కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ కుమారుడు రైహాన్ వద్రా త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. తన చిన్ననాటి స్నేహితురాలు అవివా బేగ్‌తో ఆయనకు ఇటీవలే నిశ్చితార్థం జరిగింది. ఈ సంతోషకరమైన విషయాన్ని రైహాన్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ వాద్రా, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాల కుమారుడు రైహాన్ వాద్రా ఒక ఇంటివాడు కాబోతున్నారు. తన చిన్ననాటి ప్రేయసి అవివా బేగ్‌తో ఆయన నిశ్చితార్థం వైభవంగా జరిగింది. సోమవారం (డిసెంబర్ 29, 2025) జరిగిన ఈ ప్రైవేట్ వేడుకకు సంబంధించిన ఫోటోలను రైహాన్ స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
ఇన్‌స్టాగ్రామ్‌లో తీపి కబురు..
తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో రెండు ఆసక్తికరమైన ఫోటోలను పోస్ట్ చేశారు రైహాన్ వాద్రా. ఒక ఫోటోలో కొత్త జంట కలిసి పోజులివ్వగా, రెండోది వారిద్దరి చిన్ననాటి ఫోటో కావడం విశేషం. దీనికి “29.12.25” అనే తేదీని మాత్రమే క్యాప్షన్‌గా ఇచ్చారు.
చిన్నప్పటి నుంచి స్నేహితులుగా ఉండి, ఇప్పుడు జీవిత భాగస్వాములుగా మారబోతున్న ఈ జంటను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సోషల్ మీడియాలో అభిమానులు, శ్రేయోభిలాషుల నుంచి వీరికి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు అందుతున్నాయి.
ఇవే ఫొటోలను ప్రియాంక గాంధీ సైతం తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. “లవ్ యూ బోత్” అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఇద్దరు కలిసుండాలని ఆకాంక్షిస్తున్నట్టు రాసుకొచ్చారు.
కళాకారుడిగా రైహాన్ వాద్రా..
రైహాన్ వాద్రా కేవలం రాజకీయ కుటుంబానికి చెందిన వ్యక్తి మాత్రమే కాదు, ఆయనో ప్రతిభావంతుడైన విజువల్ ఆర్టిస్ట్ కూడా. పదేళ్ల ప్రాయం నుంచే ఫోటోగ్రఫీపై ఆసక్తి పెంచుకున్న రైహాన్, వైల్డ్‌లైఫ్ (వన్యప్రాణులు), స్ట్రీట్ ఫోటోగ్రఫీ, కమర్షియల్ ఫోటోగ్రఫీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. 2021లో దిల్లీలోని బికనీర్ హౌస్‌లో ‘డార్క్ పర్సెప్షన్’ పేరుతో తన మొదటి సోలో ఎగ్జిబిషన్‌ను నిర్వహించారు. అలాగే కోల్‌కతాలో జరిగిన ‘ది ఇండియా స్టోరీ’ ప్రదర్శనలోనూ ఆయన పాలుపంచుకున్నారు.
దిల్లీకి చెందిన అవివా బేగ్ కూడా సృజనాత్మక రంగంలో రాణిస్తున్నారు. దిల్లీలోని మోడర్న్ స్కూల్‌లో పాఠశాల విద్యను పూర్తి చేసిన ఆమె, తర్వాత ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ నుంచి మీడియా కమ్యూనికేషన్స్ అండ్ జర్నలిజంలో పట్టా పొందారు. ప్రస్తుతం ఆమె తన తల్లి బాటలోనే ప్రసిద్ధ ఇంటీరియర్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. అంతేకాకుండా ఫోటోగ్రఫీ, ప్రొడక్షన్ రంగాల్లోనూ ఆమెకు ప్రవేశం ఉంది.
సామాజిక సమస్యల పట్ల స్పందిస్తూ, సమాజంలో సానుకూల మార్పు తీసుకురావడమే లక్ష్యంగా ఆమె పనిచేస్తున్నారు. అవివా జాతీయ స్థాయి మాజీ ఫుట్‌బాల్ క్రీడాకారిణి కూడా కావడం విశేషం.
అవివా కుటుంబం దిల్లీలోనే స్థిరపడింది. ఆమె తండ్రి ఇమ్రాన్ బేగ్ ప్రముఖ వ్యాపారవేత్త కాగా, తల్లి నందితా బేగ్ ఇంటీరియర్ డిజైనర్. వాద్రా, బేగ్ కుటుంబాల మధ్య దశాబ్దాలుగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ప్రియాంకా గాంధీ, నందితా బేగ్ మంచి స్నేహితులు. పిల్లల వివాహంతో ఇప్పుడు వీరిద్దరూ వియ్యంకులు కాబోతున్నారు.




































