‘రాబిన్‌హుడ్‌’ హిట్టా? ఫట్టా?

నితిన్‌ ఖాతాలో హిట్‌ పడి చాలా కాలమైంది. భీష్మ(2020) తర్వాత ఆయనకు ఆ స్థాయి విజయం లభించలేదు.దీంతో మళ్లీ భీష్మ దర్శకుడు వెంకీ కుడుములనే నమ్ముకున్నాడు.


ఆయన దర్శకత్వంలో ‘రాబిన్‌హుడ్‌'(Robinhood Review) అనే సినిమాతో నితిన్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి చిత్రంతో నితిన్‌ హిట్‌ ట్రాక్‌ ఎక్కడా? లేదా? రివ్యూలో చూద్దాం.

కథేంటంటే.. ‍
రామ్‌ (నితిన్‌) అనాథ. చిన్నప్పుడు అతన్ని ఓ పెద్దాయన హైదరాబాద్‌లోని ఓ అనాథ ఆశ్రమంలో చేర్పిస్తాడు. అక్కడ తినడానికి తిండిలేక ఇబ్బందిపడుతున్న తోటి పిల్లల కోసం దొంగగా మారతాడు. పెద్దయ్యాక ‘రాబిన్‌హుడ్‌’ పేరుతో ధనవంతుల ఇళ్లలో చోరీలు చేస్తుంటాడు. అతన్ని పట్టుకోవడం కోసం రంగంలోకి దిగిన పోలీసు అధికారి విక్టర్‌(షైన్‌ చాం టాకో) ఈగోని దెబ్బతీస్తూ ప్రతిసారి దొరికినట్లే దొరికి తప్పించుకుంటాడు. దీంతో విక్టర్‌ రాబిన్‌ని పట్టుకోవడమే టార్గెట్‌గా పెట్టుకుంటాడు.

రాబిన్‌కి ఈ విషయం తెలిసి..దొంగతనం మానేసి జనార్ధన్ సున్నిపెంట అలియాస్ జాన్ స్నో(రాజేంద్రప్రసాద్‌) నడిపే ఒక సెక్యూరిటీ ఏజెన్సీలో జాయిన్ అవుతాడు.(Robinhood Review). అదే సమయంలో ఆస్ట్రేలియాలో సెటిల్ అయిన ఇండియన్ ఫార్మా కంపెనీ అధినేత కుమార్తె నీరా వాసుదేవ్ (శ్రీలీల) ఇండియాకు వస్తుంది. ఆమెకు సెక్యూరిటీగా రాబిన్‌ వెళ్తాడు. ఇండియాకు వచ్చిన నీరాను గంజాయి దందా చేసే రౌడీ సామి(దేవదత్తా నాగే) మనుషులు బంధించి రుద్రకొండ అనే ప్రాంతానికి తీసుకెళ్తారు? సామి వలలో చిక్కుకున్న నీరాను రాబిన్‌హుడ్‌ ఎలా రక్షించాడు? నిరాను రుద్రకొండకు ఎందుకు రప్పించారు? రాబిన్‌హుడ్‌ సడెన్‌గా సెక్యూరిటీ ఏజెన్సీలో ఎందుకు చేరాల్సివచ్చింది? ఈ కథలో ఆస్ట్రేలియా క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే..
రాబిన్‌హుడ్ కథ అంటే ధనవంతుల నుంచి దొంగిలించి పేదవాళ్లకు పంచే ఒక నీతిగల దొంగ స్టోరీ అందరికి తెలిసిందే. తెలుగు సినిమాల్లో ఈ తరహా కథలు చాలానే వచ్చాయి. కానీ ప్రతి సినిమా దానికి తగ్గట్టుగా కొత్త రంగు, రుచి జోడించి ప్రేక్షకులను అలరించింది. రాబిన్‌హుడ్‌ కూడా టైటిల్‌కి తగ్గట్టే రాబిన్‌హుడ్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రం. కథ పరంగా చూస్తే ఇందులో కొత్తదనం ఏది కనిపించదు. శారీరక బలం కంటే, మానసిక బలాన్ని ఎక్కువగా నమ్ముకునే హీరో.. దొంగతనం చేసి అవసరం ఉన్నవాళ్లకు పంచడం..కథ ఇదే లైన్‌లో సాగుతుంది. ఇక్కడ హీరో అనాథ పిల్లల కోసం దొంగతనం చేస్తుంటాడు. ఆ పాయింట్‌ వినగానే అందరికి రవితేజ ‘కిక్‌’ గుర్తొస్తుంది. కానీ పూర్తిగా ‘కిక్‌’ థీమ్‌ని అనుసరించలేదు.

