Amaravati : ‘వీఆర్‌ఎస్‌’ కూడా వివాదమే! ధోరణి మారని ప్రవీణ్‌ ప్రకాశ్‌

www.mannamweb.com


ప్రవీణ్‌ ప్రకాశ్‌.. ఈ పేరు వివాదాలకు కేంద్రం. ఐఏఎస్‌ అయిన నాటి నుంచి ఇప్పటి వరకు ఆయన వివాదం లేకుండా పూర్తిచేసిన పోస్టింగ్‌ ఒక్కటీ లేదు. ఆ వ్యవహార శైలే ఇప్పుడు ఆయన సర్వీసును ముంచింది. ఏడేళ్ల సర్వీసు ఉండగానే ఐఏఎస్‌ ఉద్యోగానికి వలంటరీ రిటైర్మెంట్‌(వీఆర్‌ఎస్‌) కోరుతూ ఆయన దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఈ విషయంలోనూ వివాదానికే తెరదీశారు. సీనియర్‌ అధికారి అయి ఉండి ‘పద్ధతి’ లేకుండా వ్యవహరించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపట్ల అగౌరవంగా వ్యవహరించారు. నిజానికి ఎవరైనా వీఆర్‌ఎ్‌సకు దరఖాస్తు చేసుకోవాలని అనుకుంటే.. ఆయా విభాగాల ఉన్నతాధికారులను కలిసి దరఖాస్తు సమర్పిస్తారు. అలా చూస్తే.. ప్రవీణ్‌ ప్రకాశ్‌..

తనకు బాస్‌ అయిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ను కలిసి వీఆర్‌ఎస్‌ దరఖాస్తును ఆయనకు అందించాలి.

ఎందుకు వీఆర్‌ఎ్‌సకు దరఖాస్తు చేస్తున్నదీ వివరించాలి. కానీ, ఈ పద్ధతిని ప్రవీణ్‌ ప్రకాశ్‌ తుంగలో తొక్కారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫోన్‌లో మెసేజ్‌ పెట్టి, వీఆర్‌ఎస్‌ దరఖాస్తును తపాలా పెట్టెలో వేసి వెళ్లిపోయారు. అది కూడా కేవలం తెల్లకాగితంపై రాసి ఇవ్వడం గమనార్హం. దీనినే దరఖాస్తుగా భావించాలని కోరారు. అది చూసి అవాక్కయిన జీఏడీ అధికారులు నిబంధనల ప్రకారం సరైన ఫార్మాట్‌లో పంపాలని సదరు కాగితాన్ని తిప్పికొట్టారు. దీంతో దిగివచ్చిన ప్రవీణ్‌ ప్రకాశ్‌ తగిన ఫార్మాట్‌లో వీఆర్‌ఎ్‌సకు దరఖాస్తు చేసుకున్నారు. కానీ, సంతకం చేయాల్సిన చోట డిజిటల్‌ సిగ్నేచర్‌ను కాపీ పేస్ట్‌ చేసి సరిపుచ్చారు. అది చెల్లుబాటు అవుతుందా? అనేది ప్రశ్నార్థకమైంది.

ఆది నుంచి అంతే!

ఉద్యోగంలో చేరినప్పటి నుంచీ ప్రవీణ్‌ ప్రకాశ్‌ వివాదాలతో ప్రయాణించిన అధికారిగా గుర్తింపు పొందారు. విజయవాడ, గుంటూరు మున్సిపల్‌ కమిషనర్‌గా చేసినప్పుడు, అంతకముందు కూడా ఏదో ఒక విషయంలో రాద్ధాంతం సృష్టించేవారు. ఆ తర్వాత విశాఖపట్నం కలెక్టర్‌గా ఏకంగా ఈసీ ఆదేశాలను బేఖాతరు చేసి ఎన్నికల సంఘం ఆగ్రహానికి గురయ్యారు. జగన్‌ అధికారంలోకి వచ్చాక ప్రవీణ్‌ను ఏరికోరి తెచ్చుకుని సీఎం పేషీలో పెట్టుకున్నారు.

ఆ సమయంలో ఏకంగా సీఎ్‌సపైనే పెత్తనం చేసే స్థాయిలో దురహంకారం ప్రదర్శించి నిత్యం వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. ఒకానొక దశలో జగన్‌ కంటే ప్రవీణ్‌ ప్రకాశే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారేమోనన్న స్థాయిలో అధికారం చెలాయించారు. తానొక సుప్రీం అన్నట్టుగా, మిగిలిన ఉద్యోగులు బానిసలు అన్నట్టుగా వ్యవహరించారు. ఈ వ్యవహారశైలితో జగన్‌ ప్రభుత్వం కూడా భయపడి ఆయన్ను సీఎం పేషీ నుంచి తప్పించి మళ్లీ ఏపీ భవన్‌కు పంపింది. దీన్ని ముందుగానే పసిగట్టిన ప్రవీణ్‌ తాను ఉద్యోగం మానేసి వారణాసి నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్నట్లు మీడియాకు లీకులు ఇచ్చారు. కొంతకాలం తర్వాత మళ్లీ జగన్‌ను కాకాపట్టి రాష్ర్టానికి తిరిగొచ్చారు.

ఉపాధ్యాయులకు వేధింపులకు

జగన్‌ హయాంలో పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా నియమితులై ప్రవీణ్‌ ప్రకాశ్‌.. టీచర్లకు చుక్కలు చూపించారు. దీంతో ఆయన ఏ రోజు ఏ జిల్లాకు వస్తారోనని టీచర్లు బెంబేలెత్తిపోయేవారు. ”అసలు టీచర్లకు జీతాలు ఇవ్వడమే దండగ” అని పలు సందర్భాల్లో వ్యాఖ్యానించడం పెద్ద వివాదాన్ని రేపింది. అతంటితో కూడా ఆగకుండా రాత్రి వేళల్లో విద్యార్థుల ఇళ్లకు వెళ్లి వారి నోట్‌ పుస్తకాలు పరిశీలించడం, ఎవరైనా విద్యార్థి సరిగా రాయకపోతే సంబంధిత టీచర్‌ను చెడామడా తిట్టడం లాంటివి కూడా ఆయనను విమర్శలపాల్జేశాయి. దీంతో ఆయన బాధ భరించలేకపొయిన ఉపాధ్యాయులు ”తక్షణం ప్రవీణ్‌ను బదిలీ చేయండి” అంటూ ప్రభుత్వాన్ని వేడుకునే పరిస్థితి వచ్చింది.