59 దేశాలకు వీసా-ఫ్రీ ఎంట్రీ.. మెరుగుపడిన భారత్ పాస్‌పోర్టు

శక్తిమంతమైన పాస్‌పోర్టుల జాబితాలో భారత్‌ గతేడాదితో పోలిస్తే మరింత మెరుగుపడింది. నిరుడు 80 స్థానంలో ఉండగా ప్రస్తుతం 77వ స్థానానికి చేరుకుంది.


అయితే, వీసా రహిత ప్రయాణాలను అనుమతించే దేశాల సంఖ్య మాత్రం 59కి పరిమితమైంది. గతంలో ఇది 62 దేశాలుగా ఉన్న విషయం తెలిసిందే. గతేడాది ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ, జపాన్‌, సింగపూర్‌, స్పెయిన్‌ సంయుక్తంగా అగ్రస్థానంలో నిలవగా.. ఈసారి ఒక్క దేశం మాత్రమే తొలి స్థానంలో నిలిచింది.

తొలి స్థానంలో సింగపూర్‌..

వీసా రహిత ప్రయాణాలను అనుమతించే దేశాల సంఖ్య ఆధారంగా పాస్‌పోర్టు శక్తిని లెక్కిస్తారు. ఇందుకు సంబంధించి హెన్లీ పాస్‌పోర్టు సూచీ -2025 విడుదలైంది. ఇందులో సింగపూర్‌ తొలిస్థానంలో నిలిచింది. ఈ పాస్‌పోర్టుతో 193 దేశాలకు వీసా-ఫ్రీ ప్రయాణానికి అవకాశం ఉంటుంది. రెండో స్థానంలో ఉన్న జపాన్‌, దక్షిణకొరియాల పాస్‌పోర్టుతో 190 దేశాలు చుట్టిరావచ్చు. డెన్మార్క్‌, ఫిన్లాండ్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, ఐర్లాండ్‌, ఇటలీ, స్పెయిన్‌లు మూడో స్థానంలో ఉన్నాయి.

ఈ జాబితాలో 77వ స్థానంలో ఉన్న భారత్‌ పాస్‌పోర్టుతో 59 దేశాలు వీసా లేకుండా ప్రయాణించవచ్చు. మలేసియా, ఇండోనేసియా, మాల్దీవులు, థాయ్‌లాండ్‌ వంటి దేశాలు వీసారహిత ప్రయాణాలకు అనుమతిస్తున్నాయి. శ్రీలంక, మకావు, మయన్మార్‌ తదితర దేశాలు మాత్రం అక్కడి దిగిన తర్వాత వీసాలు (Visa on Arrival) మంజూరు చేస్తున్నాయి. ఈ జాబితాలో అఫ్గానిస్థాన్‌ చివరి స్థానంలో ఉంది. ఇక్కడి పాస్‌పోర్టుతో కేవలం 25 దేశాలకు మాత్రమే వీసా ఫ్రీ ఎంట్రీ ఉంటుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.