వారానికోసారి క్రెడిట్‌ స్కోర్‌ అప్‌డేట్‌.. రిజర్వ్‌ బ్యాంక్‌ కొత్త మార్గదర్శకాలు

క్రెడిట్‌ స్కోర్‌ గురించి ఇప్పుడు తెలియనివారుండరు. బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్‌బీఎఫ్‌సీ)ల్లో రుణాలు తీసుకోవాలం టే ఈ స్కోర్‌ ఆకర్షణీయంగా ఉండాల్సిందే.


అలాంటి ఈ క్రెడిట్‌ స్కోర్‌కు సంబంధించి తాజాగా జారీచేసిన ముసాయిదా మార్గదర్శకా ల్లో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) పలు కీలక నిర్ణయాలను తీసుకున్నది. దేశీయం గా రుణాల నిర్మాణాన్ని బలోపేతం చేయడాని కి తెచ్చిన ఈ గైడ్‌లైన్స్‌ వచ్చే ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి రానుండగా.. వీటి ప్రకారం క్రెడిట్‌ ఇన్ఫర్మేషన్‌ కంపెనీ (సీఐసీ)లు, రుణదాతలు తప్పుడు సమాచారం ఇస్తే జరిమానాలు తప్పవు.

15 రోజులకోసారి కాదు..

ప్రస్తుతం 15 రోజులకోసారి క్రెడిట్‌ స్కోర్‌ను అన్ని సీఐసీలు అప్‌డేట్‌ చేస్తున్నాయి. అయితే వచ్చే ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి వారానికోసారి అప్‌గ్రేడ్‌ చేయనున్నాయి. ప్రతీ నెల 7, 14, 21, 28 తేదీల్లో సీఐసీలు డాటాను అప్‌డేట్‌ చేయాల్సిందే. అలాగే ప్రతి నెలా 3కల్లా బ్యాం కులు, ఎన్‌బీఎఫ్‌సీలు ఖాతా ఓపెనింగ్‌, క్లోజిం గ్‌ వివరాలతోపాటు క్రెడిట్‌ స్కోర్‌ను ప్రభావితం చేసే మార్పులను, లోన్‌ స్టేటస్‌లోని ఛేంజెస్‌ను క్రెడిట్‌ బ్యూరో (ట్రాన్స్‌యూనియన్‌ సిబిల్‌ వంటివి)లకు పంపించేయాల్సి ఉంటుంది. ఫలితంగా రుణాలను ఆశించేవారు మెరుగైన క్రెడిట్‌ స్కోర్‌ కోసం ఇక ఎంతోసేపు వేచిచూడాల్సిన పనిలేదన్నమాట.

ఇవే ప్రయోజనాలు

  • లోన్‌ లేదా క్రెడిట్‌ కార్డు క్లోజర్‌ గురించి అదే రోజు బ్యాంకులు తప్పనిసరిగా సిబిల్‌కు తెలియపర్చాలి. ప్రస్తుతం చాలా సమయం పడుతున్నది. దీనివల్ల కస్టమర్లకు కొత్త రుణాల విషయంలో సమస్యలు ఎదురవుతున్నాయి. నూతన మార్గదర్శకాలు అమలైతే ఈ సమస్య ఉండదు.
  • కస్టమర్‌ అనుమతి లేకుండా బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు క్రెడిట్‌ రిపోర్టుల్లో తలదూర్చలేవు. దీనివల్ల అనవసరంగా సిబిల్‌ స్కోర్‌లో పతనం ఉండదు. క్రెడిట్‌ ప్రొఫైల్స్‌ భద్రంగా ఉంటాయి.
  • బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు ఖాతాదారుల గురించి తప్పుడు సమాచారాన్ని సీఐసీలకు ఇచ్చినట్టు తేలితే, సీఐసీలు నిర్లక్ష్యంగా వ్యవహరించినా భారీ జరిమానాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీంతో కచ్చితత్వంతో కూడిన సమాచారమే బదిలీ అవుతుంది. అంతటా పారదర్శకత ఉంటుంది. అలాగే సకాలంలో బ్యాంక్‌ సమాచారాన్ని పంపకపోతే సీఐసీలు ఆర్బీఐ దక్ష్‌ పోర్టల్‌లో ఫిర్యాదు చేయవచ్చు.
  • క్రెడిట్‌ స్కోర్‌ అప్‌డేట్‌ సమయం తగ్గితే బ్యాంకులూ రుణగ్రహీతలకు మరింత ప్రభావవంతమైన వడ్డీరేట్లు, టెన్యూర్‌ను ఆఫర్‌ చేయవచ్చు. దీనివల్ల ఇటు కస్టమర్లకు, అటు రుణదాతలకూ లాభమే.

క్రెడిట్‌ స్కోర్‌ను ఎలా చెక్‌ చేసుకోవచ్చు?

సిబిల్‌ అధికారిక వెబ్‌సైట్‌ www.cibil.com ద్వారా మన క్రెడిట్‌ స్కోర్‌ను ఉచితంగానే తెలుసుకోవచ్చు. అయితే ఇది ఏడాదికి ఒక్కసారే అందుబాటులో ఉంటుంది. అలాకాకుండా రూ.550 చెల్లించి మంత్లీ సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ తీసుకుంటే సిబిల్‌ వెబ్‌సైట్‌ ద్వారా అనేకసార్లు క్రెడిట్‌ స్కోర్‌ను చూసుకోవచ్చు. అయితే గూగుల్‌పే వంటి చాలా బ్యాంకింగ్‌ సర్వీస్‌ అగ్రిగేటర్లూ ఈ క్రెడిట్‌ స్కోర్‌ చెకింగ్‌ సదుపాయాన్ని ఫ్రీగానే అందిస్తున్నాయి.

చివరగా..

క్రెడిట్‌ స్కోర్‌ అనేది 300 నుంచి 900 వరకు ఉంటుంది. 750-900 మధ్య ఉంటే చాలా బాగున్నట్టు. 650-750 వరకు ఉంటే బాగుందని, 550-650గా ఉంటే పర్వాలేదని, 300-550గా ఉంటే బాగాలేదని అర్థం. స్కోర్‌ బాగుంటే రుణ సదుపాయం త్వరగా అందడమేగాక, వడ్డీరేట్లూ తక్కువగా ఉంటాయి. ఆర్థిక క్రమశిక్షణతో ముందుకెళ్తే స్కోర్‌ బాగుంటుంది. ఇందుకు రుణాల చెల్లింపులు, క్రెడిట్‌ కార్డు బిల్‌ పేమెంట్స్‌ సవ్యంగా ఉండాలి. ఎగవేతలు, చెక్‌ బౌన్సులుంటే స్కోర్‌ పోతుంది. డిఫాల్టర్‌ ముద్రపడే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అనవసరపు రుణాల జోలికి వెళ్లకపోవడమే ఉత్తమం.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.