ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంతో కేంద్రంలో ఉన్న ఎన్డీయే సర్కార్ కూడా అన్ని విధాలా సహకరించేందుకు సిద్దమవుతోంది. గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో విశాఖలో స్టీల్ ప్లాంట్ (రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ) ను వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ పథకంలో భాగంగా ప్రైవేటీకరించేందుకు దూకుడుగా అడుగులు వేసిన కేంద్రం..
ఇప్పుడు రాష్ట్రంలో తమ ప్రభుత్వమే అధికారంలో ఉండటంతో ఆచితూచి స్పందిస్తోంది. ఇదే క్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇప్పట్లో లేదని కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ డాక్యుమెంట్లు ప్రస్తుతానికి పెండింగ్ లో ఉన్నాయని, దీనిపై ప్రస్తుతం ఎలాంటి కదలిక లేదని ఆయన వెల్లడించారు. బొగ్గు శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన.. ఈ సందర్భంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ ఈ విషయం తెలిపారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఏపీ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలని కేంద్రం ఆలోచన చేస్తున్నా దాన్ని కొనే స్దాయిలో సంస్థలు లేవని కిషన్ రెడ్డి వెల్లడించారు. దీంతో విశాఖ ఉక్కు కర్మాగారం యథావిథిగా నిర్వహణకు కేంద్రం సాయం చేయబోతోందని కూడా ఆయన తెలిపారు. తద్వారా ఈ ప్రతిష్టాత్మక కర్మాగారం నిలబెట్టేందుకు తాము ప్రయత్నిస్తామని చెప్పకనే చెప్పారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు మైన్స్ కేటాయింపు డిమాండ్ ఎప్పటి నుంచో ఉందని, ఉక్కు శాఖతో మాట్లాడి త్వరలో దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటామని కిషన్ రెడ్డి వెల్లడించారు. అసలు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా వేలంలో పాల్గొని గనులు దక్కించుకోవచ్చని సలహా ఇచ్చారు.