Viral news : ఈ రోజుల్లో పెళ్లి (Marriage) అంటే పెద్ద హంగామా..! భారీ ఫంక్షన్ హాల్ (Function hall), అదిరిపోయే డెకరేషన్ (Decoration), కలర్‌ఫుల్ లైటింగ్, వందల వెరైటీల్లో వంటకాలు, డీజేల మోత తదితరాలు ఉంటాయి. కానీ విదేశాల్లో ఉంటున్న ఓ పంజాబ్ (Punjab) జంట మాత్రం అందుకు భిన్నంగా ఆలోచించింది. పైన చెప్పిన హంగులు, ఆర్భాటాలు ఏవీ లేకుండా పంట పొలాల్లో పెళ్లి చేసుకుంది. ఢిల్లీ సరహద్దుల్లో ఎన్నో ప్రయాసలకు ఓర్చి రైతులు చేసిన ఆందోళనలే తాము పంట పొలాల్లో పెళ్లి చేసుకోవడానికి కారణమని ఆ జంట తెలిపింది.
వివరాల్లోకి వెళ్తే.. అది పంజాబ్ రాష్ట్రం ఫిరోజ్‌పూర్ జిల్లాలోని కారీ కలాన్ గ్రామం. ఆ గ్రామ పరిసరాలు పచ్చని పైర్లతో ప్రకృతి రమణీయతను సంతరించుకుని ఉంటాయి. గత బుధవారం కారీ కలాన్ గ్రామ శివార్లలోని పంట పొలాల్లో ఉన్నట్టుండి టెంట్లు వెళిశాయి. వాటికి రంగురంగుల లైటింగ్స్ వెలుగులు తోడయ్యాయి. పచ్చని పొలాల్లో ఆ వెలుగు జిలుగుల నడుమ, బంధుమిత్రుల సమక్షంలో దుర్లభ్ సింగ్ (Durlab Singh), హర్మన్ కౌర్ (Harman Kaur) జంట ఒక్కటైంది.
అంతకుముందు వధువు హర్మన్ కౌర్ భారీ ఊరేగింపుతో వరుడు దుర్లభ్ ఇంటికి చేరింది. తర్వాత అక్కడి నుంచి ఊరి బయట పొలాల్లో ఏర్పాటు చేసిన పెళ్లి మండపంపైకి వచ్చింది. ఆ తర్వాత బంధుమిత్రుల సమక్షంలో వధూవరులు ఒక్కటయ్యారు. పెళ్లిమండపాన్ని రకరకాల మొక్కలతో అలంకరించారు. పెళ్లి అనంతరం వాటిని చుట్టాలకు పంచారు. అదేవిధంగా రైతుల నినాదాలు ముద్రించిన స్వీట్ బాక్సులను పంచిపెట్టారు. రైతులు ఉత్పత్తి చేసిన తేనె సీసాలను అందజేశారు.
ఈ పెళ్లికి సంబంధించిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రైతుల ఆందోళనలను ఆదర్శంగా తీసుకుని పంట పొలాల్లో పెళ్లి చేసుకున్న యువ జంటన అభినందిస్తున్నారు. కాగా దుర్లబ్ సింగ్, హర్మన్ కౌర్‌లు ప్రస్తుతం కెనడాలో సాఫ్టవేర్ ఇంజినీర్‌లుగా పనిచేస్తున్నారు.