ఆరోగ్యానికి వరం నడక.. రోజూ అరగంట నడిస్తే చాలు.. ఎన్ని ఆరోగ్యప్రయోజనాలో తెలుసా

www.mannamweb.com


మారిన జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లు మనిషి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. చిన్నవయసులోనే అనేక తీవ్రమైన వ్యాధుల బారిన పడుతున్నారు. అందులో గుండె సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి.

కడుపునొప్పి, ఫ్యాటీ లివర్, యూరిక్ యాసిడ్ పెరగడం, అధిక కొలెస్ట్రాల్ సమస్యలు ఈ రోజుల్లో సర్వ సాధారణంగా మారాయి. కోవిడ్ తర్వాత పెద్దవాళ్లే కాదు పిల్లలు కూడా శారీరక శ్రమ అంటే యోగ, వ్యాయామం చేయడం అలవాటైంది. అయితే కొంతమందికి శరీరాన్ని చురుకుగా ఉంచుకోవడం చాలా ఖర్చుతో కూడుకున్నది. అందుకే హెవీ వర్కవుట్, రన్నింగ్, ఎక్సర్ సైజ్ చేయలేకపోతే కచ్చితంగా కొన్ని నిమిషాలు నడవండి అని నిపుణులు చెబుతున్నారు. అందుకోసం మనిషి కనీసం 30 నిమిషాల పాటు నడవాలని కూడా పరిశోధనలో వెల్లడైంది.

నడకకు ఎక్కువ శ్రమ అవసరం లేదు. సాధారణంగా ప్రతి ఒక్కరూ దీన్ని చేయగలరు. నడక మన శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా మానసిక ఆరోగ్యాన్ని కూడా పెంచుతుంది. రోజుకు కేవలం 30 నిమిషాలు నడవడం వల్ల శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఈ రోజు తెలుసుకుందాం..

రోజూ 30 నిమిషాలు నడవడం వల్ల కలిగే ప్రయోజనాలు:

ఆరోగ్యకరమైన బరువు నిర్వహణ

జిమ్‌లో భారీ వ్యాయామం లేదా ఎక్సర్సైజులు చేయలేకపోతే బరువు నిర్వహణ కోసం ప్రతిరోజూ కొన్ని నిమిషాలు నడవండి. ఇది మన శరీరంలో ఉండే అదనపు కొవ్వును తగ్గిస్తుంది. వాస్తవానికి, ఈ పద్ధతి మన జీవక్రియను పెంచడం ద్వారా మన జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.

గుండె ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి

రోజూ 30 నిమిషాల నడక కూడా స్ట్రోక్, హై బ్లడ్ ప్రెజర్, టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బుల నుంచి కాపాడుతుందని అనేక పరిశోధనలు వెల్లడించాయి. వాకింగ్ చేయడం వల్ల కార్డియోవాస్కులర్ ఫిట్‌నెస్ మెరుగుపడుతుంది.

ఎముకలు బలపడతాయి

ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు నడిస్తే ఎముకలకు కూడా ప్రయోజనం కలుగుతుంది. అంతేకాదు కండరాలు బలంగా మారుతాయి. కండరాల ఒత్తిడి లేదా ఆర్థరైటిస్ వంటి ఎముకల నొప్పి నుండి శాశ్వత ఉపశమనం పొందడం అంత సులభం కాదు.. అయితే నడక వంటి పద్ధతులను ప్రయత్నించడం ద్వారా చాలా వరకు ఆర్థరైటిస్ నొప్పులను తగ్గించవచ్చు. కీళ్ల నొప్పులతో బాధపడేవారు నిపుణుల సలహా మేరకు నడక ప్రారంభించాలి.

శక్తి స్థాయి పెరుగుతుంది

నడక ద్వారా కూడా శక్తి స్థాయి పెరుగుతుంది. దైనందిన జీవితంలో అల్పాహారం తర్వాత పనికి వెళ్లి, తిరిగి వచ్చి సాధారణ పని చేసి నిద్రపోవడం వల్ల చాలా ప్రతికూలతలు ఉన్నాయి. శరీరం క్రియారహితంగా ఉండటం వల్ల శక్తి త్వరగా తగ్గిపోతుంది. దీనికి విరుద్ధంగా నడక ద్వారా చాలా కాలం పాటు శక్తివంతంగా ఉండగలరు.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది

సులభంగా వైరల్ లేదా జ్వరం బారిన పడితే అది రోగనిరోధక శక్తి బలహీనంగా ఉందనడానికి గుర్తు. ఎవరైనా నిరంతరం బలహీనమైన రోగనిరోధక శక్తితో బాధపడుతుంటే.. అది క్యాన్సర్‌కు కూడా కారణం కావచ్చు. కనుక రోగనిరోధక శక్తిని పెంచడానికి లేదా బలోపేతం చేయడానికి తినే ఆహారంతో పాటు శారీరక దృఢత్వంపై శ్రద్ధ వహించాలి. రోజూ కొన్ని నిమిషాల నడక కూడా రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుందని నిపుణులు అంటున్నారు.

Note: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.