భారతదేశంలో ప్రసిద్ధి చెందిన స్నాక్స్‌లో సమోసాలు, జిలేబీలు అగ్రగాములు. కానీ ఇప్పుడు వీటి వల్ల ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నందున ప్రభుత్వం అలర్ట్ ప్రకటించింది.
ఇకపై సిగరెట్ ప్యాకెట్లపై హెచ్చరికలు ఉన్నట్లే, సమోసాలు, జిలేబీలు, వడాపావ్ వంటి వంటకాలు అమ్మే చోట ఆరోగ్య హెచ్చరిక బోర్డులు తప్పనిసరిగా పెట్టాలని నిర్ణయించారు. నాగ్‌పూర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో దీన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తున్నారు.
సమోసాలు ఎందుకు ప్రమాదకరం?
అధిక ట్రాన్స్ ఫ్యాట్స్: సమోసా మైదా పిండితో తయారు చేసి, డీప్ ఫ్రై చేస్తారు. దీనివల్ల ట్రాన్స్ ఫ్యాట్స్ అధికమవుతాయి. జిలేబీలను కూడా చక్కెర సిరప్‌లో నానబెట్టడం వల్ల అవి అనారోగ్యకరంగా మారుతాయి.
పోషక విలువలు తక్కువ: వీటిలో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు లేవు. తిన్నా తృప్తి రాకపోవడంతో మరింత తినాలనిపిస్తుంది, ఫలితంగా బరువు పెరుగుతుంది.
గుండెపోటు ప్రమాదం: ట్రాన్స్ ఫ్యాట్స్, చెడు కొలెస్ట్రాల్ అధికం. మంచి కొలెస్ట్రాల్ తక్కువగా ఉండడం వల్ల గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదం పెరుగుతుంది.
డయాబెటిస్ రిస్క్: మైదా, చక్కెరల అధికం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయి. దీర్ఘకాలంలో టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశం ఎక్కువ.
ఊబకాయం మరియు ఇతర సమస్యలు: కేలరీలు అధికంగా ఉండటం వల్ల అధిక బరువు, రక్తపోటు, కీళ్ల సమస్యలు, కొవ్వు కాలేయ వ్యాధి రావచ్చు.
ఎలాంటి ఆహారాలు దూరంగా పెట్టాలి?
సమోసాలు, జిలేబీలు మాత్రమే కాకుండా, వడాపావ్, పకోడీలు, టీ బిస్కెట్లు వంటి అధిక కొవ్వు, చక్కెర ఉన్న ఆహారాలను వీలైనంత వరకు దూరంగా ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు.
































