Karnataka High Court: ”చైల్డ్ పోర్నోగ్రఫీ”ని చూడటం నేరం కాదని, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని నిబంధనల ప్రకారం ఇది నేరాన్ని ఆకర్షించదని కర్ణాటక హైకోర్టు తీర్పు చెప్పింది.
పిల్లల అశ్లీల వెబ్‌సైట్‌ని 50 నిమిషాలు చూశాడనే ఆరోపణలతో ఒక వ్యక్తిపై నమోదైన కేసును కర్ణాటక హైకోర్టు తోసిపుచ్చింది. పిటిషనర్‌పై అశ్లీల వెబ్‌సైట్ చూశాడని ఆరోపణలు వచ్చాయి. ”కోర్టు దృష్టిలో IT చట్టంలోని సెక్షన్ 67B ప్రకారం వాటిని ప్రసారం చేయడం, షేర్ చేయడం నేరం. దీనికి మించి పిటిషన్‌కి వ్యతిరేకంగా ఎలాంటి ఆరోపణలు లేవు. 2008లోని సెక్షన్ 67B ప్రకారం వాటిని వీక్షించడం నేరం కాదు” అని జస్టిస్ నాగప్రసన్నతో కూడిన సింగిల్ బెంచ్ తీర్పును ఇచ్చింది. ఈ కేసు నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి ఉపశమనం కలిగించింది.
బెంగళూర్ హోసా కోట్‌కి చెందిన 46 ఏళ్ల వ్యక్తి ఇనాయతుల్లా ఎన్, మార్చి 23, 2022న పిల్లల అశ్లీల వీడియోలను వీక్షించాడని ఆరోపించారు. ఈ సంఘటనని సైబర్ టిప్‌లైన్ గుర్తించింది. ఇనాయతుల్లా మొబైల్ నంబర్ ఐపీ అడ్రస్‌ని ట్రాక్ చేసిన తర్వాత మే 3, 2023న అధికారికంగా ఫిర్యాదు నమోదు చేయబడింది. ఐటీ చట్టంలోని సెక్షన్ 67B కింద క్రిమినల్ ప్రొసీడింగ్‌లను ప్రారంభించింది. అయితే, ఈ కేసు ఈ చట్టం కిందకు వస్తుందా..? లేదా..? అనేదానిపై కోర్టు విచారించింది. పిల్లలకు సంబంధించిన అశ్లీల వీడియోలను ప్రసారం చేయడం, ప్రచురించడం నేరం. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఎలాంటి కంటెంట్‌ని ప్రసారం చేయడం లేదా ప్రచురించడం చేయలేదని, కేవలం వీక్షించాడని పిటిషనర్ తరుపు న్యాయవాది కోర్టులో వాదించారు.
ఇరు పక్షాల వాదనలు విన్న జస్టిస్ ఎం నాగప్రసన్న, ఐటీ చట్టంలోని 67బీలో పేర్కొన్న ప్రమాణాలకు అనుగుణంగా ఆరోపణలు లేవని తేల్చారు. ఈ చట్టం ద్వారా అశ్లీల వీడియోలు ప్రసారం లేదా ప్రచురించే వారిని మాత్రమే టార్గెట్ చేస్తుందని, వీక్షించే వారిని కాదని కోర్టు పేర్కొంది.