కథలో డిఫరెంట్‌ డిఫరెంట్‌ లేయర్స్‌ ఉంటాయి. చివరకు వాటి మధ్య ఉన్న సంబంధం రివీల్‌ అవుతుంది. ఈ ట్విస్టులు సాధారణ ప్రేక్షకులకు కిక్‌ ఇస్తాయి. ఫస్టాప్‌ మొత్తం ఫన్‌జోన్‌లో సాగుతుంది. హీరో చిన్నప్పుడే ఎందుకు దొంగగా మారాల్సి వచ్చిందో తెలియజేస్తూ కథను ప్రారంభించాడు దర్శకుడు. హీరోను పట్టుకోవడానికి వచ్చిన పోలీసులను బురిడి కొట్టించే సీన్లన్ని పాత సినిమాను గుర్తు చేస్తాయి. హీరోయిన్‌ ఎంట్రీ తర్వాత కథనం కామెడీతో పరుగులు పెడుతుంది. వెన్నెల కిశోర్‌, రాజేంద్రప్రసాద్‌ మధ్య వచ్చే సన్నివేశాలల్లో కామెడీ బాగా పండింది(Robinhood Review)

ముఖ్యంగా నీరా దగ్గర మంచి మార్కులు కొట్టేసేందుకు జాన్ స్నో చేసే ప్రయత్నాలు నవ్వులు పూయిస్తాయి. కామెడీ సీన్లతో ఫస్టాఫ్‌ ఎంటర్‌టైనింగ్‌గా సాగుతుంది. ఇంటర్వెల్‌ ట్విస్ట్‌ బాగుంటుంది. ఇక సెకండాఫ్‌లో కథనం కాస్త సాగదీసినట్లుగా అనిపిస్తుంది. విలన్‌ చుట్టూ సాగే సన్నివేశాలు అంతగా ఆకట్టుకోలేవు. కథనం కూడా కొంతవరకు ఊహకందేలా సాగుతుంది.

కొన్ని ట్విస్టులు ఆకట్టుకున్నప్పటికీ.. రాబిన్‌ అసలు రుద్రకోండకు ఎందుకు వచ్చాడనేది తెలిసిన తర్వాత మళ్లీ రొటీన్‌ మూడ్‌లోకి వెళ్లిపోతాం. అదే సమయంలో వచ్చిన అదిదా సర్‌ప్రైజ్‌ సాంగ్‌ కాస్త ఉపశమనం కలిగిస్తుంది. ‘ట్రూత్ ఆర్ డేర్‌’ సీన్ ఒకటి నవ్వులు పంచుతుంది. డేవిడ్‌ వార్నర్‌ పాత్ర మినహా క్లైమాక్స్‌ రొటీన్‌గానే ఉంటుంది. అయితే వార్నర్‌ పాత్రను సరైన ముగింపు ఇవ్వకుండా.. పార్ట్‌ 2 కూడా ఉంటుందని హింట్‌ ఇచ్చేశారు.

ఎవరెలా చేశారంటే..
రాబిన్‌హుడ్‌ పాత్రలో నితిన్‌ చక్కగా నటించాడు. అతని కామెడీ టైమింగ్‌ సినిమాకు ప్లస్‌ అయింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో పలు సన్నివేశాల్లో అతని నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. శ్రీలీల పాత్ర పరిమితంగా ఉన్నప్పటికీ, తెరపై చాలా అందంగా కనిపించింది. నటనపరంగా ఆమెకు పెద్దగా స్కోప్‌ ఉన్న పాత్రమేది కాదు. దేవదత్త పాత్ర మొదట్లో భయపెట్టేలా అనిపించినా, చివర్లో కాస్త నీరసంగా మారి ప్రేక్షకులను నిరాశపరిచింది.రాజేంద్రప్రసాద్‌, వెన్నెల కిశోర్‌ల కామెడీ బాగా వర్కౌట్‌ అయింది. ఇద్దరు తమదైనశైలీలో నటించి నవ్వులు పూయించారు.డేవిడ్ వార్నర్ స్క్రీన్‌పై చాలా తక్కువ సమయం కనిపించినప్పటికీ, అతని ఎంట్రీతో థియేటర్లలో విజిల్స్ మారుమోగేలా అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్ చూపించాడు. శుభలేక సుధాకర్‌, షైన్‌ చాం టాకోతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.

సాంకేతికంగా సినిమా పర్వాలేదు. జీవి ప్రకాశ్‌ నేపథ్య సంగీతం సినిమాకు మరో ప్లస్‌ పాయింట్‌. పాటలు వినడానికి బాగున్నా..తెరపై చూస్తే అంతగా ఆకట్టుకోలేవు. కథలో వాటిని ఇరికించినట్లుగా అనిపిస్తాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్‌ పర్వాలేదు. మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ సినిమాకు భారీగానే ఖర్చు చేసినట్లు సినిమా చూస్తే అర్థమవుతుంది. సినిమాను చాలా రిచ్‌గా తీర్చిదిద్దారు.