైరల్ ఫీవర్ వ్యాప్తి చెందే విధానం తీవ్రత, శరీరంలోని అవయవాలపై చూపే ప్రభావం మొదలైన వాటి ఆధారంగా వీటిని పలు రకాలుగా వర్గీకరిస్తారు. అలా వైరల్‌ ఫీవర్లు ఎన్ని రకాలంటే..

రెస్పిరేటరీ వైరల్‌ ఫీవర్‌: ఈ వైరల్ ఇన్ఫెక్షన్ దగ్గు, జలుబు, గొంతునొప్పి, జ్వరం, ఒళ్లు నొప్పులు వంటి ఫ్లూ వంటి లక్షణాలతో ముడిపడి ఉంటుంది. సాధారణ జలుబు, అడెనోవైరస్, రెస్పిరేటరీ సింకైటియల్ వైరస్ ఇన్ఫెక్షన్, సార్స్ వైరస్, కోవిడ్ -19 వైరస్, పారాఇన్ఫ్లూయెంజా వైరస్ ఇన్ఫెక్షన్ వంటివి ఈ తరహా వైరల్‌ ఫీవర్‌కు ఉదాహరణలు.
గ్యాస్ట్రోఇన్‌టెస్టినల్‌ (జీర్ణశయాంతర) వైరల్‌ ఫీవర్‌: దీనిలో ఎక్కువగా విరేచనాలు, పొత్తికడుపు నొప్పి, వాంతులు వంటి జీర్ణశయాంతర సమస్యలు ఉంటే అవి జీర్ణశయాంత వైరల్‌ ఇన్ఫెక్షన్లుగా భావించవచ్చు.
చర్మ సంబంధిత వైరల్‌ ఫీవర్లు: ఈ వైరల్ ఇన్ఫెక్షన్ చర్మంపై దద్దుర్లు తో ముడిపడి ఉంటుంది. మీజిల్స్, చికెన్ పాక్స్, చికున్ గున్యా, రుబెల్లా, మశూచి మొదలైనవి దీనికి ఉదాహరణలు.
హెమోరాజిక్‌ వైరల్‌ ఫీవర్‌: ఈ వైరల్ ఇన్ఫెక్షన్లు.. ప్రసరణ వ్యవస్థ దెబ్బతినడం వల్ల వస్తాయి. ఉదాహరణకు డెంగ్యూ జ్వరం, ఎబోలా, లాస్సా జ్వరం, ఎల్లో ఫీవర్‌ మొదలైనవి.
న్యూరోలాజికల్‌ వైరల్‌ ఫీవర్‌: ఈ వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది. రేబిస్, పోలియో, వైరల్ ఎన్ కెఫలైటిస్, వైరల్ మెనింజైటిస్ ఉన్నాయి.

వైరల్ ఫీవర్ సాధారణంగా తీవ్రమైనది. సీజన్లు మారిన తరుణంలో ఎక్కువగా వస్తుంటుంది. అయితే వర్షాకాలంలోనే అధిక కేసులు నమోదవుతాయి. చాలా వైరల్ ఇన్ఫెక్షన్లు, వైరల్ ఫీవర్లు 3-5 రోజులు ఉంటాయి. అయితే, కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్లలో సుమారు 14 రోజుల వరకు జ్వరం వస్తూనే ఉంటుంది.
బాధితులు ఎవరంటే..

చిన్న పిల్లలు, వృద్ధులు బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్న వ్యక్తులలో వైరల్‌ ఫీవర్‌ సర్వసాధారణం.
ఆస్పత్రికి ఎప్పుడు వెళ్లాలంటే..

ఒక్క రోజుకు మించి జ్వరంతో బాధపడుతుంటే.. వెంటనే వైద్యులను సంప్రదించాలి.
వైరల్ ఫీవర్ లక్షణాలు (Viral Fever Symptoms):

వైరల్ ఫీవర్‌ లక్షణాలు వైరల్ ఇన్‌ఫెక్షన్‌ రకాన్ని బట్టి.. అలానే వ్యక్తికి వ్యక్తికి మారుతుంటాయి. అయితే వైరల్ ఇన్ఫెక్షన్లలో ఎక్కువ భాగానికి సంబంధించిన సాధారణ వైరల్ ఫీవర్ లక్షణాలు ఇలా ఉంటాయి.

విపరీతైమన జ్వరం (103-104°ఎఫ్‌ వరకు వెళ్లవచ్చు)
తలనొప్పి (తేలికపాటి నుంచి తీవ్రమైన)
గొంతు నొప్పి
ముక్కు కారడం
కండరాల నొప్పి, కీళ్ల నొప్పి, డీహైడ్రేషన్‌
పొత్తికడుపు నొప్పి, వికారం/వాంతులు
అలసట
కళ్లు తిరగడం, కళ్లు ఎర్రబారడం
చలి, ముఖ వాపు
చర్మంపై దద్దుర్లు
ఆకలి లేకపోవడం

కారణాలు..

కలుషితమైన నీరు కూడా వైరల్ జ్వరానికి కారణం .
కీటకాలు (దోమలు, ఈగలు) మరియు ఎలుకలు కాటు వల్ల ఈ జంతువులు/కీటకాల నుంచి వైరల్ జ్వరాన్ని కలిగించే వైరస్‌ మానవులకు వ్యాప్తి చెందుతుంది.
డెంగ్యూ, ఎల్లో ఫీవర్, జికా,మరియు చికున్ గున్యా అనేవి జంతువులు/కీటకాల ద్వారా వ్యాప్తిచెందే వైరల్ ఇన్ఫెక్షన్లు.
రక్త మార్పిడి సమయంలో అలానే డ్రగ్స్‌ వాడే వ్యక్తి నుంచి తీసుకున్న రక్తం.. ఎక్కించడం ద్వారా కూడా సంక్రమించే అవకాశం ఉంది.

