టాక్స్‌ పేయర్స్‌కు హెచ్చరిక! ITR ఫైలింగ్‌కు లాస్ట్ ఛాన్స్ జూలై 31 – పొడిగింపుపై ఊహాగానాలే!

www.mannamweb.com


ITR Filing 2024 Deadline: ఆదాయపు పన్ను శాఖ చట్ట ప్రకారం గడచిన ఆర్థిక సంవత్సరానికి పన్ను రిటర్న్ ఫైల్ చేయాల్సిన గడువు జూలై 31, 2024లో ముగియనుంది. రేపటితో రిటర్న్ ఫైలింగ్ ఆఖరి దినం కావటంతో చాలా మంది ప్రస్తుతం హడావిడిగా ఈ ప్రక్రియను పూర్తి చేసే పనిలో ఉన్నారు. దీనిని మిస్ కావటం వల్ల అనేక నష్టాలు ఉన్నాయి. అయితే, ఐటీఆర్ ఫైలింగ్‌లో కొన్ని సాంకేతిక సమస్యలు వస్తున్నందున ఆ డెడ్ లైన్‌ను అక్టోబరు వరకూ పొడిగిస్తారని కొన్ని ఊహాగానాలు ఉన్నాయి. దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు.

వాస్తవానికి ఎలాంటి ఆలస్యపు రుసుములు లేకుండా పన్ను రిటర్న్ ఫైలింగ్ కోసం సాధారణ పౌరులు గడువుకు ముందే రిటర్న్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఎవరైనా వ్యక్తి జూలై 31 గడువును కోల్పోతే.. వారికి డిసెంబర్ 31, 2024 వరకు ఆలస్య రుసుముతో రిటర్న్‌లను దాఖలు చేయడానికి అవకాశం కల్పించారు. ఈ క్రమంలో పన్ను చట్టంలోని సెక్షన్ 234 ఎఫ్ ప్రకారం పన్ను చెల్లింపుదారులు గరిష్ఠంగా లేట్ ఫైన్ రూపంలో రూ.5,000 వరకు చెల్లించాల్సి ఉంటుంది. అయితే రిటర్న్ ఫైల్ చేస్తున్న వ్యక్తి వార్షిక ఆదాయం రూ.5 లక్షల కంటే తక్కువగా ఉంటే మాత్రం లేటు ఫైలింగ్ కింద రుసుము రూ.1,000కి పరిమితం చేయబడింది.

లేటుగా పన్ను రిటర్న్ ఫైలింగ్ చేస్తే లేటు రుసుముతో పాటు బకాయి పన్ను మెుత్తంపై ఆలస్యమైన కాలానికి నెలకు 1% చొప్పున వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో కొందరు పన్ను చెల్లింపుదారులు మాత్రం ఇప్పటికీ ఫైలింగ్ కోసం చివరి గడువును పొడిగించాలని డిమాండ్ చేస్తున్నారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటి పరిస్థితుల కారణంగా పన్ను చెల్లింపుదారులు ఐటీఆర్ దాఖలు చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ టాక్స్ ప్రాక్టీషనర్స్ పేర్కొంది. దీనిపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ 2024-25 అసెస్‌మెంట్ ఇయర్ కోసం పన్ను రిటర్న్ ఫైల్ చేసే గడువును ఒక నెల పాటు అంటే ఆగస్టు 31 వరకు పొడిగించాలని ఇప్పటికే అభ్యర్థించింది. అయితే ఈ విజ్ఞప్తులపై ఇప్పటి వరకు పన్ను శాఖ నుంచి ఎటువంటి స్పందన రాలేదు.

కొందరు వ్యక్తులకు అక్టోబర్ 31 వరకు అవకాశం:
ఈ క్రమంలో ఏ చట్టం కిందైనా ఆడిటింగ్ అవసరమయ్యే వ్యక్తులు తమ పన్ను రిటర్న్ ఫైల్ చేసేందుకు చివరి గడువు అక్టోబర్ 31, 2024 వరకు పొడిగించినట్లు సీఏ స్పష్టం చేశారు. అయితే ఆదాయపు పన్ను శాఖ ఈ వ్యక్తులకు వారి ITR ఫైల్ చేయడానికి ముందు గుర్తింపు పొందిన చార్టర్డ్ అకౌంటెంట్ నుంచి వారి ఆడిట్ పూర్తి చేయడానికి అదనంగా మూడు నెలల సమయం ఇస్తోంది. ఈ క్రమంలో అంతర్జాతీయ లావాదేవీలలో పాల్గొనే వ్యాపారాల కోసం ఐటీఆర్ ఫైల్ చేయడానికి నవంబర్ 30 చివరి తేదీగా ఇవ్వబడింది.

పన్ను చెల్లింపుపై ప్రయోజనాలు:
ఆదాయపు పన్ను రిటర్న్ సకాలంలో ఫైల్ చేయటం ద్వారా వ్యక్తులు తమ పెట్టుబడులను వివిధ సెక్షన్ల కింద మినహాయింపులు పొందవచ్చు. అలాగే స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్ నష్టాలను క్యారీ ఫార్వాడ్ చేసుకోవచ్చు. అమెరికా, యూకే, కెనడా, ఆస్ట్రేలియాకు వెళ్లేందుకు వీసా కోసం దరఖాస్తు చేసేటప్పుడు గతంలో దాఖలు చేసిన ఆదాయపు పన్ను రిటర్న్ వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. బ్యాంకుల నుంచి రుణాలను పొందటానికి వెళ్లినప్పుడు సైతం పన్ను రిటర్న్స్ అడుగుతారు. వీటికి తోడు మరిన్ని ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు.