టామ్ కారోల్ అనే ఈ 6 అడుగుల 2 అంగుళాల ఎత్తు గల వ్యక్తి, బోస్టన్‌లోని ఒక రేడియో స్టేషన్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నాడు. అతని బరువు తగ్గే ప్రయాణం 2023 జులైలో ప్రారంభమైంది.
సిరక్యూస్‌లో జరిగిన ఒక వివాహానికి హాజరైన సమయంలో అనుకోకుండా అతడు తన బరువును చెక్ చేసుకున్నాడు. అప్పటికి అతడు 163 కిలులున్నాడు. అది చూసుకుని టామ్ కు గుండెజారినంత పనైంది. తింటూ తింటూ ఎప్పుడింతలా బరువు పెరిగిపోయాడో తెలియక ఆందోళనకు గురయ్యాడు.
కానీ అసలైన మేల్కొలుపు మాత్రం 2023 బ్లాక్ ఫ్రైడే రోజున వచ్చింది. ఓ పార్టీలో తన భార్య, స్నేహితులతో తింటున్నప్పుడు, అతనికి గుండెపోటు వచ్చినట్లు అనిపించింది. “నాకు ఇంతకు ముందు అలాంటి అనుభవం ఎప్పుడూ కలగలేదు, మళ్లీ అలా జరగకూడదని ఆశిస్తున్నాను,” అని అతను రాసాడు. “అది నాకు మరణానికి దగ్గరగా అనిపించిన క్షణం.” అని 34 ఏళ్ల టామ్ తెలిపాడు. ఇక ఆ తర్వాత ఏడాదిలోనే దాదాపు 60 కిలోల బరువు తగ్గి అందరికీ షాకిచ్చాడు. ఇంతకీ తన బరువును ఇంతలా తగ్గించింది ఏంటో తెలుసా.. ఓ సలాడ్.
కారోల్ రోజూ మధ్యాహ్న భోజనంలో చిక్-ఫిల్-ఏ సలాడ్ తినడం మొదలుపెట్టాడు. ఈ సలాడ్‌లో మిక్స్‌డ్ గ్రీన్స్, టొమాటోలు, వేయించిన మొక్కజొన్న, బ్లాక్ బీన్స్, మిరపకాయలు, ఎర్రటి బెల్ పెప్పర్స్, చీజ్, గ్రిల్డ్ చికెన్ మరియు టార్టిల్లా స్ట్రిప్స్, పెపిటాస్, క్రీమీ సాల్సా డ్రెస్సింగ్ వంటి టాపింగ్స్ ఉంటాయి. ఇది సుమారు 680 కేలరీలు కలిగి ఉంటుంది. “నా ఆహారంలో మార్పు చేయకముందు నేను చాలా బాధపడ్డాను,” అని కారోల్ గుర్తు చేసుకున్నాడు. “మెట్లు ఎక్కడం కష్టంగా ఉండేది. విమానంలో సీట్ బెల్ట్ ఇబ్బందిగా ఉండేది. బట్టలు వేసుకోవడం, నాకు సరిపడే దుస్తులు కనుక్కోవడం.. ఇవన్నీ నాకెంతో బాధగా అనిపించేవి.” అని గుర్తుచేసుకున్నాడు.
అతను తరచూ ఈ సలాడ్‌ను ఇంట్లో రాత్రి భోజనం కోసం తయారు చేసుకునేవాడు. చిక్-ఫిల్-ఏ ఆదివారాలు దొరకదనే భయంతో ముందుగానే అదనంగా కొనుగోలు చేసేవాడు. “ఈ భోజనం నా రోజువారీ ఆహారంలో ప్రధానమైంది. నా పురోగతికి ఎక్కువ భాగం దీనికే కారణమని చెప్తాను,” అని అతను అన్నాడు. అతని ఇతర భోజనాలు తేలికగా ఉండేవి. సాధారణంగా ఉదయం పెరుగు పండ్లు మాత్రమే తినేవాడు. అది కూడా కొన్నిసార్లు మానేసేవాడు.
కొత్త ఆహారపు అలవాట్లతో పాటు, కారోల్ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మొదలుపెట్టాడు. సోడా, స్పోర్ట్స్ డ్రింక్స్, ఆల్కహాల్‌ను పూర్తిగా మానేశాడు. ఇవి అనవసరమైన కేలరీలను జోడించడమే కాకుండా, అనారోగ్యకరమైన ఆహార ఎంపికలకు దారితీసేవని అతను చెప్పాడు. 2023 డిసెంబర్ నాటికి అతని బరువు 300 పౌండ్ల కంటే తక్కువకు తగ్గింది. 2024 జులై నాటికి అతని బరువు 103 కేజీలకు చేరుకుంది. అప్పటి నుండి అతను దాన్ని స్థిరంగా కాపాడుకుంటున్నాడు.