ఇతరులకు వ్యాపిస్తుందా..?

వైరల్ జ్వరం ఉన్న వ్యక్తితో సన్నిహితంగా ఉండటం ద్వారా ఇతరులకు వ్యాపిస్తుంది.
వైరల్‌ ఫీవర్‌ సోకిన వ్యక్తితో ఆహారం, నీరు వంటి పదార్థాలను పంచుకోవడం కూడా వ్యాప్తి చేస్తుంది.
అంతేకాక వైరల్‌ ఫీవర్‌ వారు వాడిన వస్త్రాలు, దుప్పట్లను.. తాకిన, వాడిన వారికి కూడా వచ్చే అవకాశం ఉంది.

ఎలా నిర్ధారిస్తారంటే..

మాములు జ్వరం, వైరల్‌ ఫీవర్ల మధ్య చాలా చిన్న తేడానే ఉంటుంది. అందుకే వీటిని గుర్తించడం తేలిక కాదు. ఇక వైరల్‌ ఫీవర్‌ను గుర్తించడానికి రక్త పరీక్షలు, మూత్ర పరీక్షలు, కఫ పరీక్షలు, స్వాబ్ పరీక్షలు, నిర్దిష్ట వైరల్ యాంటీజెన్లు, యాంటీబాడీ పరీక్షలు వంటి రోగనిర్ధారణ పరీక్షలను చేయించమంటారు. వైరల్ ఫీవర్‌ను ధ్రువీకరించడం కోసం మీ వైట్ బ్లడ్ కౌంట్ (డబ్ల్యూబీసీ) లను టెస్ట్ చేయించమని చెబుతారు. తీవ్రమైన జ్వరం ఉన్న సందర్భాల్లో సీటీ స్కాన్‌, చెస్ట్‌ ఎక్స్‌ రే కూడా చేయించుకోవాలని చెబుతారు.
చిన్న పిల్లల్లో వైరల్ ఫీవర్ లక్షణాలు..

చిన్న పిల్లల్లో ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అయినప్పుడు కచ్చితంగా అలర్ట్ అవ్వాలి. ముఖ్యంగా 102 డిగ్రీలకు మించి జ్వరం చూపిస్తుంటే వైద్యులను సంప్రదించాలి. వైరల్ ఫీవర్ సోకితే పిల్లలకు కూడా ఒళ్లునొప్పులు వస్తాయి. అలాగే చాలా నీరసం పడిపోతారు. బాగా వీక్ అవుతారు. ఆకలి తగ్గిపోవడం, ఆహారం తీసుకోలేకపోవడం జరుగుతుంది. వైరల్ ఫీవర్ వల్ల పిల్లల్లో గొంతునొప్పు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ముక్కు కారడం, దగ్గు కూడా పిల్లల్లో వైరల్ ఫీవర్ ని సూచిస్తాయి. కొన్నిసార్లు వైరల్ ఫీవర్ వల్ల పిల్లల్లో దద్దుర్లు, చర్మ సంబంధిత అలర్జీలు రావచ్చు. కొన్నిసార్లు పిల్లలు వాంతులు చేసుకోవడం కూడా చేస్తుంటారు. జ్వరంతో పాటుగా ఇలాంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది.

చికిత్స..

వైరల్ ఫీవర్ చికిత్స అనేది వైరల్ ఇన్ఫెక్షన్‌ రకం, లక్షణాల తీవ్రతపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా, వైద్యులు తక్కువ-గ్రేడ్ వైరల్ జ్వరానికి పారాసిటమాల్‌, ఇబుప్రోఫెన్ వంటి మందులను సూచిస్తారు. అలానే గోరువెచ్చని నీటితో స్నానం చేయటం, ఎలక్ట్రోలైట్ ద్రావణాన్ని తాగమని చెబుతారు

జ్వరం ఎక్కువగా ఉంటే.. పారాసిటమాల్‌ హై డోసేజ్‌ రిఫర్‌ చేస్తారు. దీన్ని ప్రతి ప్రతి 4-6 గంటలకు తీసుకోవాలని సూచిస్తారు. కొన్ని సందర్భాల్లో పారాసిటమాల్‌ను ఇంట్రావీనస్‌గా ఇంజెక్ట్ చేయవచ్చు. తీవ్రంగా ఉంటే యాంటీబయోటిక్స్‌ను కూడా వాడమని చెబుతారు.
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..

వైరల్‌ ఫీవర్‌ బారిన పడకుండా ఉండాలంటే.. వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం అన్నింటి కన్నా ముఖ్యం.
తరచుగా చేతులను శుభ్రం చేసుకోవాలి.
ముఖం, ముక్కును తాకకుండా ఉండాలి. తాకితే హ్యాండ్‌ వాష్‌తో చేతులు శుభ్రం చేసుకోవాలి.
మీ దుస్తులు, ఆహారపానీయాలను ఇతరులతో పంచుకోకూడదు.
వేడి వేడిగా వండిన పోషకాహారాన్ని తీసుకోవాలి. రోగ నిరోధక శక్తి పెంచే ఆహారాన్ని తీసుకోవాలి.
కాచి చల్లార్చిన నీటినే తాగాలి.
ఫ్లూ టీకాను వేయించుకోవాలి.
దోమ తెరలు ఉపయోగించాలి.
పండ్ల రసాలు, కూరగాయల జ్యూస్‌ తాగాలి.
నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి.